సౌదీ బస్ ఫైర్ 'మృత్యుంజయుడు' షోయబ్ తో ఇంటర్వ్యూ

ఘోర రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ షోయబ్ మొహ‌మ్మ‌ద్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?

Update: 2025-12-04 12:02 GMT

సౌదీ ఆరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ షోయబ్ మొహ‌మ్మ‌ద్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? సౌదీ నుంచి షోయ‌బ్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఆసిఫ్‌నగర్‌, జిర్రా ప్రాంతంలోని నటరాజ్‌నగర్ లో నివాసం ఉంటున్న‌ షోయ‌బ్ తో ఫెడ‌ర‌ల్ తెలంగాణా బృందం క‌లిసింది.  ఆ దుర్ఘ‌ట‌న గురించి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో షోయ‌బ్ మాట్లాడారు. బ‌స్సు ఎందుకు ఆగింది? ఆయిల్ ట్యాంక‌ర్ 120 కి.మీ. స్పీడ్‌లో వ‌చ్చి ఎందుకు గుద్దుకుంది? అంతా కేవ‌లం 7 నిమిషాల్లోనే బ‌స్సు ఆగ్నికి ఆహూతి అయింది.  ఆ చీక‌టి క్ష‌ణాల్ని త‌ల‌చుకుంటూ షోయ‌బ్ మాట‌ల్లో....

హైద‌రాబాద్ నుంచి 9వ తేదీన‌ 'మ‌క్కా'కు వెళ్ళాం. 17వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌క్కా నుంచి మ‌దీనా  బ‌య‌లుదేరాం. మార్గ మ‌ధ్య‌లో 'బ‌ద‌ర్' ప్రాంతాన్ని సంద‌ర్శించాం. 'రాత్రి న‌మాజ్' ఏడున్న‌ర స‌మ‌యంలో పూర్తి చేసుకుని బ‌ద‌ర్ నుంచి బ‌య‌లుదేరి చెక్ పోస్ట్ దాటం. 

బ‌స్సు లోప‌ల చిన్న పిల్ల‌లు వాష్ రూం వెళ్లాల‌ని డోర్ ఓపెన్ చేస్తుంటే, ఓపెన్ కావ‌డం లేద‌ని డ్రైవ‌ర్‌కు చెప్పారు. డ్రైవ‌ర్ బ‌స్సు ఆపి, బ‌స్సు లోప‌లే వున్న బాత్ రూం డోర్ తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నప్పుడు,అదే ట్రాక్‌పై వేగంగా వ‌స్తున్న ఆయిల్ ట్యాంక‌ర్ బ‌స్సు వెనుక బాగానికి 120 కి.మీ. స్పీడ్‌తో గుద్దింది.

నేను, నా కుటుంబ స‌భ్యులు ముందు సీటుపై కూర్చొని వున్నాం. నేనేమో బ‌స్సు ఆగిన వెంట‌నే కొంచెం ముందుకు వెళ్ళి డ్రైవ‌ర్ ప‌క్క సీటు వ‌ద్ద నిల‌బ‌డ్డాను.

ట్యాంక‌ర్ గుద్ద‌డం, క్ష‌ణాల్లో మంట‌లు అంటుకోవ‌డం, డ్రైవ‌ర్‌తో పాటు, నేను కూడా విండోలోంచి దూకేశాను. దూకిన‌ప్ప‌ట్టికీ, డ్రైవ‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయి. ఆ మంట‌ల్లో చిక్కుకుని డ్రైవ‌ర్ కూడా చ‌నిపోయాడు. న‌న్ను మంట‌లు చుట్టుముట్టాయి. వెంట‌నే నాపైనున్న బ‌ట్ట‌ల్ని తొల‌గించాను. అయినా కాళ్ల‌కు మంట‌లు అంటుకున్నాయి.

ఆ రోడ్‌పై మూడు ట్రాక్‌లున్నాయి. 

120 కి.మీ. వెళ్ళే ట్రాక్‌,

80 కి.మీ. వెళ్ళే ట్రాక్‌,

60 కి.మీ. ట్రాక్‌. 

మీము ప్ర‌యాణిస్తున్న బ‌స్సు 120 కి.మీ. ట్రాక్‌పైన వుంది. బ‌స్సును ప‌క్క‌కు తీసి ఆప‌కుండా, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా అదే ట్రాక్‌పై బ‌స్సు నిలిపాడు. ఇక్క‌డ డ్రైవ‌ర్ రెండు త‌ప్పులు చేశాడు. 

