జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాజుకుంటున్న కులాల కుంపట్లు
ఏ సామాజికవర్గం ఓట్లు కూడా నవీన్ లేదా సునీతకు గంపగుత్తగా పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక దగ్గరపడేకొద్ది గెలుపుకోసం ప్రధానపార్టీల ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఇంటింటికి తిరిగి ప్రచారం, రోడ్డుషోలు, బహిరంగసభలు కాకుండా సామాజికవర్గాల వారీగా సమావేశాలు, వనభోజనాలు కూడా మొదలైపోయాయి. మంగళవారం కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్(Revanth) రెడ్డి సమావేశమయ్యారు. అలాగే బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా సామాజికవర్గాల వారీగా సమావేశాలు మొదలుపెట్టారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత(Maganti Sunitha) స్వయంగా కమ్మ సామాజికవర్గం అవటంతో వాళ్ళతో రెగ్యులర్ గా సమావేశాలు జరుపుతున్నారు.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4.01 లక్షలున్నారు. వీరిలో పురుషులు 2.08 లక్షలుండగా మహిళా ఓటర్లు 1.93 లక్షలున్నారు. ఇతరుల ఓట్లు 25 ఉన్నాయి. సామాజికవర్గాల వారీగా చూస్తే బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లింలు 1.20 లక్షలు, ఎస్సీలు 28,350 ఓట్లు, కమ్మ ఓట్లు 22,746, క్రైస్తవులు 19,396, రెడ్లు 17,641, లంబాడీ ఓటర్లు 11,364 మంది ఉంన్నారు. అందుకనే సామాజికవర్గాల్లోని ప్రముఖులతో ఇటు రేవంత్ అటు కేటీఆర్ అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లోగెలుపుకు అవసరానికి తగ్గట్లుగా హామీలిచ్చేస్తున్నారు. కమ్మ ప్రముఖులతో జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతు కుకట్ పల్లిలో ఎప్పటినుండో పెండింగులో ఉన్న 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే కమ్మ సామాజికవర్గంకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాంతో ఉపఎన్నికలో కమ్మ ఓట్లన్నీ కాంగ్రెస్ కే వేయిస్తామని ప్రముఖులు హామీలిచ్చారు. ఈసమావేశం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ స్వయంగా బీసీ కావటంతో బీసీ ప్రముఖులతో మంతనాలు జరిపే బాధ్యతను ముఖ్యమంత్రి రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీదుంచారు. బీసీల్లో చాలా ఉపకులాలు, సంఘాలున్న కారణంగా పొన్నం మాత్రమే కాకుండా పార్టీలోని మరికొందరు బీసీ ఎంఎల్ఏలను కూడా రేవంత్ రంగంలోకి దింపారు. కాంగ్రెస్ బీసీ మంతనాలకు విరుగుడుగా బీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను రంగంలోకి దింపింది. తలసాని కూడా బీసీ సంఘాల్లోని ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు మొదలుపెట్టేశారు.
మామా-అల్లుళ్ళ సవాల్
బీసీ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించటంలో మామ తలసానికి అల్లుడు నవీన్ కు సవాలు ఎదురైంది. ఎలాగంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నవీన్ అల్లుడు వరసవుతాడు. శ్రీనివాస్ యదవ్ తమ్ముడి కూతురునే నవీన్ వివాహం చేసుకున్నది. అందుకని సామాజికవర్గంలోని ప్రముఖులు, ముఖ్యంగా యాదవ ఉపకులంలోని బంధువులు, మిత్రులు ఇటు తలసాని అటు నవీన్ కు దాదాపు కామన్ అనేచెప్పాలి. అందుకనే బీసీల్లో ముఖ్యంగా యాదవుల్లో ఎవరికి అనుకూలంగా ఎక్కువ ఓట్లుపడతాయన్న విషయం ఆసక్తిగా మారింది. మెజారిటి ఓట్లు ఎవరికి పడితే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ముస్లింల దారెటు ?
ఇక నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 1.2 లక్షలున్నాయి. వీరి ఓట్లలో ఎవరికి ఎక్కువగా పడతాయో వారు గెలుపుకు దగ్గరగా వెళతారు. నవీన్ 2018 ఎన్నికలవరకు ఎంఐఎంలో కీలకంగా ఉండేవాడు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. నవీన్ కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఎల్ఏలు, ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాబట్టే నవీన్ కు మద్దతుగా అసదుద్దీన్ తో పాటు ఎంఐఎం ప్రముఖులు, ముస్లింప్రముఖులు కూడా ప్రచారంచేస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉన్న మహమ్మద్ అజహరుద్దీన్, మాజీమంత్రి షబ్బీర్ ఆలీ కూడా ముస్లింల్లో బాగా ప్రచారం చేస్తున్నారు.
ఇదేసమయంలో బీఆర్ఎస్ లోని మాజీ మంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీతో పాటు మరికొందరు ముస్లిం సామాజికవర్గంలోని ప్రముఖులతో సునీతకు ఓట్లేసేట్లుగా మంతనాలు జరుపుతున్నారు. అలాగే బీజేపీలోని ముస్లింలు కూడా సామాజికవర్గంలోని ప్రముఖులతో భేటీ అవుతున్నా అది నామమాత్రంగానే ఉంది.
