కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గానం: దివ్యాంగుల్లో కొత్త ధైర్యం!

సంకల్పానికి రెక్కలిచ్చిన స్వరం – పమేలా సత్పతి స్ఫూర్తి గానం!

Update: 2025-12-04 12:52 GMT
సింధూ శ్రీతో కలిసి పాట పాడుతున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

దివ్యాంగుల హృదయాల్లో నమ్మకం కలిగించాలంటే మాటలు సరిపోవు… ఒక్క స్వరం చాలు. కరీంనగర్ జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అదే చేసి చూపించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంధుల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని సింధుశ్రీ చేయి పట్టుకుని, “ఆరాటం ముందూ ఆటంకం ఎంత… సంకల్పం ముందూ వైకల్యం ఎంత…” అని గళం విప్పిన ఆమె, అక్కడున్న ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపారు. పరిపాలనలో ముందుండే కలెక్టర్, ఒక స్ఫూర్తి స్వరంగా మారి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.


కరీంనగర్ జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మరో సారి గళం విప్పారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పమేలా దృష్టి లోపం ఉన్న విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ‘నింగి నేల నాదే’ చిత్రంలోని ‘‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’’ అనే పాటను పాడారు. కరీంనగర్ అంధ పాఠవాల విద్యార్థినితో కలిసి అందరికీ స్ఫూర్తినిచ్చే పాటను పాడిన కలెక్టరు పమేలా సత్పతిని జిల్లా ప్రజలు అభినందించారు. ప్రతిభకు అడ్డంకులు లేవు, అంకితభావం అవకాశాన్ని కలిసినప్పుడు, ప్రతి స్వరం ప్రకాశిస్తుందని అంధ విద్యార్థులు నిరూపించారు.

వైకల్యం ముందు
‘‘ఆరాటం ముందు ఆటంకం ఎంత...సంకల్పం ముందు వైకల్యం ఎంత... దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత... ఎదురీత ముందు విధిరాత ఎంత ’’నమ్మకం పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరే’’పాటను అంగవైకల్య విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా పాడి ఆకట్టుకున్నారు. ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, భవిత కేంద్రంలోని దివ్యాంగులతో కలిసి వీడియో తీసి కలెక్టరు విడుదల చేశారు. 2009వ సంవత్సరంలో ‘నింగి నేల నాదే’ చిత్రంలో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటను పాడి ఆకట్టుకున్నారు.కరీంనగర్ లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నెటిజన్ల నుంచి ప్రశంసలు

జిల్లా కలెక్టరు పమేలా సత్పతి పాడిన పాటకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పాట దివ్వాంగుల్లో స్ఫూర్తినిచ్చేలా ఉందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. దివ్యదృష్టి యూ ట్యూబ్ ఛానల్ లో కలెక్టరు పాడిన గీతాన్ని విడుదల చేశారు. కరీంనగర్ అంధుల పాఠశాల మ్యూజిక్ టీచర్ సరళ , స్థానిక సంగీత దర్శకుడు కేబీ శర్మ ఆధ్వర్యంలో పాట, వీడియో చిత్రీకరణ సాగింది. భ్రూణ హత్యలను నిరోధించేందుకు ‘చిన్ని పిచ్చుక’ అంటూ సందేశాత్మక గీతాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పాడారు. ఒక వైపు జిల్లా కలెక్టరుగా పమేలా సత్పతి పనిచేస్తూనే పాటలు పాడుతూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

దివ్యాంగుల కోసం పమేలా సత్పతి పాడిన ఈ గీతం కేవలం ఒక పాట కాదు… వారి మనసుల్లో నమ్మకాన్ని నాటిన ఆశాకిరణం. కలెక్టరు స్వరం సింధుశ్రీ కలతో కలిసిన ఈ క్షణం, కరీంనగర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.వైకల్యం శరీరానికే… మనసుకు కాదు అనే సందేశం మరోసారి హృదయాలను తాకింది.


Tags:    

Similar News