ప్రమాదంలో వంగర ఊర చెరువు.. ఏ క్షణమైన తెగనున్న కట్ట?

సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, వరుణ దేవుడిపైనే భారం

Update: 2025-10-29 17:58 GMT
వంగర గ్రామంలోని రెండో వైపు నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన హనుమకొండ, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలలో ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

తుఫాన్ ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 412.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తరువాత స్థానంలో వరంగల్ జిల్లా కల్లెడలో 382 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. 

సహాయక కార్యక్రమాల్లో వంగర ఎస్ ఐ దివ్య

భీమదేవరపల్లిలో..

మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహరావు స్వగ్రామమైన వంగరలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షంతో ఊర చెరువు మత్తడి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రోడ్ డౌన్ ప్రాంతంలో ఏకంగా ఆరు అడుగుల స్థాయిలో వరద నీరు ఉంది.
సాయంత్రం వరకూ ప్రవాహాం తగ్గకపోవడంలో వంగర ఎస్ఐ దివ్య నేతృత్వంలో పోలీసులు బారీకేడ్లను అడ్డుపెట్టి రాకపోకలను నిలిపివేశారు. అయితే సాయంత్రం మరోమారు కురిసిన కుంభవృష్టికి వరద పోటెత్తడంలో వంగర గ్రామానికి రెండో వైపున ఉన్న పాలసెంటర్ కేంద్రం నుంచి నీరు రావడం మొదలైంది.
ఈ ప్రాంతంలో ఊరు మధ్య భాగంలో ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వంగర ప్రధాన గ్రామానికి ప్రస్తుతం సంబంధాలు తెగిపోయాయి. ఓ వైపు వంగర చెరువు మత్తడి దుంకటం, మరో వైపు వరద నీరు ప్రవాహపు కాల్వ ఉండటంతో గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది.
వరద ప్రవాహానికి ఏ క్షణమైన వంగర ఊర చెరువు కట్ట తేగే అవకాశం ఉంది. ఇప్పటికే చెరువులో ఉన్న శివాలయం, పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడిలోకి వరదనీరు చేరింది. అలాగే వాటర్ ప్లాంట్, పల్లె దవాఖాన వరద నీటిలో చిక్కుకున్నాయి.


 


కొంపముంచిన ముదిరాజ్ లు..
గ్రామంలోని ఊర చెరువులో చేపల కోసం ముదిరాజ్ కులస్థులు మత్తడి ప్రాంతంలో భారీ కంచెను నిర్మించారు. దీనితో సహజ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఈ కంచెలో జాలీ భాగం కూడా ఉండటంతో చెత్తాచెదారం చిక్కుకుని వరద నీరు వెనక్కి వెళ్లాయి.
దీనితో వంగర గ్రామ మాజీ సర్పంచ్ అయిన నల్లగొని ప్రభాకర్ ఇంటిలోకి చెరువు నీరు వెళ్లింది. మరోవైపు వరద ప్రవాహాపు కాల్వ నీరు కూడా వెనక్కి మళ్లడంలో ఎస్టీ హస్టల్ పై భాగంలో గండిపడి వరద నీరు పొలాలను ముంచెత్తింది. చేతికొచ్చిన పంట కళ్లముందు వరదలో కొట్టుకుపోతోందని రైతులు లబోదిబో మంటున్నారు.
సహాయక చర్యలు ప్రారంభించిన ఎస్ ఐ దివ్య
వంగర ఊర చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఉండటంతో ఎస్సై దివ్య నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వంగర- అమ్మనగుర్తి గ్రామాల మధ్య వరదలో చిక్కుకుపోయిన పాల ఆటోను స్థానిక కాశ కాలనీ వాసుల సాయంతో బయటకు తీసుకు వచ్చారు. 
గ్రామస్థుల సహకారంలో మత్తడి దుంకుతున్న ప్రదేశంలో ఉన్న కంచెను తొలగించడానికి దాదాపు మూడు గంటల పాటు కష్టపడిన ఫలితం దక్కలేదు.
రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ది ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించగా మరోసారి కంచె తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 
వరదనీరు భారీగా ఉండటం, చీకటి ప్రాంతం కావడం, మరోవైపు స్మశానం ఉండటంతో సహాయానికి కొంతమంది గ్రామస్తులు జంకినప్పటికీ పోలీసులు మాత్రం మొండి పట్టుదలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News