ఎస్సీల ఓట్ల కోసం మంత్రి గడ్డం వివేక్ రంగంలోకి దిగారు. వివేక్ కు అదనంగా మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 28,350 ఎస్సీల ఓట్లలో మాదిగ ఉపకులంవి 15,693 ఓట్లుండగా మాలల ఓట్లు 12,657 ఉన్నాయి. వీరిలోని ప్రముఖులతో మంతనాలు జరపటంపైన మంత్రులు వివేక్, అడ్లూరి చాలా బిజీగా ఉన్నారు. ఎస్సీ ఓట్లను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ లోని ఎస్సీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప తదితరులు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.
రెడ్డి సామాజికవర్గం ఓట్లను ఆకర్షించేందుకు స్వయంగా రేవంతే మంతనాలు జరుపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. రేవంత్ తరపున ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మంత్రులు, కోమటిరెడ్డి, ఉత్తమ్ తదితరులు మాట్లాడుతున్నారు.
వనభోజనాల బిజీ
పనిలోపనిగా ఉపఎన్నికల వేళ కార్తీకమాసం కూడా మొదలవ్వటంతో వనభోజనాలపైన కూడా ప్రధాన పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. ఒకపుడు కార్తీకమాసంలో ఒక ఏరియాలోని జనాలందరు కలిసి ఎక్కడో ఒకచోట తోటల్లో వనభోజనాలకు వెళ్ళేవారు. కాని రానురాను చాలాచోట్ల వనభోజనాలు కులాల సమావేశాలుగా మారిపోయాయి. ఇపుడు ఎలాగూ ఉపఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూడు ప్రధానపార్టీలు సామాజికవర్గాల వారీగా వనభోజనాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి. వనభోజనాలను ఏర్పాటుచేసి అక్కడకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో పాటు ప్రముఖులను ఆహ్వానించి ఓటర్లతో ప్రమాణాలు చేయించుకునేందుకు మూడుపార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఓట్ల చీలికలోనే లబ్ది
ఏ సామాజికవర్గం ఓట్లు కూడా నవీన్ లేదా సునీతకు గంపగుత్తగా పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. కమ్మ, ముస్లిం, ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజికవర్గాల ఓట్లలో మెజారిటి ఓట్లు ఎవరికి పడతాయో వాళ్ళకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది వాస్తవం. ఉపఎన్నికల చరిత్రనుచూస్తే అధికారంలో ఉన్నపార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే సామాజికవర్గాలపరంగా లేకపోతే ప్రభుత్వంలో ఏపనైనా కావాలంటే అధికారంలో ఉన్న పార్టీవల్లే అవుతుందికాని ప్రతిపక్ష పార్టీల వల్ల కావు. అందుకనే అధికారపార్టీకి గెలుపు అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఏమవుతుందో చూడాలి.
క్యాస్ట్ ఒకస్ధాయి వరకే పనిచేస్తుంది : చలసాని
కులాలను మాత్రమే నమ్ముకుంటే కష్టమని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఎన్నికల్లో కులాలవారీగా హామీలు, సమావేశాలు మామూలే’’ అన్నారు. ‘‘నిర్దిష్టమైన హామీలిచ్చి, అభివృద్ధిచేయలేకే కులాల ఓట్లవెంట పడుతున్నార’’ని అన్నారు. ‘‘ఒకపార్టీని గెలిపించేంత సీన్ ఏ కులానికీ లేద’’న్నారు. ‘‘పోలింగ్ దగ్గరకు వస్తున్నా అభ్యర్ధుల ప్రచారం ఏమంత ఉధృతంగా కనిపించటం లేద’’న్నారు. అన్నీ పార్టీల్లోను కుమ్ములాటలు కనబడుతున్నాయని చెప్పారు. ‘‘బీజేపీ ప్రచారం బాగా వెనుకబడి’’నట్లు అనుమానం వ్యక్తంచేశారు. ‘‘అభ్యర్ధిని ముందుగా పరిచయంచేసినా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత వెనుకడింద’’న్నారు. ‘‘ఒక్కకులాన్ని ఆధారంగా చేసుకుని గెలిచేంత సీన్ ఏపార్టీకి లేద’’న్నారు.
కులసంఘాలు చాలా కీలకం : ప్రొఫెసర్ ఈ. వెంకటేశు
కులసంఘాలను ఆకర్షించటం ద్వారా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశు చెప్పారు. ‘‘కులసంఘాల ఓట్లను ఆకర్షించటం వల్ల కచ్చితంగా ఉపయోగం ఉంటుంద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘అవసరానికి తగ్గట్లుగా నేతలు సామాజికవర్గాలకు తోచిన హామీలిచ్చేయటం మామూలైపోయింద’’న్నారు. ‘‘ఎన్నికలు అయిపోయిన తర్వాత కులసంఘాల ప్రముఖులను ఏపార్టీ కూడా పట్టించుకోదన్నది వాస్తవం’’ అన్నారు.