ప్రభాకరరావును రప్పించేందుకు పోలీసులు భలే ప్లాన్ చేశారు
ఈనెలాఖరులోగా లేదా వచ్చేనెలలో ప్రభాకరరావు ఇండియాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.;
ఎలుకను బయటకురప్పించాలంటే కలుగులో పొగబెట్టాలి. ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ఇపుడదే పనిచేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసులో కీలకపాత్రదారుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ బాస్ టీ ప్రభాకరరావు(T. PrabhakarRao)కు దారులన్నీ మూసుకుపోతున్నాయి. సిట్ దర్యాప్తును తప్పించుకునేందుకు ఏడాదికి పైగా అమెరికా(America)లో దాక్కున్న నిందితుడిని ఇండియాకు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసును అమల్లోకి తీసుకొస్తున్నారు. ప్రభాకరరావును అదుపులోకి తీసుకునేందుకు కొద్దిరోజుల క్రితం ఇంటర్ పోల్(Interpol) అధికారులు రెడ్ కార్నర్ నోటీసు జారీచేసిన విషయం తెలిసిందే. రెడ్ కార్నర్ నోటీసు అమల్లోకి రావాలంటే అమెరికాలోని స్ధానికకోర్టు అంటే ప్రభాకరరావు నివాసముంటున్న ఏరియాలోని కోర్టు అనుమతి కావాలి. ఆ అనుమతి ఇపుడు కోర్టునుండి దొరికింది. మార్చి 10వ తేదీన జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసును అమల్లోకి తెచ్చేందుకు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కసరత్తు మొదలుపెట్టింది.
ఇండియాకి వచ్చి సిట్ దర్యాప్తుకు హాజరైతే తనపరిస్ధితి ఎలాగ ఉంటుందనే విషయంలో ప్రభాకరరావుకు క్లియర్ పిక్చర్ ఉంది. అందుకనే విచారణ, దర్యాప్తు, అరెస్టును తప్పించుకునేందుకు అమెరికాకు పారిపోయాడు. అమెరికాలో కూర్చుని తనకు క్యాన్సర్ ఉందని, చికిత్స చేయించుకుంటున్నానని పదేపదే చెబుతున్నాడు. ఇదేసమయంలో తనను అమెరికాలో రాజకీయ శరణార్ధిగా గుర్తించి, ఇండియాకు తిప్పి పంపవద్దని అమెరికా ప్రభుత్వానికి రిక్వెస్టు పెట్టుకున్నాడు. అంతేకాకుండా అమెరికా పౌరసత్వంకోసం శతవిధాలుగా ప్రయత్నించాడు. నిందితుడు ఇండియాకు రాకుండా అమెరికాలో చేసుకుంటున్న ప్రయత్నాలను గమనిస్తున్న సిట్ అధికారులు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
అవేమిటంటే ముందు ప్రభాకరరావును అరెస్టుచేసి తమకు అప్పగించేట్లుగా సీబీఐ ఉన్నతాధికారుల ద్వారా ఇంటర్ పోల్ ఉన్నతాధికారులతో మాట్లాడించి రెడ్ కార్నర్ నోటీసు జారీచేయించారు. ప్రభాకరరావుకు ఆశ్రయం ఇవ్వకూడదని, పౌరసత్వం ఇవ్వకూడదని ఇంటర్ పోల్ ద్వారానే స్ధానిక కోర్టులో పిటీషన్ వేసి అదే విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేశారు. అంతేకాకుండా ప్రభాకరరావుపై ఇండియాలో లుకౌట్ నోటీసులు జారీచేయించారు. తర్వాత నిందితుడిని ఇండియాకు రప్పించేందుకు హైకోర్టులో పిటీషన్ వేసి విదేశాంగశాఖ ఆదేశాలిప్పించి పాస్ పోర్టును రద్దుచేయించారు. తాజాగా నాంపల్లిలో మార్చిలో దాఖలుచేసిన పిటీషన్ కారణంగా జూన్ 20వ తేదీలోగా విచారణకు హాజరవ్వాల్సిందే అనే నోటీసును జారీచేయించారు. జూన్ 20లోగా విచారణకు హాజరుకాకపోతే నిర్బంధ నేరస్తుడిగా ప్రకటించటమే కాకుండా ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని కోర్టుద్వారానే చెప్పించారు. ప్రభాకరరావు ముందస్తుబెయిల్ రాకుండా అడ్డుకున్నారు.
