అనుమానంతో భార్యను నరికేశాడు
కుషాయిగుడా పోలీస్ స్టేషన్ పరిధి లో దారుణం
కోకపేటలో భర్తను హత్య చేసిన భార్య ఘటన మరువకముందే శనివారం మేడ్చెల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను నరికి పారారైన భర్త ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలోని అడ్డ గూడూరు గ్రామానికి చెందిన బోడ శంకర్(40), మంజుల(35) దంపతులు బ్రతుకు తెరువు కోసం ముంబాయిలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. శంకర్ మంజుల దంపతులకు 20 ఏళ్ళ క్రితమే వివాహమైంది. వివాహం అనంతరం పొట్ట కూటి కోసం భార్య భర్తలు ముంబయికి వలస వెళ్లారు. పెళ్లి అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ తర్వాత నుంచి శంకర్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మంజులను తిట్టడం, కొట్టడం చేసేవాడు.
వేధింపులు భరించలేక ఆమె వారం క్రితం కుషాయిగూడపోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్‌నగర్‌లో ఉంటున్న సోదరి రాణి ఇంటికి తన ముగ్గురు పిల్లలతో వచ్చింది. తర్వాత భార్య ఉందన్న సమాచారం తెలుసుకున్న శంకర్ అక్కడికి చేరుకున్నాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ పంచాయితీలోనే ఒక ఒప్పందం కూడా జరిగింది. శంకర్ ఇకమీదట మంజులను వేధించనని మాట ఇచ్చాడు. భార్య అక్క ఇంట్లోనే ఉండిపోయారు.
శనివారం తెల్లవారు జామున అందరూ నిద్రపోతున్న సమయంలో కత్తితో అత్యంత కర్కషంగా భార్యను నరికాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి లేచారు. శంకర్ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. మంజులను ఎక్కడి పడితే అక్కడ కత్తితో పొడవడంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంజుల మృతి చెందింది. స్థానికులు, బంధువుల సమాచారం మేరకు కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపులు తట్టుకోలేక రక్తం పంచుకుని పుట్టిన అక్క ఇంటికి చేరుకుని మంజుల శాశ్వతంగా దూరమైంది.