ఇండిగో సమస్యకు కారణంతో పాటు పరిష్కారాన్నీ సూచించిన కేటీఆర్
అధికారం ఒకరిద్దరి చేతుల్లోనే బిజినెస్ కేంద్రీకృతమైతే ఇపుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్ధితే ఉత్పన్నమవుతుందన్నారు
ఇంతకాలానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరెక్టుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిరోజు ఆరోపణలతో బురదచల్లేసే కేటీఆర్(KTR) ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో(Indigo flights) విమానాల రద్దు సమస్యపైన మాత్రం కరెక్టుగా మాట్లాడారు. సమస్యతో పాటు దానికి పరిష్కారం కూడా సూచించటం గమనార్హం. శనివారం నగరంలో ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలపై మాట్లాడిన కేటీఆర్ ఇండిగో విమానాల రద్దు, పర్యవసానాలపైన ప్రత్యేకంగా మాట్లాడారు.
కేటీఆర్ ఏమన్నారంటే అధికారం ఒకరిద్దరి చేతుల్లోనే బిజినెస్ కేంద్రీకృతమైతే ఇపుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్ధితే ఉత్పన్నమవుతుందన్నారు. పైలెట్లపై భారం మోపద్దని, దోపిడీ చేయద్దని కేంద్రప్రభుత్వం పోయిన ఏడాదే చెప్పినా విమానయాన సంస్ధలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోలేదని ఆరోపించారు. దాని ఫలితంగానే ఇపుడు ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీచేసిన ఆదేశాలను వేరేదారిలేక కేంద్రప్రభుత్వమే ఉపసంహరించుకున్నట్లు కేటీఆర్ ఎద్దేవాచేశారు.
ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను చివరకు కేంద్రప్రభుత్వమే ఉపసంహరించుకున్నది అని కేటీఆర్ దెప్పిపొడిచారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను ఇండిగో యాజమాన్యం ఖాతరు చేయలేదంటే పరిస్ధితి ఎంతదాకా వెళ్ళిందో అందరు అర్ధంచేసుకోవాలన్నారు. ఈ పరిస్ధితి ఎందుకు వచ్చిందంటే విమానయాన మార్గాల్లో ఇండిగో యాజమాన్యందే గుత్తాధిపత్యంగా కేటీఆర్ వివరించారు. విమానయాన సర్వీసుల్లో ఇండిగో వాట సుమారు 68 శాతం ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. తనకు గుత్తాధిపత్యం ఉందికాబట్టే కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను ఇండిగో యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయలేదన్నారు.
దేశంలో విమానాలన్నీ ఇండిగో, టాటా చేతుల్లోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సంపద మొత్తం కొంది చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్ధితులే తలెత్తుతాయన్నారు. నాణ్యతతో కూడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని సూచించారు. గుత్తాధిపత్యం పోతేనే విమానయాన సంస్ధల యాజమాన్యాలు ప్రభుత్వాలు చెప్పిన మాట వింటాయని, జనాలకు కూడా అసౌకర్యం కలగకుండా సర్వీసులను నడుపుతాయని కేటీఆర్ సూచించారు.