ఒకప్పుడు పేదలను అక్కున చేర్చుకున్న ‘సర్ సిల్క్’ పరిశ్రమ ఇక గత చరిత్రే!!
మూతపడిన నిజాం కాలం నాటి డిబిఆర్ మిల్స్, నిజాం షుగర్స్ ను తెరిచే విషయం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది
సర్ సిల్క్ పరిశ్రమ నిజాం కాలం లో వెనుకబడిన అదిలాబాద్ జిల్లా లో పారిశ్రామిక ప్రగతికి వేస్తున్న తొలి అడుగులలో భాగంగా పడిన ఒక ముందడుగు. 1946 లో మొదలైన కంపెనీ 1985 వరకూ తన నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారులను మెప్పించింది. తెలంగాణకు గర్వకారణంగా నలిచి వేలాది మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకుంది. ప్రస్తుతం కంపెనీ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయనుండటం తో అది చరిత్ర లో చివరి మజిలీ కి చేరినట్టు అయ్యింది.
నిజాం రాజ్యం లో పారిశ్రామీకరణ:
నిజాం జమానా లో పారిశ్రామీకరణ అడుగులు 1874 ప్రాంతంలో మొదలయ్యాయి. మొదటి యాంత్రిక వర్క్ షాప్ అప్పుడే మొదలయ్యింది. ఆ శతాబ్దం చివరికి సికింద్రాబాద్ లో రెండు రైల్వే వర్క్ షాపులు మొదలు అయ్యాయి. వీటితో పాటు పత్తి జిన్నింగ్ స్పిన్నింగ్ ఫ్యాక్టరీ తో పాటు ఒక టైల్స్ పరిశ్రమ హైదరాబాద్ లో నెలకొల్పారు. ఒక వెయ్యి మెగావాట్ల బొగ్గు ఆధారిత స్టేషన్ పెట్టడం తో అది చిన్న మద్య తరహా సిగరెట్, టైల్స్, ఇనుప ఫౌండరీ యితర పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. 1929 నుండి 1933 మధ్యన ప్రభుత్వ ప్రోత్సాహం తో హైదరాబాద్ పారిశ్రామిక ప్రగతి సాధించింది. 1929 లో పది మిలియన్ ల నిధి ఏర్పాటుతో పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు సులభతర షరతులతో అప్పులు యిచ్చేందుకు అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ పారిశ్రామిక ప్రగతి కి రెండవ ప్రపంచ యుద్ద కాలం లో మరింత ఊతం లభించింది. ఇక్కడి ఉత్పత్తి దారులకు బయటి నుండి పోటీ లేకుండా ఒక రక్షిత మార్కెట్ లభించింది. దీనివలన పరాగ టూల్స్, ఆల్విన్ మెటల్ వర్క్స్ ను యుద్ద అవసరాల ను తీర్చడానికి ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్మికులకు అధిక వేతనాలకు పరిశ్రమలలో ఉద్యోగాలు దొరికాయి.
19 శతాబ్దం చివరి నుండి 20 వ శతాబ్దం మొదటి వరకు హైదరాబాద్ లో అలా ఆధునిక పరిశ్రమ ఎదిగింది. ఇందులో పత్తి ఆధారిత పరిశ్రమ ముఖ్యమైనది. పత్తి తరువాత పట్టు పరిశ్రమ నల్గొండ, వరంగల్, నారాయణపేట, సంగారెడ్డి లో వుండేది. సిల్క్ దుపట్టాలు, శర్వాణీలు, షర్ట్ లు మరియు పైజామాలు వరంగల్, నల్గొండ లో తయ్యారు అయ్యేవి.
సర్ సిల్క్ పరిశ్రమ అంతర్ధానం వైపు అడుగులు వేస్తుండగా ప్రక్కన వున్న సిర్పూర్ పేపర్ మిల్లు విజయవంతంగా నడుస్తోంది.
