పార్లమెంట్‌లో కోతులపై చర్చ
కనిపించడానికి చిన్న సమస్యలా ఉన్నా చాలా పెద్ద విషయమన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
పార్లమెంటులో జంతువుల బెడదలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. గురువారం.. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోతుల బెడద అంశాన్ని పార్లమెంటు ముందు ఉంచారు. కోతుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు. పెద్దమొత్తంలో కోతులు దాడ చేసి పంటలను నాశనం చేస్తున్నాయని, ఈ సమస్యను నివారించడానిక జాతీయ వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమస్యను కొన్ని శాఖల ముందుకు తీసుకెళ్తే వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
‘‘ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని కొందరు దాటేస్తున్నారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకి వస్తుంది? ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ చాలా పెద్ద సమస్య. దీని గురించి తెలుసుకుని చాలా మంది నవ్వుతారు. కానీ తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా కోతుల బెడత తీవ్రంగా ఉంది. ఈ అంశంలో నోడల్ ఏజెన్సీ అవసరం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కోతుల సమస్యను ప్రస్తావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ సమస్య చర్చకొస్తోంది. ఈ సమస్యను పరిష్కరిస్తే సర్పంచ్‌గా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఈ సమస్య ఉంది’’ అని ఆయన వివరించారు.