భూపాలపల్లి జిల్లాలోఇసుక దందాపై కాంగ్రెస్ నిరసన
మాజీ ఎమ్మెల్యే గండ్ర, ఆయన భార్య దిష్టి బొమ్మ దహనం
భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ దందా యదేచ్చగా సాగుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం బిఆర్ఎస్ మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య జ్యోతి దిష్టి బొమ్మలు దహనం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో అక్రమ ఇసుక దందా జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రతిరోజూ ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా అక్రమ ఇసుక దందా ఆరోపణలు ఇప్పటికే అంతే కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దందాకు తెరలేపిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై బిఆర్ఎస్ ఇటీవలె ధర్నా చేసింది. దీనికి కౌంటర్ గా అధికార కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేసింది. భూపాలపల్లి నియోజకవర్గమే కాదు.. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో ఇసుక దోపిడీ జరుగుతోందని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే భూపాలపల్లి జిల్లా ఎడారిగా మారడం ఖాయం అని బిఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. ఇకనైనా పాలకులు మేలుకోవాలి అని గండ్ర వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.
వెంకటరమణారెడ్డి ఒకప్పుడు బలమైన కాంగ్రెస్ నేత. ఆయన వర్గం గత ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ లోచేరినప్పటికీ గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు.ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రాతినిద్యం వహిస్తున్నారు.