సర్ సిల్క్ పరిశ్రమ చరిత్ర:
సిర్పూర్ కాగజ్ నగర్ లోని సర్ సిల్క్ కు సంబంధించిన 48.23 ఎకరాల భూమి ని నవంబర్ 20 తారీఖున ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. బిడ్ దాఖలు చేయాలనుకునే వాళ్ళు రు. 2,000 వేలం లో పాల్గొనేందుకు ఫీజు చెల్లించి (ఈఎండీ) బయానా కింద రు. 5.33 కొట్లు చెల్లించాలి. బిడ్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ నవంబర్ 18. అధికారిక లిక్విడేటర్ నిర్ణయించిన ధర రు. 53.33 కొట్లు.
ఈ పరిశ్రమను నిజాం ప్రభుత్వం 1939 లో ప్రారంభించింది. 1947 లో ఉత్పత్తి ప్రారంభం కాగా 1952 లో దీనిని బిర్లా యాజమాన్యానికి అప్పగించారు. అప్పటినుండి 1984 వరకు ఫ్యాక్టరీ సజావుగా సాగింది. 1984 లో లే ఆఫ్ ప్రకటించి సగం మంది కార్మికులకు మాత్రమే పని కల్పించడం మొదలు పెట్టారు. పరిశ్రమ మూసివేతకు ముడిసరుకు పై ప్రభుత్వం సబ్సిడీ తొలగించడం, గుర్తింపు కార్మిక సంఘం తో విభేదాలు రావడం తో 1985, ఏప్రిల్ 26 న లాకౌట్ ప్రకటించారు. ఈ కంపెనీ సరుకు విదేశాలకు ఎగుమతి అయ్యేది. కృత్రిమ సిల్క్ తయారీకి ముడిసరుకులు ఆల్కహాల్, బొగ్గు, కాటన్ లీoటర్స్. పరిశ్రమకు ఆల్కహాల్ దాని ప్రారంభం నుండి ప్రభుత్వమే సబ్సిడీ పై సరఫరా చేసేది. 1982 లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టింది. దీనికి అయ్యే ఖర్చును రాబట్టేందుకు ‘వారుని వాహిని’ పేరుతో పాకెట్ల ద్వారా సారాను సరఫరా చేసింది. ఈ సమయం లోనే సర్ సిల్క్ పరిశ్రమ కు రైల్వే వ్యాగన్ ల ద్వారా ఆల్కహాల్ సరఫరా అవుతుండటం తో దాని పైన వున్న సబ్సిడీ ని ప్రభుత్వం ఎత్తివేసింది. అప్పుడే కార్మిక నాయకుడిగా ఉన్న ఆలె నరేంద్ర కార్మికుల తరపున వేతనాల విషయం లో యాజమాన్యం తో రాజీ పడకపోవటం తో వాళ్ళు లాక్ అవుట్ ప్రకటించారు. అనంతరం 1994 లో ప్రధాని పీవీ నరసింహా రావు, ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి దాని పునఃప్రారంభించినా ఏడాది గడవక ముందే మూతపడింది.
దీనితో మిల్లు స్థలం లో మరో పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా నాయకులు హామీలు యిచ్చినా అవి నీతి మూటలు అయ్యాయి. కాగా ప్రక్కన ఉన్న పేపర్ మిల్లు యాజమాన్యమే ఈ స్థలాన్ని తీసుకోబోతున్నారని అందులో తమ ఫ్యాక్టరీ విస్తరణ కోసం వాడుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
సర్ సిల్క్ మూసివేత:
దీనితో లాక్ అవుట్ అయిన కాలం నుండి రాజకీయ పార్టీలకు ఎన్నికల సందర్భంగా ఒక నినాదంగా వాగ్దానంగా వుండిన దాని పునరుద్దరణ ఇక గత చరిత్రే. ఈ చర్య 4,000 మంది కార్మికులకు జీవనోపాధి లేకుండా చేసి వారి కుటుంబాలను చిన్నభిన్నం చేసింది. దాన్ని మళ్ళీ తెరిపిస్తామన్న నాయకుల వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలిన తర్వాత కార్మికులు సూరత్, బాంబే, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళి జీవనం సాగించారు. ఆ కంపెనీ కార్మికులు ముగ్గురు కె. వి. నారాయణ రావు, కోనేరు కొనప్ప, కావేటి సమ్మయ్య అసెంబ్లీ కి ఎన్నిక అయినా కంపెనీ పునరుద్దరణ ను మాత్రం సుగమం చేయలేక పోయారు.
