కాంగ్రెస్ భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతాం: కేటీఆర్

HILTPపై పోరుబాట ప్రారంభించిన మాజీ మంత్రి కేటీఆర్.

Update: 2025-12-04 08:14 GMT
కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌లో హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట చేపట్టింది. మొత్తం ఎనిమిది క్లస్టర్లుగా కీలక నేతలను నియమించారు. ప్రతి క్లస్టర్ కూడా నిర్ణీత ప్రాంతాల్లో పర్యటించి నిజనిర్ధారణ చేయనుందని బీఆర్ఎస్ వెల్లడించింది. ఇందులో భాగంగానే కేటీఆర్ బృందం గురువారం కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించింది. ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్‌లోని షాపూర్ దగ్గర హమాలీలతో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ తెరలేపిన భారీ భూ కుంభకోణంపై తాము క్షేత్రస్థాయిలో పోరాడతామని అన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం జరగనివ్వమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం HILTP (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు వద్దంటూ... అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారని విమర్శించారు.

 

అవి నిబంధనలతో ఇచ్చిన ప్రజల భూములు

‘‘ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు; ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగింది. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోంది. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి స్మశానాలకు కూడా స్థలం లేదు. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోంది’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలి. హైదరాబాద్‌లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈరోజు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నాము. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నాము’’ అని తెలిపారు.

భూమిని కాపాడే వరకు పోరాటం ఆగదు

ఈ అంశాన్ని తమ పార్టీ ఇక్కడితో వదిలిపెట్టదని చెప్పారు. HILT (హిల్ట్) పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు కేటీఆర్. నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామని, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామన్నారు. ‘‘ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాము’’ అని వ్యాఖ్యానించారు.

 

‘‘ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక... తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ఓ తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయింది అంటూ ప్రభుత్వం బాధపడుతోంది. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ స్కామ్‌కి ఇదే నిదర్శనం

‘‘ఈరోజు మేము పర్యటిస్తున్న జీడిమెట్ల ప్రాంతంలో మార్కెట్ ధర గజానికి కనీసం లక్ష రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 4,000 రూపాయలకే పూర్తిగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెబుతోంది. ఒకవైపు 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనం’’ అని అన్నారు.

 

‘‘మేము గతంలో తెచ్చిన గ్రిడ్ (GRID) పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేది. ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మా పాలసీ ఆదర్శం అయితే... ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలి. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలి. అంతేకానీ అప్పనంగా అపార్ట్‌మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్

‘‘హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకి పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేశాము. దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే. అందుకే అక్కడ ఫార్మాసిటీలోనూ, ఇక్కడ పారిశ్రామిక భూముల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

Tags:    

Similar News