KTR | కేటీఆర్ ను ఇరికించేందుకు బండి సంజయ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు అన్నీ ఆధారాలున్నాయి కాబట్టి తాను ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెబుతారు;

Update: 2025-08-10 09:00 GMT
Bandi and KTR

టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చాలా ఆరోపణలుచేశారు. సిట్ విచారణకు తాను హాజరైనపుడు అధికారులు చెప్పిన విషయాలను గమనించిన తర్వాత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు తెలిసిందన్నారు. ట్యాపింగ్(Telephone Tapping) ఆధారంగా కేటీఆర్ ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కల్వకుంట్ల కవిత(Kavitha), ఆమె భర్త దేవనపల్లి అనీల్ రావు, హరీష్ రావు(Harish Rao) ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amitshah) ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు మండిపడ్డారు. ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ చేసిన అరాచకాలంటు బండి చాలా ఆరోపణలు చేశారు. దానికి స్పందించిన కేటీఆర్ కేంద్రమంత్రిపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు చెప్పారు. తనపైన బండి(Bandi Sanjay)చేసిన ఆరోపణలు నిరాధారాలని కొట్టేశారు. నిరాధాణ ఆరోపణలు చేసినందకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే బండిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ హెచ్చరికలపై బండి మాట్లాడుతు క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని, తాను తప్పుడు ఆరోపణలు చేయలేదన్నారు. ఇక్కడే బండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. కేటీఆర్ హెచ్చరించినట్లుగా తనపై లీగల్ యాక్షన్ తీసుకోవటమే బండికి కావాల్సింది. లీగల్ యాక్షన్ తీసుకునేటపుడు కేటీఆర్ ఏమని చెబుతారు ? తనపై బండిచేసిన ఆరోపణలన్నీ నిరాధారాలని, వాటిని నిరూపించాలని అడిగినా నిరూపించలేకపోయారు, క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి కేంద్రమంత్రిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తన పిటీషన్లో కేటీఆర్ కోరుతారు. అప్పుడు బండి కూడా కోర్టులోనే సమాధానం చెబుతారు. ఏమనంటే కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు అన్నీ ఆధారాలున్నాయి కాబట్టి తాను ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెబుతారు. విచారణకు హాజరైనపుడు సిట్ అధికారులు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనే విషయాన్ని రికార్డుల్లో చూపించారని అంటారు. కాబట్టి సిట్ దగ్గరున్న అన్నీ రికార్డులను తెప్పించుకుని పరిశీలించాలని బండి కోర్టును కోరుతారు.

అంతేకాకుండా టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును లాజికల్ ఎండ్ కు తీసుకునిపోవటం సిట్ వల్ల కాదుకాబట్టి సీబీఐతో దర్యాప్తుచేయించాలని లేదా జ్యుడీషియర్ విచారణ అయినా పర్వాలేదని కోరుతారు. జ్యుడీషియల్ విచారణను ఎందుకు కోరుతారంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంతమంది జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించింది కాబట్టి. కొందరి జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించింది అని తెలిసిన తర్వాత హైకోర్టు ఎందుకు ఊరుకుంటుంది ? అప్పుడు కేసు దర్యాప్తును సీబీఐకి లేదా జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండింటిలో ఏది జరిగినా బండికి ఓకేనే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ నుండి తప్పించటమే బీజేపీకి కావాల్సింది. ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు దర్యాప్తు సిట్ పరిధి నుండి కేంద్రప్రభుత్వం చేతిలోకి వెళిపోతుంది. అప్పుడు ట్యాపింగ్ కేసు విషయంలో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగేది ఏమీ ఉండదు. ఒకవేళ జ్యుడిషియల్ విచారణ అయినా బండికి ఓకేనే.

ఎందుకంటే జ్యుడిషియల్ విచారణలో కూడా కేసీఆర్, కేటీఆర్ అరాచకాలన్నీ బయటపడతాయని బండి భావిస్తున్నారు. కాబట్టే వ్యూహాత్మకంగా కేటీఆర్ ను బండి టార్గెట్ చేస్తున్నది. కేటీఆర్ ఏమి ఆలోచించుకున్నారో తెలీదుకాని బండి ఆరోపణలపై లీగల్ యాక్షన్ అని వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు బండికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయకపోతే పోయేది కేటీఆర్ పరువే. ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకుంటే అంతా బండి అనుకున్నట్లే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా బండికే లాభం. ఒకేదెబ్బకు మూడుపిట్టలన్నట్లుగా ఉంటుంది బండి వ్యూహం. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News