కంపెనీ మొదట స్థాపించిన వివరాల తో ఉన్న శిలాఫలకం ఆనవాలు లేకపోయినా 16 ఏప్రిల్, 1994 లో దాని పునరుద్దారణకు అప్పటి ప్రధాని పి. వి. నరసింహ రావు, రాష్ట్ర ముఖ్య మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జౌళి శాఖ మంత్రి జి. వెంకటస్వామి ఆధ్వర్యం లో దానిని పునః ప్రారంభించినట్టు ప్రస్తుతం ఉన్న శిలాఫలకం గుర్తు చేస్తోంది. కానీ కంపెనీ కేవలం కొన్ని నెలలు మాత్రమే నడిచి తిరిగి మూత పడిందని అప్పటి కార్మికులు గుర్తు చేశారు.
ఒకప్పుడు తమ షిఫ్ట్ లకు వచ్చి పోయే కార్మికుల తో హడావిడిగా వుండిన ప్రాంతం మూగబోయి నేటికి 40 సంవత్సరాలు అయ్యింది. సైరన్ మోతలతో జీవం ఉట్టి పడిన కంపెనీ దానిలోని మిగిలిన యంత్రాలను కోర్టు ఆధ్వర్యం లో కార్మికుల బకాయిలు చెల్లించడానికి లిక్విడేటర్ అమ్మివేయగా మిగిలిన యంత్రాలు ఎండా వానకు తుప్పుపట్టి ఉన్నాయి. ఈ ప్రక్రియ జరుగుతుండగా ఎవరికి దొరికింది వారు దోచుకెళ్లారని తద్వారా యింకా కార్మికులకు యింకా బకాయిలు మిగిలే వున్నాయని వారు చెప్పారు. యిప్పుడు కేవలం కొన్ని మొండి గోడలు మాత్రమే ఆ కంపెనీ అనవాళ్ళకు తార్కాణంగా మిగిలాయి. కనీసం చివరగా కంపెనీ స్థలాన్ని వెలవేస్తున్నప్పుడు అయిన తమకు రావలసిన బకాయి వస్తుందని వారు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం పిచ్చి మొక్కలు మొండి గోడలతో ఉన్న కంపెనీ పరిసరాల లో అప్పట్లో పళ్ళు పూల మొక్కలు ఉండి కనీసం నాలుగు అయిదు డిగ్రీ లు వేడి తక్కువగా వుండేదని సిర్పూర్ కాగజ్ నగర్ లో సీనియర్ లాయర్ అయిన వి. కిశోర్ కుమార్ గుర్తు చేసుకున్నారు. పేపర్ మిల్లు మొదట సిర్పూర్ లో పెట్టాలనుకున్నారు కానీ అక్కడ చెదలు ఎక్కువగా వుందని ప్రస్తుత స్థలానికి మార్చారు. కంపెనీ ప్రస్తుతం వున్న స్థలం యిప్పటికీ రెవెన్యూ రికార్డులలో కొత్తపేట గానే నమోదు అయ్యి వుంది. అయితే కాలక్రమేణా కాగిత తయారీకి పేరు పడ్డ ఈ ప్రాంతాన్ని అందరూ కాగజ్ నగర్ అనడం అలవాటు అయిందని ఆయన అన్నారు.
