మద్యం అమ్మకాల రికార్డ్, నాలుగు రోజుల్లో ఎంతంటే..!
గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది 107శాతం పెరిగిన లిక్కర్ అమ్మకాలు.
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఎముకలు కొరికే చలి ప్రజలను గజగజలాస్తుంటే మరోవైపు మందుబాబులు మాత్రం ఈ చలిలో కూడా చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్నారు. నాలుగు రోజుల్లోనే 5.89లక్షల కేసుల బీర్లు అమ్ముడవడమే అందుకు ఉదాహరణ. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు 107శాతం పెరిగాయి. 2024లో అత్యధికంగా నాలుగు రోజుల్లో అమ్ముడైన బీర్లు 4.26 కేసులు. ఈ ఏడాది ఆ సంఖ్య 5.89లక్షల కేసులకు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు చూస్తే ఆకాశం కాదు.. అంతరిక్షమే హద్దులా ఉంది. రికార్డ్‌లను బద్దలు కొట్టాయి. నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అయిన మద్యం అమ్మకాల విలువ రూ.578.86 కోట్లు. డిసెంబర్ 1 నుంచి 4 వరకు ఈ అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి చూసుకుంటే అంటే గత రెండేళ్లలో జరిగిన మద్యం అమ్మకాల విలువ రూ.71వేల కోట్లు. 2023-2025 మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్ 960 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.
పాతపాలసీ అమలైన 2023 డిసెంబర్ నెలలో రూ.4297 కోట్ల వ్యాపారం జరిగింది. ఆ తర్వాత ఏడాది 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు రూ.37,485 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2025లో నవంబర్ వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.