ఒక‌టి... 120 కి.మీ ట్రాక్‌పైనే బ‌స్సు నిల‌ప‌డం.

రెండు... డోర్ ఓపెన్ చేయ‌కుండానే బ‌య‌టికి దూక‌డం.

ఆ బ‌స్సుకు హైడ్రాలిక్ డోర్‌లు ఉన్నాయి. ఆ డోర్‌లు ఓపెన్ కావాలంటే బ‌ట‌న్ నొక్కాలి. బ‌ట‌న్ నొక్కిన నిమిషం త‌రువాతే ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయి వుంటే, క‌నీసం ముందు సీట్లో కూర్చుని వున్న నా ఫ్యామిలీతో పాటు మరి కొంత మంది ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డేవారు.

చూస్తుండ‌గానే నా క‌ళ్ల ముందే, 5 నిమిషాల్లో బ‌స్సు బూడిద అయిపోయింది. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. 47 మంది మృతి చెందారు. వారిలో నా తండ్రి మహమ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్, తల్లి గౌసియా బేగం, తాత మహమ్మద్‌ మౌలానా వున్నారు. ఈ ప్ర‌మాదంలో మూడు త‌రాల‌వారు చ‌నిపోయారు.

5 నిమిషాల్లోనే పోలీసులు వ‌చ్చారు. న‌న్ను డ్రైవ‌ర్ అనుకున్నారు. నాకు అర‌బిక్ భాష రాదు. కానీ అక్క‌డే రోడ్డుపైన ఓ ఇండియ‌న్ ముస్లిం ఆ హైవేపైన‌ ప్ర‌యాణం చేస్తూ ఆగారు. నేను చెప్పింది ఆయ‌న అర‌బిక్‌లో పోలీసుల‌కు చెప్పారు. పోలీసులు నా వేలిముద్ర‌లు తీసుకోవ‌డంతో వారి ఫోన్‌లో నా పాస్‌పోర్ట్‌, విసా క‌నిపించాయి. 

మంట‌ల్ని ఆర‌ప‌డానికి, 7 నిమిషాల్లో వాట‌ర్ ట్యాంక‌ర్‌లు వ‌చ్చాయి. ఆ మంటల్లో బ‌స్సు ద‌గ్ధం అయింది. రోడ్డుపై ప‌గుళ్లు వ‌చ్చాయి. బ‌స్సులో వున్న 45 మంది, ఆయిల్ ట్యాంక‌ర్‌కు చెందిన ఇద్ద‌రు మొత్తం 47 మంది ఆగ్నికి ద‌హ‌న‌మైయ్యారు. మా పాస్‌పోర్ట్‌లు, డ‌బ్బులు, ల‌గేజ్ అంతా కాలి బూడిద అయింది. 

ఇండియ‌న్ ముస్లిం స‌హాయంతో మ‌క్కాలో వున్న అన్న స‌మీర్‌కు ఫోన్ చేసి చెప్పాను. పోలీసులు న‌న్ను అంబులెన్స్‌లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

షోయ‌బ్ అన్న స‌మీర్ తోనూ షెడ‌ర‌ల్ తెలంగాణా మాట్లాడింది.

ఆయ‌న ఏం అంటాడంటే........

షోయ‌బ్ ఫోన్ చేసిన‌ప్పుడు నేను 'ఉమ్రా' విధులు నిర్వ‌ర్తిస్తూ 'కాబా' చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ చేస్తున్నాను. షాక్‌కు గురైయ్యాను. వెంట‌నే ట్రావెల్ వాళ్ల‌తో సంప్ర‌దించాను. బ‌స్సు కాలిపోయింది. అంద‌రూ చ‌నిపోయార‌ని వాళ్ళు చెప్పారు. వెంట‌నే సంఘ‌ట‌న స్థ‌లానికి బ‌య‌లు దేరాను. అయితే ఆసుప‌త్రి లోప‌లికి అనుమ‌తించ‌లేదు. 

రెండు రోజుల త‌రువాతే, మంత్రి అజాహ‌రుద్దీన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తో క‌లిసి ఆసుప‌త్రి లోప‌లికి వెళ్లి షోయ‌బ్‌ను క‌లిశాను. షోయ‌బ్‌కు ఆసుప‌త్రిలో చికిత్స బాగానే జ‌రిగింది. స్థానిక అధికారులు, పోలీసులు, బ‌స్సు ఓన‌ర్ అంద‌రూ వ‌చ్చి క‌లిశారు. ధైర్యం చెప్పారు. 

