నేటి నుంచి 21 వరకు నామినేషన్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్దమైన ప్రధాన పార్టీలు
By : V V S Krishna Kumar
Update: 2025-10-13 06:39 GMT
తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమయింది.ఈనెల 21 వరకు నామినేషన్లకు గడువు ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.షేక్‌పేట్ ఎమ్మార్వో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది..
నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రిటర్నింగ్ ఆఫీస్‌కి 100 మీటర్ల మేర ఆంక్షలు విధించినట్లు అధికారులు చెప్పారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్‌లోకి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే రిటర్నింగ్ ఆఫీస్‌లోపలికి 3 వాహనాలు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలి.ఇండిపెండెంట్, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు పది మంది నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాల్సివుంది. వెబ్‌సైట్ https://encore.eci.gov.in ద్వారా ఆన్లైన్‌లో నామినేషన్ పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చని కూడా అధికారులు వెల్లడించారు. అయితే అప్‌లోడ్ చేసిన తరువాత వచ్చే ప్రింటెడ్ హార్డ్ కాపీని రిటర్నింగ్ ఆఫీసర్‌కు తప్పకుండా అందించాల్సి వంటుంది.
నవంబరు 11 పోలింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. 14న యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు కౌంటింగ్ చేపడతారు.ఇలావుంటే ఈ ఉపఎన్నికకోసం ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ సిద్దమైపోయాయి . అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను ఖరారు చేయగా, బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణి సునీత పేరును అధికారికంగా ప్రకటించింది.మరో ప్రధాన పార్టీ బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేడో రేపో ప్రకటన వెలువడనండగా ఇంచుమించు దిలీప్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం వుందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం కాగా తమ సీటుకు ఈ సారికూడా గెలవాలని బీఆర్ఎస్ కృషి చేస్తుండగా , అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ సారి తమదేనన్న ధీమా కనబరుస్తోంది.