వికారాబాద్ కోతుల సమస్య ఇకనైనా పరిష్కారమయ్యేనా?
కోతుల దాడులతో వికారాబాద్ రైతుల పంటలు దెబ్బతింటున్నాయని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం పార్లమెంటులో చెప్పారు.
వికారాబాద్ జిల్లాలో కోతులు పంటల్ని ధ్వంసం చేస్తూ, రైతుల ఆశలు చంపేస్తున్నాయి. కోతులు, అడవిపందులు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యను తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లోక్ సభలో గట్టిగా లేవనెత్తి...కేంద్రం ఈ సమస్యను దృష్టిలోకి తీసుకుని ఒక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లోక్ సభలో గళమెత్తిన ‘కొండా’
కోతుల సమస్య నివారణలో అటవీశాఖ డీఎఫ్ఓ, వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ తమకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోతుల సమస్య జాతీయ స్థాయి పెద్ద సమస్య అని, కోతులతోపాటు అడవి పందులు, నీలుగాయిలను నియంత్రించి రైతుల పంటలు దెబ్బతినకుండా చూడాలని ఎంపీ కొండా డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో కోతులది అర్జంట్ సమస్య అని దీనిపై మాట్లాడేందుకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి స్పీకర్ సార్ అంటూ ఎంపీ కొండా కోరారు. కోతుల సమస్యను పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నోడల్ మినిస్ట్రీని నియమించాలని కోరారు.