కేటీఆర్ మీద ఏసీబీ యాక్షన్లో జాప్యానికి కారణమిదేనా ?

అర్వింద్ మీద యాక్షన్ కు డీవోపీటీ అనుమతిచ్చేంతవరకు కేటీఆర్ మీద ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకోదని తెలిసింది

Update: 2025-12-05 10:28 GMT
KTR and Formula car race case

ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతిచ్చి మూడువారాలవుతోంది. గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఫైలును తన దగ్గరే 70 రోజులు అట్టే పెట్టుకున్నారు. కేటీఆర్(KTR) మీద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth) ఎందుకు యాక్షన్ తీసుకోవటంలేదన్న ప్రశ్నకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది. అలాంటిది గవర్నర్ అనుమతిచ్చి 20 రోజులైనా మరి ఎందుకు ఆలస్యమవుతోంది ?

ఎందుకంటే ఫార్ములా కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కూడా ఇరుక్కున్నారు. కేటీఆర్ ఏ1 అయితే అర్వింద్ ఏ2. అర్వింద్ ఏ2నే కాకుండా ఫార్ములా కేసులో కేటీఆర్ అధికార దుర్వినియోగం, అవినీతికి ప్రధాన సాక్షి కూడా. ఫార్ములా అవినీతి జరిగిన విధానాన్ని చీఫ్ సెక్రటరీ జరిపిన శాఖాపరమైన విచారణతో పాటు ఏసీబీ, ఈడీలకు పూసగుచ్చినట్లు చెప్పేశాడని సమాచారం. ఒకరకంగా ఫార్ములా కేసులో కేటీఆర్ పైన ప్రభుత్వం యాక్షన్ తీసుకునేందుకు అర్వింద్ అప్రూవర్ గా మారినట్లు అనుకోవచ్చు. అలాంటి అర్వింద్ మీద కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోవాలంటే డీవోపీటీ అనుమతి అవసరం. అర్వింద్ మీద కేసు నమోదుచేసి విచారించకపోతే కేటీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగం నిరూపితం కాదు. అందుకనే అర్వింద్ మీద యాక్షన్ కు డీవోపీటీ అనుమతిచ్చేంతవరకు కేటీఆర్ మీద ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకోదని తెలిసింది.

ఎక్కడ ఆలస్యం ?

అఖిలభారత సర్వీసు అధికారులపైన కేసులు నమోదుచేసి విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా యాక్షన్ తీసుకునేందుకు లేదు. కేంద్ర హోంశాఖ పరిధిలోని డీవోపీటో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. శాఖాపరమైన విచారణ చేయటంవరకు ఓకేనే కాని యాక్షన్ తీసుకునేందుకు లేదు. డీవోపీటీ అనుమతిలేకుండానే రాష్ట్రప్రభుత్వం యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నించినా చెల్లదు. అందుకనే అర్వింద్ మీద కేసునమోదు చేసి విచారణ జరపటానికి అనుమతి ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి డీవోపీటీకి లేఖ రాశారు. అక్కడినుండి అనుమతి వచ్చేంతవరకు ఏసీబీ వెయిట్ చేయకతప్పదు.

అర్వింద్ పాత్రేమిటి ?

ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చింది కేటీఆర్ అయితే వాటిని అమలుచేసింది అర్వింద్ కుమార్. ఎలాంటి ఫైలు లేకుండా ఆర్ధికశాఖ, క్యాబినెట్ సమావేశంలో చర్చ, అనుమతి లేకుండా బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు జరపటం పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్ రేసు నిర్వహించిందేమో మున్సిపల్ శాఖ అయితే చెల్లింపులు చేసిందేమో రేసుతో ఎలాంటి సంబంధంలేని హెచ్ఎండీఏ. కేటీఆర్ మౌఖిక ఆదేశాలను పాటించాల్సిన అవసరం అర్వింద్ కు ఏమొచ్చింది ? ఫైలు రూపంలో ఎలాంటి ఆదేశాలు జరపకుండానే కేవలం మొబైల్ ఫోన్లో కేటీఆర్ నుండి వచ్చిన ఆదేశాలను అర్వింద్ అమలుచేసేశారు. ఫైల్ లేకుండా, ఆర్ధికశాఖకు తెలీకుండా, క్యాబినెట్లో చర్చించకుండానే కోట్లరూపాయలు చెల్లించటం తప్పని సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కు బాగా తెలుసు. అయినా ఎందుకు చెల్లింపులు చేసేశారు ?

ఎందుకంటే 2023 ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సే అని కేటీఆర్ అందరినీ నమ్మించారు. అప్పటికే భావి ముఖ్యమంత్రి అనే ట్యాగ్ కేటీఆర్ విషయంలో బాగా ప్రచారంలో ఉంది. ఎన్నికల ఫలితాలు రావటమే ఆలస్యం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసినట్లే అనేంతగా కేటీఆర్ బిల్డప్ ఇచ్చారు. అధికారంలోకి రాబోయే పార్టీ, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ చెబితే కుదరదు అనే ధైర్యం ఎంతమందికి ఉంటుంది. కేటీఆర్ గుడ్ లుక్స్ లో ఉండాలన్న తపన తప్ప తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తున్నామా లేదా అన్న ఆలోచనను కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు వదిలేశారు. దాని ఫలితమే ఇపుడు అర్వింద్ మీద కేసులు, విచారణలు.

ఎక్కడ మాట్లాడినా ఫార్ములా కేసు లొట్టపీసు కేసంటు కేటీఆర్ పైకి చాలా తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. అయితే లోలోపల మాత్రం టెన్షన్ పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. ఫార్ములా కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కేటీఆరే అన్న విషయాన్ని అర్వింద్ గనుక చెబితే అప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఈ విషయాన్ని గతంలో చీఫ్ సెక్రటరీ నిర్వహించిన శాఖాపరమైన విచారణలో అర్వింద్ అంగీకరించినట్లు సమాచారం. ఇపుడు ఏసీబీ, ఈడీల విచారణలో కూడా చెబితే దాని ఫలితం వేరేగా ఉంటుంది. అందుకనే అర్వింద్ మీద విచారణకు డీవోపీటీ అనుమతి ఇచ్చేంతవరకు ఏసీబీ కేటీఆర్ జోలికి వెళ్ళకూడదని అనుకున్నట్లు సమాచారం. డీవోపీటీ అనుమతిస్తే తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరుగుతాయనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News