సర్ సిల్క్ కంపెనీ దానికి ఆనుకుని వున్న సిర్పూర్ పేపర్ మిల్లు దాదాపు ఒకే సమయం లో స్థాపించినా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పేపర్ మిల్లు మాత్రమే ఒక సారి లాక్ అవుట్ కు గురిఅయ్యి మళ్ళీ పునరుద్దరణ అయ్యి నడుస్తోంది. సర్ సిల్క్ పరిశ్రమ ఆర్టిఫీషియల్ సిల్క్ దారం తో తయారు చేసే బట్ట చాలా నాణ్యం వుండి చాలా ఏళ్లు మన్నిక అయ్యేదని కిశోర్ గుర్తు చేశారు. పేపర్ మిల్లు మూతపడి తెరిచాక దాని ఉత్పత్తి 120 టన్నుల నుండి 400 టన్నుల వరకు పెరిగింది. పేపర్ మిల్లు తెరవటానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప చేసిన కృషి వలన అది మళ్ళీ తెరుచుకుందని ఆయన చెప్పారు.
కాంట్రాక్ట్ కార్మికుడు మొయినుద్దీన్ అతనితో మరణించిన కార్మికుల కుమారులు జె. శ్రీనివాస్, వై. రంగస్వామి.
ఫ్యాక్టరీ మూసివేతతో కార్మికుల వెతలు:
దాదాపు 4,000 మంది కార్మికులతో అలరారిన ఫ్యాక్టరీ లాక్ అవుట్ తో బోసిపోయిందని గుర్తు చేసుకున్నారు అందులో 26 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికుడి గా పని చేసిన మొయినుద్దీన్ (65). “నేను సైకిల్ షాప్ పెట్టుకుని 15 సంవత్సరాలు నడిపాను. ఫ్యాక్టరీ లో నా జీతం రు. 400. సైకిల్ షాపు ద్వారా నా సంపాదన కేవలం రు. 100 మాత్రమే. ఆదాయం పావు వంతుకు తగ్గిపోవడం తో అది నా పిల్లల చదువుల పైన తీవ్రమైన ప్రభావం చూపింది. తరువాత ఒక నీళ్ళ ప్లాంట్ లో ఒక దుకాణంలో నూ పని చేశాను,” అని వాపోయారు.
తన తండ్రికి ఫ్యాక్టరీ లో ఉద్యోగం పోయేనాటికి తన వయసు 12 సంవత్సరాలని ఆరుగురు పిల్లలు వున్న తమ కుటుంబం అల్లాడి పోయామని ఏదో ఒక పని తాను చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు 52 ఏళ్ల జె. శ్రీనివాస్. “చదువుకోవడానికి ప్రభుత్వ బడులు వున్నా కనీస అవసరాలు తీరని పరిస్థితి లో అప్పుడు వున్నాము. కొలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కార్మిక కుటుంబాలలోని ఆడపిల్లలకు మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం కష్టం అయ్యింది. ఫ్యాక్టరీ లో బొగ్గును కాల్చిన తరువాత దాన్ని ఒక చోట కుప్పగా పోసేవారు. అది ఒక గుట్ట లాగా వుండేది. అందులో బూడిదను జల్లెడ పట్టగా వచ్చిన బొగ్గును అమ్ముకుని కొందరు జీవనం సాగించారు. ఒక్కోసారి వేడిగా వుండే ఆ బూడిద బొగ్గు కార్మికుల పైన పడి చాలా మంది చనిపోయారు,” అని ఆయన చెప్పారు.
