రేవంత్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ పనిచేయలేకపోతున్నారా ?

సుప్రింకోర్టు విచారణలో ఇబ్బందిపడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు;

Update: 2025-04-20 04:53 GMT
Senior IAS officer Smita Sabarwal

అందరిలోను ఇపుడిదే అనుమానం పెరిగిపోతోంది. సుప్రింకోర్టు విచారణలో ఇబ్బందిపడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. స్మిత వ్యవహారం ఎలాగుందంటే పుండుమీద కారం రాసినట్లుంది. జరుగుతున్నది చూసిన తర్వాత కారణాలు ఏదైనా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి రేవంత్(Revanth) ప్రభుత్వంలో పనిచేయటానికి ఇష్టపడటంలేదా ? అనే అనుమానం కూడా పెరిగిపోతోంది. అందుకనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆమె వ్యవహారశైలిమీద మండిపోతోంది. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే ముఖ్యమంత్రి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి( Revanth CPRO Ayodhya Reddy) ట్వీటే. ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహార శైలిని తప్పుపడుతు అయోధ్య ట్విట్టర్లో లేవనెత్తిన అనుమానాలకు మద్దతు పెరుగుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉంది. విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని సుప్రింకోర్టు జడ్జి తీవ్రంగా ఆక్షేపించారు. చీఫ్ సెక్రటరీని ఉద్దేశించి చాలా కటువుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం సుప్రింకోర్టుకు చేరటానికి బీఆర్ఎస్(BRS) కూడా కారణమనే చెప్పాలి. యూనివర్సిటి భూములు పోతున్నాయని, చెట్లను కొట్టేస్తున్నదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటి విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన మొదలుపెట్టారు. ఆ ఆందోళనలలో బీఆర్ఎస్ దూరేసి వేలాది చెట్లు కొట్టేయటంవల్ల వందలాది పక్షలు, పదుల సంఖ్యలో జంతువులు భయంతో పారిపోతున్నాయని ఆరోపణలు మొదలుపెట్టారు. తమ ఆరోపణలకు మద్దతుగా బుల్డోజర్ల దెబ్బకు పారిపోతున్న జింకలు, నెమళ్ళంటు కొన్ని ఫొటోలు, వీడియోలను ట్విట్టర్లో విడుదలచేశారు.

ఎప్పుడైతే జంతువుల ఫొటోలు, వీడియోలను బీఆర్ఎస్ విడుదలచేసిందో దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు, సినీ సెలబ్రిటీలు, పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణ సంస్ధలు, రాజకీయపార్టీల నేతలు, మేథావులు నానా గోలచేశారు. బీఆర్ఎస్ విడుదలచేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో రీపోస్టులుచేశారు. దాంతో ఈ విషయమై సుప్రింకోర్టు బాగా సీరియస్ అయిపోయింది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వ్యతిరేకతతో రేవంత్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తర్వాత తేరుకుని బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టిన ఫొటోలు, వీడియోల విషయంపై దృష్టిపెట్టింది. సైబర్ నిపుణులు(Telangana Cyber Police) రంగంలో దిగి బీఆర్ఎస్ ప్రచారంచేసిన ఫొటోలు, వీడియోలన్నీ ఏఐ జనరేటెడ్ అని తేల్చారు. అంతేకాకుండా తప్పుడు ఫొటోలు, వీడియోలను ప్రచారంలోకి తెచ్చిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జీలు కొణతం దిలీప్, క్రిశాంక్ తదితరులపై కేసులు పెట్టి విచారిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రచారంచేసిన ఫొటోలు, వీడియోలు తప్పుడువని తేలగానే అంతకుముందు రీపోస్టులు, రీ ట్వీట్లు చేసిన వారిలో చాలామంది తమ ఖాతాలనుండి ఫొటోలు, వీడియోలను డిలిట్ చేసేశారు. ఈ నేపధ్యంలోనే ‘హాయ్ హైదరాబాద్’ అనే సంస్ధ బుల్డోజర్ల ముందు నిలబడిన నెమళ్ళు, జింకల ‘గిబ్లి పోస్టు’ను స్మిత(Smita Sabarwal) రీపోస్టుచేశారు. ఇపుడు వివాదమంతా దీనిపైనే నడుస్తోంది. హాయ్ హైదరాబాద్(Hai Hyderabad) గిబ్లీ పోస్టును రీపోస్టుచేసిన స్మితా ప్రభుత్వంపై విమర్శలుచేశారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. శనివారం విచారణకు హాజరైన స్మిత తర్వాత ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు, ప్రశ్నలు సంధించారు. దాంతో వివాదం మరింత పెరుగుతోంది.

విచారణకు తాను పూర్తిగా సహకరించానని ట్వీట్లో చెప్పిన స్మిత తనకులాగే గిబ్లీ పోస్టును రీపోస్టుచేసిన 2 వేలమందినీ విచారిస్తారా ? అని నిలదీశారు. మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా తనను మాత్రమే విచారణ చేస్తే తనను టార్గెట్ చేసినట్లు అనుకోవాల్సుంటుందని కూడా చెప్పారు. న్యాయం అందరికీ సమానంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. స్మిత ట్వీట్లో ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని స్పష్టంగానే చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఆకాశమేహద్దుగా ఒక వెలుగువెలిగిన ఈ ఐఏఎస్ అధికారి రేవంత్ ప్రభుత్వంలో తనకు సరైన గుర్తింపు దక్కటంలేదని బాధపడుతున్నట్లు అనుమానంగా ఉంది. అందుకనే ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందనే అనుమానాన్ని వ్యక్తంచేశారు.

