సిద్ధిపేట కేజీఎఫ్ లాగా తయారైందా ? కవిత సీరియస్ వార్నింగ్
అనుమతిలేకుండా కేజీఎఫ్ లోకి ఎవరు అడుగుపెట్టినా చావేగతి అన్నట్లుగా సినిమాలో చూపించారు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట నియోజకవర్గం కేజీఎఫ్ లాగా తయారైందా ? అవుననే అంటున్నారు కల్వకుంట్ల కవిత. కేజీఎఫ్(KGF) అంటే అందరికీ తెలిసిందే. మామూలుగా అందరికీ తెలిసిన కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కాని ఈమధ్యనే రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలో కేజీఎఫ్ ను పెద్దమాఫియా అదుపాజ్ఞలో ఉన్న గనుల ప్రాంతంగా చూపించారు. అనుమతిలేకుండా కేజీఎఫ్ లోకి ఎవరు అడుగుపెట్టినా చావేగతి అన్నట్లుగా సినిమాలో చూపించారు. ఇపుడు కవిత(Kavitha) సిద్ధిపేటను పోల్చింది సినిమాలోని కేజీఎఫ్ తోనే. అంటే సిద్ధిపేటలోకి బయటవాళ్ళని ఎవరినీ అనుమతించలేదు అని కవిత అర్ధమొచ్చేట్లుగా ఆరోపణలతో రెచ్చిపోయారు. బతుకమ్మ పండుగలో భాగంగా ఎంగిలిబతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు కవిత సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో ఆదివారం పర్యటించారు. స్ధానికులతో కలిసి బతుకమ్మ(Batukamma Festival) సంబురాల్లో పాల్గొన్నారు. ఆడవాళ్ళతో కలిసి ఆడి, బతుకమ్మ పాటలు పాడారు.
ఈసందర్భంగా మాట్లాడుతు సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. పేరు ప్రస్తావించకుండా కవిత మాట్లాడింది హరీష్ గురించే అని అందరికీ తెలుసు. తల్లి, దండ్రులు క్షేమంగా ఉండాలని కోరుకునే తనను కుటుంబానికి దూరంచేసినవాళ్ళ భరతంపడతానని ప్రతిజ్ఞచేశారు. కుటుంబానికి దూరమై దుఃఖంలో ఉన్న తనను చింతమడక ఆధరించిందన్నారు. 2004లో కేసీఆర్ ఎంఎల్ఏ పదవికి రాజీనామాచేసి ఎంపీగా పోటీచేసినపుడు తన స్ధానంలో స్ధానికంగా వేరొకరిని పోటీచేయించినట్లు చెప్పారు. ఇక్కడ వేరొకరు అంటే తన్నీరు హరీష్ రావనే అర్ధం. అప్పటిఎన్నికల్లో గెలిచినప్పటినుండి ఇప్పటివరకు సిద్ధిపేట, చింతమడక ప్రైవేటు ఆస్తిలాగ, కేజీఎఫ్ లాగ తయారైపోయిందని ఆరోపించారు. సిద్ధిపేట, చింతమడకలోకి ఎవరు రావాలన్నా కేజీఎఫ్ లో ఉన్నట్లు చాలా ఆంక్షలు ఉండేవని చెప్పారు. ఆంక్షలను ఛేదించటానికే తాను ఇపుడు చింతమడకలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సిద్దిపేట, చింతమడక గ్రామం ఎప్పుడూ కేజీఎఫ్ లాగ అవలేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి పలానా ఏరియాలోకి అడుగుపెట్టవద్దని ఎవరు ఇంకెవరినీ నిర్దేశించలేరు. ఒకవేళ నిర్దేశించినా ఎంతోకాలం ఆంక్షలు సాధ్యంకాదు. అలాగ ఆంక్షలువిధిస్తే ప్రతిపక్షాలు, ప్రజలు తిరగబడటం ఖాయం అని అందరికీ తెలుసు. కాబట్టి సినిమా కేజీఎఫ్ లో చూపించినట్లు సిద్ధిపేట, చింతమడకలో అలాంటి పరిస్ధితులు లేవు. ఇక కవిత విషయంచూస్తే ఇంతకాలం అవసరం రాలేదుకాబట్టి సిద్ధిపేటలోకి అడుగుపెట్టలేదు. హరీష్ తో విభేదాలు మొదలైన తర్వాతే చింతమడక, సిద్ధిపేట కేజీఎఫ్ లాగ తయారైందని కవితకు తెలిసిందా ? కేసీఆర్ రాజీనామాచేసిన తర్వాత స్దానికంగా మరొకరిని ఎంఎల్ఏగా పోటీచేయించారని చెప్పిన కవిత దగ్గరిబంధువైన హరీష్ పేరుపెట్టి డైరెక్టుగా ఎందుకు ఆరోపించలేకపోయారు ?
ఒకవేళ సిద్ధిపేట, చింతమడకకు హరీష్ తనను దూరంచేసినా మరి తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ఏమిచేస్తున్నట్లు ? వాళ్ళుకూడా హరీష్ కే మద్దతుగా ఉన్నారంటే అర్ధం ఏమిటి కవితకు వ్యతిరేకిస్తున్నారనే కదా. సిద్ధిపేట, చింతమడకలోకి కవిత ఎంటర్ అవ్వటం తండ్రి, అన్నకు కూడా ఇష్టంలేదని అర్ధమవుతోంది. తండ్రి, సోదరుడే తనకు వ్యతిరేకమైన తర్వాత ఇక బంధువు హరీష్ ను టార్గెట్ చేసుకుని కవిత ఎందుకు ఆరోపణలు చేస్తున్నట్లు ? ఆమె మాటలుచూస్తుంటే జన్మభూమే కర్మభూమి కావచ్చంటే భవిష్యత్తులో సిద్దిపేట నుండి పోటీచేయాలని కవిత డిసైడ్ చేసుకున్నారా ?