విచారణనుండి తప్పించుకునేందుకు, ముందస్తుబెయిల్ కోసం ప్రభాకరరావు ఎన్ని ఎత్తులు వేస్తే వాటికి సిట్ అధికారులు పై ఎత్తులు వేస్తే అన్నింటినీ తిప్పికొడుతున్నారు. తాజాగా యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటి ఏజెన్సీ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు అమలు చేయించారు. రెడ్ కార్నర్ నోటీసు అమలంటే ప్రభాకరరావు ఎక్కడున్నా పట్టుకుని అరెస్టుచేసి ఇండియాకు పంపేస్తారు. అరెస్టుచేసిన విషయం సీబీఐకి తెలియజేసి నిందితుడిని ఇండియాకు పంపుతున్న విషయాన్ని ఇంటర్ పోల్ తెలియజేస్తుంది. విషయం తెలియగానే సీబీఐ అధికారులు లేదా వాళ్ళ సహకారంతో సిట్ అధికారులు అమెరికాకు వెళ్ళి అక్కడే ప్రభాకరరావును అరెస్టుచేస్తారు. అరెస్టుచేసిన ప్రభాకరరావును ఇండియాకు తీసుకెళ్ళటానికి కోర్టులో పిటీషన్ వేసి అనుమతితీసుకుంటారు. కోర్టుఅనుమతించగానే ప్రభాకరరావును తీసుకుని ఇండియాకు వచ్చేస్తారు.
ఇండియాకు రాగానే ముందు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత కోర్టు అనుమతితో నిందితుడిని విచారణకు సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ప్రభాకరరావును అరెస్టుచేయటానికి హోంల్యాండ్ సెక్యూరిటి ఏజెన్సీకి ఎక్కువరోజులు పట్టకపోవచ్చు. కాబట్టి ఈనెలాఖరులోగా లేదా వచ్చేనెలలో ప్రభాకరరావు ఇండియాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రత్యర్ధుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయం సంచలనంగా మారింది. విచిత్రం ఏమిటంటే ఏ ప్రభుత్వంలో అయినా సంఘవిద్రోహశక్తుల ఫోన్లు, ప్రభుత్వానికి ముప్పు అని అనుమానించిన వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతునే ఉంటుంది.
ఇలాంటివాళ్ళ మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదు. కాని కేసీఆర్(KCR) పదేళ్ళ పాలనలో వేలాదిఫోన్లు ట్యాపయ్యాయి. వాటిల్లో రాజకీయ ప్రత్యర్ధులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, వ్యాపారులు, జర్నలిస్టులు, సొంతపార్టీలో అనుమానిత నేతలతో పాటు చివరకు కొందరు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబీకుల పోన్లను కూడా ట్యాప్ చేయించారు. ఈ విషయాలను ట్యాపింగ్ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతిరావు విచారణలో బయటపెట్టారు. తమకు ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇంటెలిజెన్స్ బాస్ ప్రభాకరరావే ట్యాపింగ్ చేయమని ఆదేశించేవారని పోలీసు అధికారులు విచారణలో అంగీకరించారు. ప్రభాకరరావుకు ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ఎవరిచ్చేవారో తమకు తెలీదని చెప్పారు. విచారణలో ట్యాపింగ్ అసలు సూత్రదారుడు ఎవరో కూడా పోలీసు అధికారులు చెప్పేవుంటారు కాని ఆ విషయాన్ని సిట్ అధికారులు బయటపెట్టలేదు.
ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు సహనిందితుడైన మీడియా యజమాని శ్రవణ్ కుమార్ ఇద్దరూ కలిసి జాయింటుగా వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. శ్రవణ్ రావు అరెస్టు రక్షణతో సిట్ విచారణకు హాజరవుతున్నాడు. అయితే విచారణకు సహకరించటంలేదని అధికారులు కోర్టుకు తెలియజేశారు. ప్రభాకరరావు కూడా ఇండియాకు తిరిగొచ్చి విచారణకు హాజరైతే అప్పుడు తెలంగాణ రాజకీయాలు హాటుహాటుగా మారిపోవటం ఖాయమని అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.