ఈవ్యాఖ్యలపైనే ముఖ్యమంత్రి కార్యాలయం మండిపోతోంది. ముఖ్యమంత్రి చీఫ్ పీఆర్వో అయోధ్య చేసిన ట్వీటే దీనికి ఉదాహరణ. ‘బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన స్మితకు, ఇప్పటి స్మితకు ఆలోచనలో ఎందుకు మార్పొచ్చింద’ని సీపీఆర్వో ప్రశ్నించారు. ‘అధికారమార్పిడి జరిగితే అభిప్రాయాలు మారచ్చా’ ? అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేసమయంలో నరికేసిన లక్షలాది చెట్లను అయోధ్య ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వితనే స్వయంగా పర్యవేక్షించిన విషయాన్ని సీపీఆర్వో గుర్తుచేశారు. ‘అప్పట్లో వేలాది ఎకరాల అడవుల్లో లక్షలాది చెట్లను ను నరికేసినపుడు స్మితకు ప్రకృతి, జంతువులు, పక్షులు గుర్తుకురాలేదా’ అని ఎద్దేవాచేశారు. ‘లక్షలాది చెట్లను నరికేస్తున్నారని జాతీయపత్రికల్లో వార్తలు వచ్చినా స్మిత ఎందుకు స్పందించలేద’ని ప్రశ్నించారు. ‘అడవులను నరికేసి, వన్యప్రాణులను తరిమేసిన మీరే..ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలో మర్మం ఏమిటో ? అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా ? అధికారం కోల్పోయిన వారికోసమా ’? అని నర్మగర్భంగా అయోధ్య ప్రశ్నించారు. అయోధ్య ప్రశ్నలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం స్మితకు ఇష్టంలేదా ? అనే అనుమానం రేకెత్తుతోంది. స్మితను ఉద్దేశించి అయోధ్య ఆలస్యంగా స్పందించినా లేవనెత్తిన ప్రశ్నలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి.

అయోధ్య లేవనెత్తిన ప్రశ్నలకు స్మిత ఏమని సమాధానం ఇస్తారో చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా స్మితే సంవత్సరాల తరబడి పర్యవేక్షించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో చెట్లు నరికేసినా, వన్యప్రాణాలను తరిమేసినా స్మిత నోరిప్పలేదన్న విషయం ఇపుడు అందరికీ అర్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తనను అప్రాధన్యత పోస్టుకు బదిలీచేయటం, తన రీపోస్టును సీరియస్ తీసుకుని పోలీసులు విచారణకు నోటీసులు ఇవ్వటాన్ని స్మిత తట్టుకోలేకపోతున్నట్లు ఆమె వైఖరే తెలియచేస్తోంది. అందుకనే తనలోని అసంతృప్తిని స్మిత అవకాశం దొరకగానే బయటపెడుతున్నారని సీఎంవో(Telangana CMO) మండిపోతోంది. స్మితను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీపీఆర్వో ప్రశ్నలు వేశారంటేనే సీఎంవో ప్రోద్బలంతోనే అన్న విషయం అర్ధమైపోతోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వైఖరిని ప్రశ్నిస్తు సీపీఆర్వో ప్రశ్నలు సంధించారంటే రేవంత్ కు తెలీకుండా ఉండదు. రేవంత్ జపాన్(Revanth Japan tour) పర్యటన ముగించుకుని రాగానే స్మితపై చర్యల విషయాన్ని ఆలోచిస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

సర్వీసు రూల్స్ కు విరుద్ధం

ఇదేవిషయమై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘స్మిత వ్యవహారశైలి ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ కు విరుద్ధంగా ఉన్నద’ని చెప్పారు. ‘ప్రభుత్వ సర్వీసులో ఉన్నపుడు తమఅభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించకూడద’ని చెప్పారు. ‘ప్రభుత్వ సర్వీసులో ఉంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న విషయం తెలిసే స్మిత ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నద’ని అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసు రూల్స్ కు విరుద్ధంగా ఏ అధికారి కూడా వ్యవహరించకూడదన్నారు. ‘ఆల్ ఇండియా సర్వీసు అధికారులు తటస్తంగా ఉండాలని తెలిసినా కొందరు అధికారులు ఎందుకో వివాదాస్పదంగా మారుతున్న’ట్లు చెప్పారు. ప్రభుత్వంపై స్మిత ఎందుకో అసంతృప్తిగా ఉన్నట్లు అనుమానించారు. ‘ప్రభుత్వంలో ఇమడలేనపుడు వెంటనే ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లో చేరిపోతే బెటర్’ అని అభిప్రాయపడ్డారు. స్మిత విషయంలో ప్రభుత్వం సీరియస్ యాక్షనేమీ తీసుకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చని అభిప్రాయపడ్డారు. ‘సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారశైలి యాక్ట్ ఆఫ్ ఇన్ డిసిప్లిన్ కిందకు వస్తుంద’ని చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. గిబ్లీ పోస్టును రీపోస్టు చేసిన మిగిలిన 2 వేలమంది విషయం స్మితకు అనవసరం అన్నారు. ప్రభుత్వ సర్వీసులో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నది స్మితే కాని మిగిలిన 2 వేలమంది కాదుకదా అని ప్రశ్నించారు. ‘ఏ విషయంలో అయినా తనఅభిప్రాయాలను చీఫ్ సెక్రటరీకి చెప్పుకునే అవకాశం, లేఖ ద్వారా తెలియజేసే అవకాశాలున్నపుడు బహిరంగంగా వ్యక్తంచేయటం చాలా తప్ప’న్నారు.

Tags:    

Similar News