శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం
కోల్ కత్తా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయా ణికుడి బ్యాగులో దొరికింది
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. విశాల్ అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో కోల్ కత్తా నుంచి హైద్రాబాద్ కు వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది సోదాలు చేసినప్పుడు బుల్లెట్ బయటపడింది.శంషాబాద్ నుంచి బెంగుళూరుకు బయలు దేర బోతుండగా విశాల్ బ్యాగును చెక్ చేసినప్పుడు బుల్లెట్ లభ్యమైంది.
శంషాబాద్ విమానాశ్రయంలో తరచుగా..
శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు, వీఐపీలు, ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది సోదాలు చేస్తుంటారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచుగా స్మగ్లింగ్ చేస్తున్న వస్తువులు దొరుకుతున్నాయి. వీటిలో బంగారం ఒకటి. అరబ్ దేశాల నుంచి తీసుకొచ్చే బంగారం ఎక్కువగా పట్టుబడుతుంటుంది. డ్రగ్స్ తో పట్టుబడే వారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎక్కువయ్యారని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. కోల్ కత్తా నుంచి హైదరాబాద్ వచ్చిన విశాల్ బ్యాగులో బుల్లెట్ దొరికడం సంచలనమైంది. వెంటనే నిందితుడిని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (ఆర్జీఐఏ) పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. బుల్లెట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బుల్లెట్ ను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? అతడికి బుల్లెట్ ను ఎవరు ఇచ్చారు.. బుల్లెట్ ను తీసుకురావడానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ లభ్యంకావడంతో పలువురు ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టులో భద్రతా ప్రమాణాలపై సవాల్ విసిరినట్టయ్యింది.
కోల్ కత్తా ఎయిర్ పోర్టులో విశాల్ దగ్గర బుల్లెట్ ఉన్నట్టు భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయింది? అక్కడ చెక్ చేయలేదా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో విశాల్ వెంటే తోటి ప్రయాణికులున్నారు. హైదరాబాద్ లో దిగి తిరిగి బెంగుళూరు వెళ్లే సమయంలో నిందితుడు పట్టుబడ్డాడు.