సీనియర్ జర్నలిస్ట్ సి.ఆర్.నాయుడు మృతి
చెరుకూరి రంగయ్య నాయుడు పత్రికా రంగంలో సిఆర్ నాయుడుగా పేరు
By : రాఘవ
Update: 2025-10-29 06:39 GMT
-రాఘవ
సీనియర్ జర్నలిస్ట్ చెరుకూరి రంగయ్య నాయుడు (82)బుధవారం ఉదయం 9 గంటల సమయంలో హైదరాబాదులోని బీరంగూడలోని పెంపుడు కుమార్తె ఇంట్లో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన వయోభారం వల్ల ఏర్పడిన అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. పత్రికారంగంలో ఆయన సి.ఆర్.నాయుడుగా ప్రసిద్ధులు.
చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన సి.ఆర్.నాయుడు బెంగుళూరులోని ఆంధ్రప్రభలో కొంతకాలం పనిచేశారు. ఈనాడు స్థాపించినప్పుడు 1975లో హైదరాబాదులో స్టాఫ్ రిపోర్టర్ గా చేరారు. తరువాత తిరుపతి ఉదయంలో పనిచేశారు. వార్త స్థాపించినప్పుడు తిరుపతి బ్యూరో చీఫ్ గా పనిచేశారు. తరువాత చెన్నై కి బదిలీ చేయడంతో అక్కడ రాజీనామా చేశారు. దాసరి నారాయణ రావు కుటుంబానికి సి.ఆర్.నాయుడు చాలా సన్నిహితులు.
సి.ఆర్.నాయుడుకు భార్య ఝాన్సీలక్ష్మి ఉన్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో బంధువుల అమ్మాయి హిమబిందును, ఒక అబ్బాయిని పెంచుకున్నారు. పెంచుకున్న అబ్బాయి రైలు నుంచి దిగుతూ ప్రమాదానికి గురై మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన మనో వేదనకు గురై మంచం పట్టారు. సి.ఆర్.నాయుడు పెంపుడు కుమార్తె హిమబిందు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, తండ్రిఆరోగ్యం బాగుండకపోవడంతో ఆమె ఉద్యోగం మానేసి తండ్రికి సేవలు చేస్తున్నారు.
సి.ఆర్. నాయుడు ఆరోగ్యం దెబ్బతిని వైద్యానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆయన్ని ఆస్పత్రిలో చేర్చి దగ్గరుండి వైద్యం చేయించారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సి.ఆర్. నాయుడు బంధువైనప్పటికీ ఆయన్ని ఎలాంటి సాయం కోరలేదు. తన కోసం చంద్రబాబు నాయుడును సాయం కోరవద్దని కూడా చెప్పారు. గురువారం ఉదయం పదిన్నర, మధ్యాహ్నం ఒంటిగంట మధ్య హైదరాబాదులోని బీరంగూడలో సి.ఆర్.నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమార్తె హిమబిందు తెలిపారు.