కంపెనీ భూముల్లో కార్మికుల ఇళ్లు
కేవలం కొద్ది మంది శాశ్వత కార్మికులకే కంపెనీ ఇల్లు వుండేవి. కోర్టు ఆదేశాల ప్రకారం స్థలాన్ని కార్మికుల గ్రాట్యుటీ నుండి డబ్బు తీసుకుని వాళ్ళకే యిచ్చారని ఆయన చెప్పారు. “ అలా స్థలం దొరకని వాళ్ళు కంపెనీ స్థలం లో ఇల్లు కట్టుకున్నారు వాటిని వాళ్ళకే ఏదో ఒక ధరకు యివ్వాలి. కార్మికుల కంటే బయటి వాళ్ళే ఎక్కువ ఆక్రమించారు. జీవం ఉట్టిపడే పట్టణం ఫ్యాక్టరీ మూతతో తన ప్రాభవాన్ని కోల్పోయింది,” అని వాపోయారు. తమ కుటుంబం కూడా యిలాంటి పరిస్థితి నే ఎదురుకుందని చదువు చట్టు బండలైందని వై. రంగస్వామి (54) గుర్తు చేసుకున్నారు.
కంపెనీ బాయిలర్ విభాగం లో కార్మికుడిగా పనిచేసిన జి. లింగయ్య (69) 1969 నుండి కాంట్రాక్ట్ గా పని చేసి 1974 లో శాశ్వత కార్మికుడు అయ్యారు. 1984 లో లాక్ అవుట్ అయ్యింది. రు. 80 నుండి మొదలైన నా జీతం రు. 450 కి పెరిగింది. ప్రస్తుతం పుట్టుకతో వికలాంగురాలు అయిన నా కూతురు కి వచ్చే రు. 4,000 పెన్షన్ నాకు వచ్చే రు. 2,000 వృద్ధాప్య పెన్షన్ తో మా కుటుంబం బ్రతుకుతోంది. కంపెనీ యాజమాన్యం కార్మిక సంఘం మధ్య వేతనాల పెంపుదల పై జరిగిన ఘర్షణ వలన కంపెనీ మూసివేతకు గురి అయ్యింది, అని చెప్పారు.
పిచ్చి మొక్కల మద్యన మొండి గోడలు మాత్రమే మిగిలిన సర్ సిల్క్ పరిశ్రమ.
టైగర్ నరేంద్ర తుపాకి చూసి కంపెనీ భయపడిందా?
దీనిపైన సిపిఎం జిల్లా కార్యదర్శి అయిన కూషన రాజన్న అప్పట్లో దేశం లో వస్త్ర పరిశ్రమ సంక్షోభం లో వుండినదని చెప్పారు. యాజమాన్యం పైన కార్మిక నాయకుడు టైగర్ ఆలె నరేంద్ర తుపాకి చూపి బెదిరించడం తో వాళ్ళు ఫ్యాక్టరీ ని మళ్ళీ తెరిచే ప్రయత్నం చేయలేదు. పారిపోయి లాక్ అవుట్ ప్రకటించారు. కానీ తెరవెనుక యిది వారి మద్యన జరిగిన ఒప్పందం మేరకే జరిగిందని కూడా ఒక వాదన వుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీ స్థలాన్ని వేలం వేయకుండా పిల్లలకు ఆట స్థలంగా కేటాయించాలని కలెక్టర్ ను కోరతాము. యిక్కడ ఏర్పాటు చేయాల్సిన జిల్లా కేంద్రం ప్రభుత్వ స్థలం లేక ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేశారు. అప్పట్లో పేపర్ మిల్లు కంటే సర్ సిల్క్ కార్మికులకే ఎక్కువ జీతాలు వచ్చేవని గుర్తు చేశారు.
సర్ సిల్క్ బట్ట నాణ్యత:
సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణం లో రోషణి క్లాత్ స్టోర్ బట్టల దుకాణం నడుపుతూ ఒకప్పుడు సర్ సిల్క్ లో తాత్కాలిక కార్మికుడిగా పని చేసిన గోపీచంద్ కటియార్ సర్ సిల్క్ మంచి పరిశ్రమ అని కితాబు యిచ్చారు. చాలా మంది నిపుణులైన పద్మశాలి కార్మికులు సూరత్ వెళ్లిపోయారని చెప్పారు. కంపెనీ ఉత్పత్తులకు మంచి గిరాకీ తో ఆదరణ వుండేది. అప్పటి యిక్కడి ఎమ్మెల్యే కె. వి. నారాయణ రావు ప్రభుత్వం లో చీఫ్ విప్ గా వుండేవారు. ఆయన కల్పించుకుని వుంటే ఫ్యాక్టరీ తెరుచుకునేది, అన్నారు. అమ్మకానికి పెడుతున్న సర్ సిల్క్ స్థలాన్ని ప్రక్కన ఉన్న పేపర్ మిల్లుకు ఇస్తేనే మంచిది. అలా చేసి మరింత మందికి ఉద్యోగాలు వచ్చేట్టు చేయాలి.
