‘బీసీలు కవిత నమ్మనే నమ్మరు’

ఆసుపత్రి నుంచి వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేసిన మధుయాష్కి గౌడ్.

Update: 2025-09-20 14:16 GMT

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటాలపై మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా బీసీల కోసం పోరాడతామని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవితను బీసీలను నమ్మనే నమ్మరన్నారు. కొత్తగా పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న‌కు అయినా కాస్తంత అవకాశం ఉంటుంది కానీ.. కవితకు ససేమిరా అవకాశం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అస్వస్థతకు గురైన మధుయాష్కీ గౌడ్.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన కొద్ది సేపటికే మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో బీసీల అంశంలో వచ్చిన మార్పుపై స్పందించారు. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం, బీసీల కోసం పోరాడతామని కవిత అనడంపై ప్రధానంగా స్పందించారు. కల్వకుంట్ల కుటుంబం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాటకం నుంచి కవిత బయటకు వచ్చారని అన్నారు.

ఇప్పుడెందుకు..

‘‘పది సంవత్సరాలపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇన్నాళ్లూ లేనిది ఇన్నాళ్ల తర్వాత కవిత.. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. విమలక్కపై కక్షతో హైదరాబాద్‌లో ఎక్కడా కూడా ఆమెకు ఇల్లు కిరాయికి రాకుండా చేసిన మనిషి కవిత. విమలక్క పార్టీ పెడితే ప్రజలు మద్దతు ఇస్తారు. కవిత పెడితే ఎవరు మద్దతు ఇస్తారు. దోచుకుంది దోచుకోవడానికే కవిత.. జాగృతి పెట్టారు. గతంలో రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి కవిత డబ్బులు వసూలు చేశారు. ఎవరిని ఆదుకున్నారు?’’ అని ప్రశ్నించారు.

ఇప్పటి నుంచే సాకులు..

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని బీఆర్ఎస్‌కు అర్థమైపోయింది. అందుకే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఓడిపోయిన తర్వాత చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. కవిత.. శవాలపై పేలాలు ఏరుకునే రకం. బీసీ నేత అయినంత మాత్రాన బీసీ అని చూడరు. వేరే వర్గాల బీసీల కోసం కోట్లాడతామంటేనే ఒప్పుకోవట్లేదు’’ అని వ్యాఖ్యానించారు.

రేవంత్ పాలన అమోఘం..

‘‘కాంగ్రెస్‌లో తర్వాత వచ్చే సీఎం ఎవరు? అన్న చర్చ అనవసరం. నేను ఫుల్ ఫిట్‌గా ఉన్నా. ఫైట్‌ చేయడానికి రెడీగా ఉన్నా. దేశంలోని అందరు సీఎంల కంటే రేవంత్ పాలన చాలా బాగుంది. ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారు. అందుకే వేరే రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి రావాలని రేవంత్‌ను అడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వీకర్ సెక్షన్ మోసపోయింది. ఆ వీకర్ సెక్షన్‌కు రేవంత్ రెడ్డి ఒక ఛాంపియన్‌గా మారారు. రేవంత్ తర్వాత సీఎం ఎవరు? అని ప్రజల్లో అస్థిరత ఉందని చాలా మంది భావిస్తున్నారు.  గతంలో మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధాని ఎవరు అని సోనియా గాంధీని ఓ కీలక తెలుగు నేత అడిగితే ఆమె చెంప పగలగొట్టేంత పని చేశారు. రేవంత్ అనే వ్యక్తి వెనక ఉండరు. ముందుండి నడిపిస్తారు’’ అని అన్నారు.

Tags:    

Similar News