బీఆర్ఎస్ కు చుట్టుకోనున్న ట్యాపింగ్ వివాదం

ఎన్నికల్లో సమస్యలు ఎదుర్కోబోతున్న గులాబీ బాస్. కాంగ్రెస్ చేస్తున్న ట్యాపింగ్ ఆరోపణలకు కేసీయార్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Update: 2024-03-25 10:51 GMT
phone tapping

రోజులుగడిచే కొద్దీ తెలంగాణాలో టెలిఫోన్ ట్యాపింగ్ సంచలనాలు బయటపడుతున్నాయి. తాజాగా అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా తాము అప్పట్లో ఇంటిలెజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే తాము చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించటం సంచలనంగా మారింది. ఈ విషయమే సంచలనమైందంటే ప్రభాకరరావు వాదన మరింత విచిత్రంగా ఉంది. అమెరికాకు పారిపోయిన మాజీ చీఫ్ టెలిఫోన్లో ఇక్కడి అధాకారులతో మాట్లాడుతు ‘ఇప్పుడు మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్లే తాము కూడా చేశా’మని చెప్పటం విచిత్రంగా ఉంది.

అంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగులన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేయించినట్లు ప్రభాకరరావు అడ్మిట్ అయ్యారని అర్ధమవుతోంది. మరి ప్రతిపక్షాల నేతలతో పాటు అనుమానాస్పందంగా ఉన్న స్వపక్షం నేతల టెలిఫోన్లను ట్యాపింగ్ చేయమని చెప్పిన పెద్దలు ఎవరు ? అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలంటే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, కవితతో పాటు మరికొంతమంది మాత్రమే అని అందరికీ తెలుసు. వీరిలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది ఎవరనే విషయం ఇపుడు అరెస్టయిన ముగ్గురు పోలీసులు అధికారులు లేదా దేశానికి తిరిగొచ్చిన తర్వాత ప్రభాకరరావు చెబితేకాని తెలీదు.

ఏదేమైనా పార్లమెంటు ఎన్నికలకు ముందు కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారిందన్నది వాస్తవం. రేపటి ఎన్నికల్లో ఈ అంశం కూడా బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయటాన్ని పక్కనపెట్టేస్తే సొంతపార్టీ నేతల్లో అనుమానంగా ఉన్న నేతల మొబైల్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారని బయటపడటం పార్టీలో సంచలనంగా మారింది. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగు చేయించారనే విషయమై పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది.

సస్పెన్షన్లు-అరెస్టులు

ట్యాపింగ్ కేసులో డీఎస్సీ ప్రణీత్ రావుతో పాటు అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ఇద్దరు సీఐలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ట్యాపింగ్ కేసును దర్యాప్తుచేస్తున్న ఇప్పటి అధికారులు డీఎస్పీ అడిషినల్ ఎస్పీ, సీఐలను ముందు విచారణకు పిలిచారు. తర్వాత సస్పెండ్ చేసి ఆ తర్వాత అరెస్టు చేస్తున్నారు. మార్చి మొదటివారంలో ప్రణీత్ రావును అరెస్టుచేసిన ఉన్నతాధికారులు నాలుగురోజుల క్రితమే మరో ఇద్దరు అడిషినల్ ఎస్పీలను అరెస్టుచేశారు.

మామూలుగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయించాలంటే అందుకు కేంద్రప్రభుత్వం అనుమతి అవసరం. అనుమతి లేకుండా ట్యాపింగ్ చేయటం చట్ట విరుద్ధమే. చట్టాన్ని పాటించాల్సిన పోలీసులే చట్టవిరుద్ధమైన పనులు చేయటమే విచిత్రంగా ఉంది. పైగా అప్పటి ప్రభుత్వ పెద్దలు చెబితేనే చేశామని అంగీకరించటం మరీ విడ్డూరం. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయాలు పూర్తిగా బయటపడలేదు. అవికూడా బయటపడితే ముందు బీఆర్ఎస్ లో తర్వాత ప్రభుత్వంలో గందరగోళమైపోవటం ఖాయం. దీని ప్రభావం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక వివాదాలు బీఆర్ఎస్ ను ముఖ్యంగా కేసీయార్ ఫ్యామిలీని చుట్టుకుంటోంది.

ఒకవైపు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల లీకేజీలు-అవినీతి, మరో వైపు ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఈ ఫార్ముల రేసులో అవినీతి, ధరణిలో భూ అక్రమాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు లాంటి అనేక వివాదాల్లో పార్టీలోని కీలకనేతలు బాగా తగులుకున్నారు. వీటన్నింటి మీద టెలిఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైందనే చెప్పాలి. మరి రాబోయే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.


Tags:    

Similar News