తెలంగాణ నిరుద్యోగులకు ‘న్యూఇయర్ గిఫ్ట్’

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్లాన్

Update: 2025-12-04 02:33 GMT


ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు  కొత్త సంవత్సరం కానుక సిద్ధం చేస్తున్నారు. అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

'ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు' లో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో  మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

"హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. అరవై ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చా. డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది.తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడైన రోజు. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది," అని రేవంత్ అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అండగా నిలిచిన తీరు, శ్రీమతి సోనియా గాంధీ  ఇచ్చిన మాట, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని డిసెంబర్ 3 న తెలంగాణ కోసం శ్రీకాంతా చారి బలిదానం చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి  ప్రస్తావిస్తూ, శ్రీకాంతా చారి ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.

ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
 రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో  పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Tags:    

Similar News