నళిని ఎవరు ? ‘మరణవాగ్మూలం’ ఏమిటి ?
ఉద్యోగం వదిలేయద్దని ఎంతమంది చెప్పినా అప్పుడు వినలేదు
ఎప్పుడో జనాలు మరచిపోయిన మాజీ డీవైఎస్పీ దోమకొండ నళిని మళ్ళీ ఇపుడు వార్తల్లోకి ఎక్కారు. చాలా సంవత్సరాలు జనజీవనశ్రవంతికి నళిని దూరంగా గడిపి హఠాత్తుగా ఇపుడు జనాల్లోకివచ్చారు. రావటం రావటమే ఫేస్ బుక్(Facebook) లో తన ‘మరణవాగ్మూలం’(Death Statement) అనే ప్రకటనతో సంచలనంగా మారారు. ఇంతకీ నళిని(Former DYSP Nalini) ఎవరంటే డీఎస్సీగా పనిచేసిన అదికారి. తెలంగాణ(Telangana) ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న 2009లో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎందుకంటే, సమైక్యరాష్ట్రంలో డీఎస్పీగా ఉద్యోగంచేస్తున్న నళిని తెలంగాణఉద్యమంలో అప్పటిప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తట్టుకోలేకపోయి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యమకారులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆగ్రహం ఆమెలో పెరిగిపోయింది. అందుకనే ప్రభుత్వ విధానం నచ్చలేదని చెప్పి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామాచేశారు. ఉద్యోగం వదిలేయద్దని ఎంతమంది చెప్పినా అప్పుడు వినలేదు.
ఉద్యోగం వదిలేసిన నళిని నేరుగా ఉద్యమంలో పాల్గొన్నారు. మిగిలిన ఉద్యమకారులను చూసినట్లే పోలీసులు నళినికి కూడా తమదైన శైలిలోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసు ట్రీట్మెంట్ కారణంగా లాఠీదెబ్బలతో ఆమె బాగా ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఉద్యమంనుండి పక్కకుపోయి వైద్యం చేయించుకున్నారు. అయితే అప్పటి ట్రీట్మెంట్ కారణంగా అనారోగ్యం నుండి ఇప్పటికీ కోలుకోలేకపోయారు. తర్వాత తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో గెలిచినా నళినికి ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నళినిని పిలిపించి డీఎస్పీగా చేరమని ఆఫర్ ఇచ్చారు. అయితే ఉద్యోగంలో చేరటానికి ఆమె తిరస్కరించారు. తనపరిస్ధితి ఉద్యోగంచేసేట్లుగా లేదని, తన జీవన ప్రయాణం అంతా ఆధ్యాత్మికమే అని స్పష్టంగా చెప్పారు.
రేవంత్ ను కలిసిన తర్వాత నళిని మళ్ళీ ఎక్కడా జనజీవనంలో కనబడలేదు. అలాంటిది ఇంతకాలానికి ఆదివారం సడెన్ గా మరణవాగ్మూలం అంటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్యసేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తనజీవితం ముగింపుకు వచ్చేసినట్లు ఫేస్ బుక్ పోస్టులో చెప్పారు. తనఆరోగ్య పరిస్ధితి నెలరోజులుగా చాలా సీరియస్ గా ఉందన్నారు. ప్రస్తుతం చాలా క్రిటికల్ గా ఉన్నట్లు కూడా ఆమేచెప్పారు. గడచిన మూడురోజులుగా తనకు సరిగా నిద్రకూడా లేదన్నారు. రాత్రుళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నట్లు చెప్పారు.
ఎనిమిదేండ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, బ్లడ్, బోన్ క్యాన్సర్, రెండునెలలుగా టైఫాయిడ్ ఫీవర్, డెంగ్యు, చికెన్ గున్యా వైరస్ వల్ల అనారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. బ్లడ్, బోన్ క్యాన్సర్ సోకిందని, టైఫాయిడ్ ఫీవర్, డెంగ్యు, చికెన్ గున్యా సోకినట్లు ఆమె చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అనారోగ్య కారణాలతో ఏ కీలుకా కీలు విరిచేసినట్లుందని, నొప్పులకు తట్టుకోలేకపోతున్నట్లు బాధతో చెప్పారు. ఇంకా చాలాఅనారోగ్యాలు, వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వ నిరాధరణ లాంటి అనేక విషయాలు వివరించారు. బతికుండగా తనను పట్టించుకోని వాళ్ళు రాజకీయ లబ్దికోసం తనపేరును వాడుకోవద్దని చెప్పటమే విచిత్రంగా ఉంది. బ్రతికుండగా ఆమెను ఎవరు పట్టించుకోలేదు ? రాజకీయంగా ఆమె పేరును వాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉన్నది అన్నదే అర్ధంకావటంలేదు. తనపేరును లబ్దికోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందన్న విషయాన్ని ఆమె కూడా వివరించలేదు. మరణవాగ్మూలం పేరుతో చాలావిషయాలు ప్రస్తావించారు కాని అందులో చాలావిషయాలకు అసలు పొంతనలేదు. ఇంతకాలం జనజీవనానికి దూరంగా ఎక్కడోఉన్న నళిని మరణవాగ్మూలం పేరుతో సోషల్ మీడియాలో ఎందుకు ప్రత్యక్షమయ్యారో ఆమెకే తెలియాలి.