రాజీనామా విషయంలో దానం కీలక ప్రకటన
అనర్హత వేటు వేయించుకోవటం కన్నా రాజీనామా చేస్తే కాస్త గౌరవంగా ఉంటుందన్న విషయం దానంకు తెలియనది కాదు
రాజీనామా విషయంలో ఫిరాయింపు ఎంఎల్ఏ దానం నాగేందర్ మెంటల్ గా డిసైడ్ అయినట్లే ఉన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని దానం(Danam Nagendar) శుక్రవారం ప్రకటించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఎన్నికలు, రాజీనామాలు తనకు కొత్తకాదన్నారు. రేవంత్(Revanth) ఆదేశిస్తే రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిసైడ్ అయ్యారు. అందుకనే వీళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలని కోర్టులో కేసులు దాఖలు చేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏల కేసుల విచారణ ఇపుడు సుప్రింకోర్టులో జరుగుతోంది.
సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎంఎల్ఏలందరినీ విచారిస్తున్నారు. పదిమంది ఫిరాయింపుల్లో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి తప్ప మిగిలిన ఎనిమిదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు విచారణకు హాజరై తమవాదనలు వినిపించారు. పై ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రం స్పీకర్ విచారణ కోసం ఎన్నిసార్లు నోటీసులు జారీచేస్తున్నా హాజరుకావటంలేదు. ఎప్పుడు నోటీసులు అందుకున్నా తమకు కాస్త సమయం కావాలని కోరుతున్నారే కాని విచారణకు మాత్రం హాజరవటంలేదు. ఫిరాయింపులపై విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకునేందుకు సుప్రింకోర్టు గతంలో స్పీకర్ కు ఇచ్చిన మూడునెలల గడువు అక్టోబర్ చివరి వారంలోనే ముగిసింది. విచారణ పూర్తిచేసేందుకు తనకు మరో నాలుగు వారాల గడువు కావాలని స్పీకర్ రిక్వెస్ట్ చేశారు. సుప్రింకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ గడువు కూడా ఈనెల రెండో వారంతో ముగుస్తోంది.
సో, దానం, కడియం విచారణకు హాజరైనా కాకపోయినా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సుంటుంది. అలాగే తన నిర్ణయాన్ని సుప్రింకోర్టుకు రిపోర్టుచేయాలి. తమపై అనర్హత వేటు తప్పదని దానం, కడియం మెంటల్ గా ఫిక్సయినట్లున్నారు. అందుకనే ఈరోజు దానం మాట్లాడుతు రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజీనామా చేయమని రేవంత్ ఆదేశించకపోయినా దానంపైన అనర్హత వేటు అయితే తప్పదు. అనర్హత వేటు వేయించుకోవటం కన్నా రాజీనామా చేస్తే కాస్త గౌరవంగా ఉంటుందన్న విషయం దానంకు తెలియనది కాదు.
వీళ్ళు సేఫేనా ?
విచారణకు హాజరైన భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్, జగిత్యాల్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి తాము కాంగ్రెస్ లో చేరలేదని చెబుతున్నారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే రేవంత్ ను కలిసినట్లు చాలాసార్లు మీడియాతో కూడా చెప్పారు. వీళ్ళపై అనర్హత వేటుపడేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ ను కలవటం మినహా వీళ్ళు కాంగ్రెస్ లో చేరారు అనేందుకు బీఆర్ఎస్ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. స్పీకర్ సమక్షంలో జరిగిన విచారణలో కూడా ఎంఎల్ఏ ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధారాలను చూపించలేకపోయింది.
దానం, కడియంకు తప్పదా ?
అయితే దానం, కడియం విషయం మాత్రం వేరుగా ఉంది. వీరిపైన అనర్హత వేటుపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణాలు ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న దానం సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ అయిన దానం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్ధిగా ఎలా పోటీచేస్తారు ? ఇక, కడియం కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. కావ్య కాంగ్రెస్ తరపున పోటీచేయటంలో తప్పేమీలేదు. అయితే కావ్య నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదిస్తు సంతకాలు చేసినవారిలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎంఎల్ఏగా సంతకంచేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన కావ్యకు బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రతిపాదిస్తు శ్రీహరి ఎలా సంతకంచేస్తారు ? అన్నదే ఇక్కడ పాయింట్. సాంకేతికంగా శ్రీహరి సంతకంచేయటం కరెక్టో కాదో కోర్టే తేల్చాలి. ఏదేమైనా కడియం, దానం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని ఇపుడు లేదా గతంలో చేసిన ప్రకటనలబట్టే అర్ధమవుతోంది. రాజీనామాలు ఎప్పుడు చేస్తారు అన్నదే చూడాలి.