అప్పట్లో కంపెనీ కి ప్రింటింగ్ సామగ్రి సరఫరా చేసిన సి. చంద్రయ్య మెరిసే లక్షణం వుండే బట్ట తయారీ వలన సిల్క్ పరిశ్రమ అన్నారని చెప్పారు. కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కంపెనీ లోని యంత్రాలు, విడి భాగాలు అమ్ముకున్నారని ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకెళ్లారని చెప్పారు.
పరిశ్రమ లో తయారీ అయిన నూలు రంగులను నీటిలో అద్దటానికి ఉపయోగించిన నీటి ట్యాంకు.
ప్రజా ప్రతినిధుల వివరణ:
“కంపెనీ జీతాన్ని రు. 105 పెంచుతామనిచెప్పింది. కానీ కార్మిక నాయకుడు ఆలె నరేంద్ర రు. 120 కోరారు. ఈ వివాదం నాటికే కంపెనీ నష్టాల్లో ఉంది. నేను 1977-84 మధ్య కార్మికుడిగా పని చేశాను. కంపెనీ నష్టాలకు కారణం నాకు తెలీదు. గొడవ తరువాత బిర్లా వాళ్ళు మళ్ళీ తెరవటానికి సుముఖత చూపలేదు,”అని సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప చెప్పారు. ఆయన మరిన్ని ఆసక్తికరమయిన వివరాలు అందించారు.
“హౌస్ కమిటీ వేసి అప్పటి స్థానిక ఎమ్మెల్యే పురుషోత్తమ రావు మూడు సంవత్సరాలు కాల యాపన చేశారని. 1999 లో నేను, జిల్లా పరిషత్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మెద్ హై కోర్టు కు వెళ్ళి ఒక లిక్విడేటర్ నియమించాలని కోరాము. కంపెనీ ఆస్తులు అమ్మి కొంత వరకు కార్మికులకు యిప్పించాము. యిప్పుడు భూమి అమ్మి వాళ్ళకు మిగిలిన బకాయిలు యివ్వాలని కోరతాము. నేను 2004 లో ఎమ్మెల్యే అయ్యేనాటికి కంపెనీ మూతపడి 19 సంవత్సరాలు అయ్యింది. దానిని పునరుద్దరణ కోసం ఏమి చేయాలన్న కనీసం మెషినరి కూడా లేవు. పేపర్ మిల్లు విషయం లో తిరిగి దాన్ని మరో యాజమాన్యం చేతిలో పెట్టి నడిపి ఉద్యోగాలను కాపాడ గలిగాము, “ అని కోనప్ప వివరించారు.
ఈ విషయం పైన బిజెపి నుండి ప్రస్తుతం ఎన్నిక అయిన స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం ఫలించలేదు.
రాష్ట్రంలో నిజాం కాలం లో ఒక వెలుగు వెలిగి మూసివేతకు గురి అయిన డిబిఆర్ మిల్స్, నిజాం షుగర్స్ కోవలోనే సర్ సిల్క్ పరిశ్రమ మళ్ళీ తెరవాలనే డిమాండ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నిజాం షుగర్స్ ను తెరుస్తామని ప్రస్తుతం అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ కూడా 2023 ఎన్నికల సందర్భంగా హామీ యిచ్చిన విషయం యిక్కడ గుర్తు చేసుకోవాలి.