గజ్వేల్ సర్పంచ్‌లతో కేసీఆర్ మాటామంతి

బీఆర్ఎస్ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్న మాజీ సీఎం కేసీఆర్.

Update: 2025-12-05 13:45 GMT

పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో బలోపేతం అయిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయన్నారు. తాను దార్శనికతతో సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్‌ను కలిశారు. వారిని కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్థులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

"మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్నికొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె" అని గ్రామస్థులకు వివరించారు.

"ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ మన పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు" అని కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా వారికి జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కేసీఆర్ గారు వివరించారు. బంగ్లాదేశ్ కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తి దాత, ప్రొఫెసర్ యూనిస్ తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News