హిడ్మా ఎన్ కౌంటర్ కు కారణం ఎవరో తెలిసిపోయింది

కొందరు కలపవ్యాపారులు దగ్గరుండి హిడ్మా, శంకర్లను వైద్యం కోసం విజయవాడకు తీసుకొచ్చారు

Update: 2025-12-04 08:45 GMT
Maoist leader Hidma (File Photo)

మావోయిస్టుపార్టీలో అత్యంత ప్రముఖుడు, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ కార్యదర్శి మాద్వి హిడ్మా పోలీసుల ఎన్ కౌంటర్లో నవంబర్ 18వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. హిడ్మాను భద్రతాదళాలు లేదా పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం అంటే మామూలు విషయంకాదు. 24 గంటలూ అత్యంత భద్రతమధ్య ఉండే(Maoist leader Hidma) హిడ్మా భద్రతాదళాలకే దొరకటంలేదు. దాదాపు మూడేళ్ళుగా హిడ్మా టార్గెట్ గా(Operation Kagar) ఆపరేషన్ కగార్లో భద్రతాదళాలు దండకారణ్యం మొత్తాన్ని జల్లెడపడుతున్నా ఆచూకీ కూడా కనుక్కోలేకపోయాయి. అలాంటి హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఏపీ పోలీసులకు ఎదురుపడి సింపుల్ గా ఎన్ కౌంటర్లో చనిపోవటాన్ని చాలామంది నమ్మలేదు. దండకారణ్యం వదిలిపెట్టి హిడ్మా అసలు ఏపీలోకి ఎందుకు అడుగుపెట్టాడు ? ఎప్పుడు వచ్చాడు ? అనే ప్రశ్నలు చాలామందిలో ఇప్పటికీ మెదులుతున్నాయి. అయితే ఎవరూ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.

ఈ నేపధ్యంలోనే మావోయిస్టుపార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో చాలామంది అనుమానాలకు, ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే అనుకోవాలి. లేఖ ద్వారా బయటపడిన విషయాలు ఏమిటంటే హిడ్మా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిడ్మాతో పాటు మరో మావోయిస్టు నేత శంకర్ల కూడా వైద్యం కోసం విజయవాడకు వచ్చాడు. కొందరు కలపవ్యాపారులు దగ్గరుండి హిడ్మా, శంకర్లను వైద్యం కోసం విజయవాడకు తీసుకొచ్చారు.

అనేక మార్గాల్లో హిడ్మా ఆచూకీ కోసం జల్లెడపడుతున్న భద్రతాదళాలకు కలపవ్యాపారులు దండకారణ్యం నుండి కొందరిని వైద్యం కోసం విజయవాడకు తీసుకుని వచ్చినట్లు తెలుసుకున్నారు. కలపవ్యాపారులకు సంబంధించిన వారిని భద్రతాదళాలు కాంటాక్టు చేశాయి. వ్యాపారులకు సంబంధించిన వారిద్వారానే భద్రతాదళాలు కలపవ్యాపారులను కాంటాక్టు చేశాయి. హిడ్మా, శంకర్ల విజయవాడలోని ఆసుపత్రిలో చేరటంతో పాటు మిగిలిన మావోయిస్టులు ఉంటున్న ఇంటి వివరాలను కూడా భద్రతాదళాలు రాబట్టాయి. హిడ్మా, శంకర్లను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించిన వ్యాపారులు తిరిగి దండకారణ్యం ప్రాంతానికి తిరిగి వచ్చేశారు. తిరిగివచ్చిన వ్యాపారులు భద్రతాదళాలకు పట్టుబడటంతో హిడ్మా, శంకర్లను ఏ ఆసుపత్రిలో చేర్పించింది, మిగిలిన మావోయిస్టులను ఎక్కడ ఉంచారన్న విషయాన్ని వ్యాపారులు చెప్పేశారు.

అన్నీ వివరాలను రాబట్టిన భద్రతాదళాల ఉన్నతాధికారులు విజయవాడ పోలీసు అధికారులను సంప్రదించి విషయం అంతా వివరించారు. దాంతో విజయవాడ పోలీసులు పెద్దఎత్తున బలగాలతో హిడ్మా, శంకర్ల తదితరులు ఉంటున్న ఆసుపత్రి, ఇంటిమీద దాడిచేశారు. మావోయిస్టులను, ఆయుధాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను చెప్పిన వికల్ప్ వారంరోజులు హిడ్మాను చిత్రహింసలకు గురిచేసి చివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవులకు తీసుకెళ్ళి కాల్చిచంపేసినట్లు ఆరోపించాడు. ఎన్ కౌంటర్లపై సమగ్ర దర్యాప్తుచేయాలని వికల్ప్ తన లేఖలో డిమాండ్ చేశారు. వికల్ప్ ఆరోపణలకు, డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా ? డౌటే.

Tags:    

Similar News