బంద్ 18వ తేదీకి వాయిదా

బీసీ సంఘాలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటవ్వాలని కూడా నిర్ణయించాయి

Update: 2025-10-12 11:55 GMT
BC Reservations in Telangana

ఈనెల 14వ తేదీన చేయాలని అనుకున్న తెలంగాణ బంద్ 18వ తేదీకి వాయిదాపడింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించటంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎలాగైనా హైకోర్టు విధించిన స్టేని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తొలగించేట్లుగా సుప్రింకోర్టులో కేసు దాఖలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే జీవో ఎంఎస్ 9 అమలుపై స్టే కు నిరసనగా రాష్ట్రంలోని బీసీ సంఘాలు(BC Associations) ఈనెల 14వ తేదీన బంద్ పాటించాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఇదేవిషయమై ఆదివారం సమావేశమైన 33 బీసీ సంఘాలు సుదీర్ఘంగా చర్చించాయి. చర్చలో బంద్(Telangana Bandh) ను 14వ తేదీనుండి 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయమైంది.

అలాగే బీసీ సంఘాలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటవ్వాలని కూడా నిర్ణయించాయి. ఈ జేఏసీకి ఛైర్మన్ గా బీసీ జాతీయ సంక్షేమసంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యను ఛైర్మన్ గా సమావేశం నియమించింది. వైస్ ఛైర్మన్ గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మన్ గా జాజుల శ్రీనివాస గౌడ్, కో ఛైర్మన్ గా దాసు సురేష్, రాజారామ్ యాదవ్ ను సమావేశం నియమించింది.

బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీచేయగానే స్ధానికసంస్ధల ఎన్నికల్లో తమకు 42శాతం రిజర్వేషన్లు అమలైపోయినట్లే అని బీసీ సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. చాలామంది బీసీ సామాజికవర్గంలోని నేతలు స్ధానికఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోయారు. అనుకూల, ప్రతికూల పరిస్ధితులపై అధ్యయనాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ సమయంలో బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏమనంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం గతంలో సుప్రింకోర్టు తీర్పుకు విరుద్ధమని. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు తీర్పును రేవంత్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని బుట్టెంగారి తన పిటీషన్లో పేర్కొన్నాడు.

ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లకు బీసీలకు ప్రభుత్వం కేటాయించిన 42శాతం రిజర్వేషన్లను కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67శాతంకు చేరుకుంటున్నట్లు బుట్టెంగారి తన పిటీషన్లో వివరించారు. అందుకనే ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని కొట్టేయాలని పిటీషన్లో కోరారు. కేసును విచారించిన హైకోర్టు జీవో 9 అమలుపై స్టే విదించటంతో బీసీ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. పార్టీలకు అతీతంగా బీసీ నేతలు రెండురోజులుగా సమావేశాలు జరుపుతున్నారు. పార్టీలకు అతీతంగా బీసీల నేతలు, అన్నీ పార్టీల్లోని బీసీల నేతలు, బీసీ సంఘాలు ఆదివారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను నిర్ణయించే విషయమై చర్చించాయి. ఈ సమయంలోనే బంద్ ను 14వ తేదీ కాకుండా 18వ తేదీన నిర్వహించాలని డిసైడ్ అయ్యాయి. ఇకపై జరగబోయే అన్నీ ఉద్యమాలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కూడా నేటి సమావేశం డిసైడ్ చేసింది.

Tags:    

Similar News