‘సినీ పరిశ్రమను ఆదుకునే బాధ్యత నాది’
మూవీ టికెట్‌ల రేట్ పెంపుకు సీఎం గ్రీన్ సిగ్నల్. కానీ ఒక కండిషన్.
తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎటువంటి కష్టం వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. సినీ పరిశ్రమ తనకు సహకరిస్తే హాలీవుడ్ నుంచి ఇక్కడకు వచ్చి షూటింగ్‌లు చేసుకునే స్టేజ్‌కు తెలంగాణ చిత్రసీమను తీసుకెళ్తానని అన్నారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లింది అంటే దాని వెనక ఎందరో కృషి ఉందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో తెలుగు సినీ పరిశ్రమ వాళ్లు సీఎంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగానే సీఎం రేవంత్.. సినిమా టికెట్ ధర పెంపుపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సినీ కార్మికుల పిల్లల చదువులకు తమ ప్రభుత్వం ఆసరా అందిస్తుందని, అందుకోసం కృష్ణ నగర్‌లో మూడు నాలుగు ఎకరాల్లో కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
‘‘తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. అన్న ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణ లాంటి వాళ్లను సంప్రదించి హైదరాబాద్ కు తరలి రావడానికి ప్రోత్సహించారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మీ శ్రమ, కష్టం నాకు తెలుసు. మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించా’’ అని తెలిపారు.
‘‘ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాం. నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నాం. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉంది. ఈ విజయం వెనక కార్మికుల శ్రమ ఉంది. హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే మా కోరిక. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. తెలంగాణరైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. మీరంతా అండగా నిలబడండి హాలీవుడ్ ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది’’ అని భరోసా ఇచ్చారు.
‘‘కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12 గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తాం. సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి. భవిష్యత్ లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే… అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు అందిస్తేనే అనుమతి జీవో అందించేలా నిబంధనలు సడలిస్తాం’’ అని వెల్లడించారు.
‘‘కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్ధిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్ కు స్థలం కేటాయిస్తాం. కర్ణుడు ప్రాణం పోయినా మిత్ర ధర్మం వదలలేదు. అలాగే మీకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతాం. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళతాం. ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది’’ అని అన్నారు.