కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలు విన్నతర్వాత రేవంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా పెరిగిపోతున్నాయి;
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగారా ? రేవంత్ ను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలు విన్నతర్వాత రేవంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా పెరిగిపోతున్నాయి. ఇంతకీ రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి ?
1) ‘రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ బాగోతాలు మాకు తెలీవా’ ?
2) ‘సాగర్ సొసైటీ, మైహోమ్ భుజ్ కు ఉదయం 5 గంటలకే రేవంత్ ఎందుకు వెళతాడో మాకు తెలుసు’
3) ‘ఢిల్లీలో రేవంత్ ఎక్కడెక్కడ గోడలు దూకాడో మాకు తెలుసు’
4) ‘తారలు, రేఖలు, వాణీల గురించీ తెలుసు, చెప్పాలా’ ?
5) ‘అవసరమైనపుడు రేవంత్ అన్నీ ఫొటోలూ బయటపెడతాము’
6) ‘తాము నోరిప్పితే రేవంత్ కు ఇంట్లో అన్నం కూడా పెట్టరు’. అని రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ చాలా ఘటుగా మాట్లాడారు.
ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే రేవంత్(Revanth) సెల్ఫ్ డ్రైవింగ్ ఎప్పటిది ? సీఎం అయిన తర్వాత రేవంత్ కు సెల్ఫ్ డ్రైవింగ్ అవకాశంలేదు. ఎందుకంటే సెక్యూరిటి, ప్రోటోకాల్, వందలమంది భద్రతాసిబ్బందికి తెలీకుండా సెల్ఫ్ డ్రైవింగులో రేవంత్ ఎక్కడికి వెళతాడు ? సాగర్ సొసైటి, మైహోమ్ భుజ్ కు రేవంత్ ఉదయం 5 గంటలకు ఎప్పుడు వెళ్ళాడు. పైన చెప్పుకున్నట్లు సీఎం అయిన తర్వాత ఛాన్సుండదు. సీఎం కాకముందు వెళ్ళే అవకాశం అయితే ఉండేదేమో. అయినా రేవంత్ ఉదయం 5 గంటలకు వెళ్ళిన విషయం కేటీఆర్ కు ఎలాగ తెలిసింది ? మొదటినుండి రేవంత్ పైన కేటీఆర్ నిఘాపెట్టారా ?
పదేళ్ళ అధికారంలో ఉన్నపుడు వేలాది మొబైల్ ఫోన్లను ట్యాప్(Telephone Tapping) చేశారు కదా. ఆ సమయంలోనే రేవంత్ ఫోన్ ట్యాపింగ్ జరిగినపుడు ఉదయం 5 గంటల వ్యవహారాలు కేటీఆర్(KTR) కు చేరాయా ? అసలు రేవంత్ ఉదయం 5 గంటలకు మైహోమ్ భుజ్ కు వెళ్ళింది నిజమేనా ? ఒకపుడు మైహోమ్ యాజమాన్యం, కేసీఆర్ ఒకటే కదా. ఇక ఢిల్లీలో రేవంత్ దూకిన గోడల విషయం కేటీఆర్ కు ఎవరు చెప్పారు ? ఢిల్లీలో రేవంత్ గోడలు దూకింది నిజమేనా ? అయినా సీఎం కాకముందు రేవంత్ కు ఢిల్లీలో గోడలు దూకాల్సిన అవసరం ఏముంటుంది ? సీఎం అయిన తర్వాత గోడలు దూకే అవకాశం ఎక్కడుంటుంది ? రేఖలు, తారలు, వాణీల విషయం ఏమిటో కేటీఆర్ సరిగా చెప్పలేదు. అవసరమైతే ఫొటోలు కూడా బయటపెడతామని అన్నారు. ఏమి ఫొటోలు బయటపెడతారు ? ఎవరి ఫొటోలు బయటపెడతారు ?
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ‘తనకు సినీతారలతో సంబంధాలు అంటగట్టినపుడు తమకు కుటుంబాలున్నాయని, కుటుంబాల్లో ఆడపిల్లలున్నాయని రేవంత్ కు తెలీదా’ ? అని కేటీఆర్ అడిగారు. కేటీఆర్ తో సినీనటి సమంత(Samantha)కు సంబంధాలున్నాయని చెప్పింది రేవంత్ కాదు. కేటీఆర్, సమంత విషయమై ఆరోపణలు చేసింది మంత్రి కొండాసురేఖే(Konda Surekha) కాని రేవంత్ కాదు. సురేఖ మీద కోపాన్ని రేవంత్ మీద కేటీఆర్ చూపిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయినా నిజంగానే రేవంత్ గోడలు దూకింది, తారలు, సురేఖలు, వాణీల ఫొటోలున్నవి, ఢిల్లీలో గోడలు దూకటంపై సాక్ష్యాలుంటే నిర్భయంగా బయటపెట్టవచ్చు కదా ? ఎవరొద్దన్నారు ? ఫొటోలు, వీడియోలు ఏమన్నా ఉంటే బయటపెట్టకుండా ‘తాము నోరిప్పితే ఇంట్లో అన్నంకూడా పెట్టర’నే బెదిరింపులు ఎందుకు ?