బతుకమ్మకు ముస్తాబైన తెలంగాణ

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో..

Update: 2025-09-21 12:09 GMT

తెలంగాణలో అతి పెద్ద పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగ అమావాస్య సందర్బంగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండుగను జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మతో వేడుక ప్రారంభమవుతుంది. వరుసగా తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలో చివరి ఘట్టం సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

ప్రకృతి సంబంధమైన బతుకమ్మ పండుగలో రంగు రంగుల పూలను పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్దంగా పాటలు పాడతారు. బతుకమ్మ పాటల్లో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యే విధంగా మహిళలు పాటలు పాడతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి బింబించే ఈ పండుగ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఘనంగా జరుపుకుంటున్నారు. వర్షాకాలం ముగింపు, చలికాలం ప్రారంభంలో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. నవాబులు, భూ స్వాముల వ్యవస్థలో తెలంగాణ మహిళలు అనేక కష్టాలు పడ్డారు. అనేకమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి ప్రతీకగా పూలను పేరుస్తూ బతుకవమ్మా అంటూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలోని మర్మం ఇదే.

తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ నైవేద్యాలు

తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం గౌరమ్మకు సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేయడానికి యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు మాత్రమే తయారు చేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ

మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక ప్రారంభమవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా వాడుకలో ఉంది. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ

రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ

నాలుగోరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. .

అలిగిన బతుకమ్మ

ఆరో రోజు ఆశ్వయుజ పంచమి నాడు వచ్చే ఈ వేడుకకు నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ

ఏడో రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ

ఎనిమిదో రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ

తొమ్మిదో రోజు ఆశ్వయుజ అష్టమి నాడు వచ్చే పండుగను సద్దుల బతుకమ్మ అంటారు. ఆదేరోజు దుర్గాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

బతుకమ్మను పేర్చడానికి ఒక రోజు ముందు మహిళలు పొలం గట్ల వెంబడి పూలను సేకరిస్తారు. తంగేడు, గునుగు, చామంతి , బంతి ,సీత జడలను వినియోగిస్తారు. తంగేడు పువ్వును పేర్చిన తర్వాతే మిగతా పూలను బతుకమ్మలో పేరుస్తారు. ఒక రోజు ముందే పూలను తెంపి వాడిపోకుండా ఉండటానికి నీళ్లలో వేస్తారు. ఇలా చేయడం వల్ల పూలు నిద్రిస్తాయని తెలంగాణలో నమ్మకం.

Tags:    

Similar News