మ‌క్కా నుంచి బ‌స్సు బ‌య‌లుదేరే స‌మ‌యంలో మాతో పాటు ఉన్న‌ఓ మ‌హిళ‌, ఆమె కుమారుడు బ‌స్సు దిగారు. ఎందుకంటే ఆమె భ‌ర్త సౌదీలో ఉద్యోగం చేస్తారు. ఆయ‌న కారు తీసుకువ‌చ్చారు. ఆయ‌న‌తో పాటు వాళ్ళిద్ద‌రూ కారులో బ‌య‌లు దేరారు, కానీ ఆమె బంధువులు ఇద్ద‌రు ఈ బ‌స్సులోనే మాతో ప్ర‌యాణం చేసి చ‌నిపోయారు. మొత్తం బ‌స్సులో నేను మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాను. బ‌స్సు బ‌య‌లు దేర‌క ముందు దిగి పోయిన ఆ ఇద్ద‌రు కూడా ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ బ‌స్సులో ఇద్ద‌రు దిగి ఖాళీగా వుండ‌టంతో య‌మ‌న్ దేశానికి చెందిన ఇద్ద‌రు ప్ర‌యాణీకులు ఎక్కారు. వాళ్లు కూడా ఈ దుర్ఘ‌ట‌న‌లో ద‌హ‌నం అయ్యారు. 

సౌదీ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏదైనా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే, ప్ర‌మాదం జ‌రిగిన రోడ్డు ప‌క్క‌నే, మృతులను 'ఖ‌న‌నం' చేస్తార‌ట‌. అక్క‌డే చేస్తామ‌ని సౌదీ ప్ర‌భుత్వం చెప్పింది.

సౌదీ బ‌స్సు ప్ర‌మాదం నేప‌థ్యంలో వెంట‌నే స్పందించిన 'భార‌త ప్ర‌భుత్వం' ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ఆధ్వ‌ర్యంలో కేంద్ర డెలిగేష‌న్ ను మ‌క్కాకు పంపింది. కేంద్ర‌ డెలిగేష‌న్‌తో పాటు తెలంగాణా మంత్రి అజ‌హ‌రుద్దీన్‌, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ల బృంధం  'మ‌క్కా గ‌వ‌ర్న‌ర్‌'తో మాట్లాడి, మృతుల్ని 'మ‌దీనాలోని జ‌న్న‌తుల్ బ‌ఖీ'లో ఖ‌న‌నం చేయ‌డానికి ఒప్పించారు. అలా మృతుల బంధువుల స‌మ‌క్షంలో జ‌న్న‌తుల్ బ‌ఖీలో 'త‌త్‌ఫీన్' అంటే ఖ‌న‌నం పూర్తి చేశారు.

ఈ ఉమ్రా ప్ర‌యాణంలో షోయ‌బ్ అన్న కూడా క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని ప్లాన్ చేసుకున్నా, టెక్నిక‌ల్‌గా ఏవో ఇబ్బందులు రావ‌డంతో మ‌రో ట్రావెల్స్ ద్వారా షోయ‌బ్ కుటుంబానికి చెందిన ఆరుగురు 'రెండు రోజులు' ఆల‌స్యంగా మ‌క్కాకు వెళ్ళారు. అలా ఆ ఆరుగురు ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోగ‌లిగారు.

నేను తిరిగి ఇండియా రావ‌డానికి భార‌త ఎంబ‌సీ అవుట్‌పాస్ ఇచ్చింది. అయితే ఇన్సూరెన్స్ గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారులు ప్ర‌య‌త్నం చేస్తున్నాం అంటున్నారు. 96 వేల రూపాయ‌లు ట్రావెల్స్ నిర్వాహ‌కులు తీసుకుని ఉమ్రాకు తీసుకు వెళ్ళారు. మేము మ‌దీనాలో స్టే చేయ‌లేదు. ఆ హోట‌ల్ ఖ‌ర్చులు తిరిగి రావాలి. మేము రిట‌ర్న్ ఫ్లైట్‌లో రాలేదు. ఆ టికెట్ డ‌బ్బులు కూడా తిరిగి ఇవ్వాలి. కానీ..., అల్ మ‌క్కా ట్రావెల్స్ నిర్వాహ‌కులు మాత్రం ముఖం చాటేశారు. 

నా శ‌రీరం అస్స‌లు స‌హ‌క‌రించ‌డం లేదు. ప్ర‌భుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. మృతుల వార‌సులు చాలా మంది అనాథ‌లుగా మిగిలిపోయారు. వారి ప‌రిస్థితి చాలా దుర్భ‌రంగా వుంది, అని షోయ‌బ్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

Tags:    

Similar News