దళ సభ్యుడి వల్లే హిడ్మా ఎన్ కౌంటర్
వికల్ప్ పేరిట మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్టు పార్టీ అగ్రనేత మాడ్వి హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత రకరకాల వార్తా కథనాలు మీడియాలో ప్రచారం అయ్యాయి. హిడ్మా ఎన్ కౌంటర్ వెనక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో ఇప్పటికే అనేక కథనాలు వెల్లడయ్యాయి. అయితే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదలైన లేఖలో అసలు విషయం బయటపడింది.
దళసభ్యుడే సమాచారం ఇచ్చాడు
‘‘నవంబర్ 9న మా దగ్గర నుంచి కోసల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మా ప్రయాణ వివరాలు కోసల్ అందించడం వల్లే పోలీసులు హిడ్మాను హత్య చేయగలిగారు’’ అని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ పేర్కొంది. కోసల్ లొంగిపోయిన విషయం తెలియగానే హిడ్మాను అప్రమత్తం చేసినట్లు వికల్ప్ లేఖలో చెప్పాడు. వెంటనే తిరిగి దండకారణ్యంలోకి వచ్చేయాలని కోరినట్లు చెప్పాడు. కానీ ఆ సమాచారం నవంబర్ 14న అందింది అని తెలిపాడు. సమాచారం అందిన తర్వాత అడవిలోకి వచ్చేందుకు హిడ్మా ప్రయత్నించాడు కాని అదే రోజు పోలీసులు హిడ్మాను చుట్టు ముట్టి పట్టుకున్నట్లు వికల్ప్ చెప్పాడు. హిడ్మాను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించాడు. ‘‘హిడ్మా హత్యకు మావోయిస్టు పార్టీ సభ్యుడు కోసల్ , కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణం’’ అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే హిడ్మా, శంకర్ లు ఎన్ కౌంటర్ అయ్యారని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. హిడ్మా, శంకర్ ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.
మనీశ్ కుంజా ఆరోపణలు అవాస్తవం
కామ్రేడ్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి ఎపిలో అరెస్ట్ అయిన వారిలో లేరని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. పోలీసులతో వారిద్దరూ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు దేవ్‌జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజా ఆరోపించడం రాజ్యం చేసిన కుట్రే అని వికల్ప్ అన్నారు. విజయవాడలో అరెస్టైన కామ్రేడ్లకు న్యాయ సహాయం అందించాలి. ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు వారికి సహాయం చేయాలి’’ అని వికల్ప్ ఆ లేఖలో కోరారు. హిడ్మాను హత్య చేసే కుట్ర విషయంపై తెలంగాణ, ఎపి, చత్తీస్ గడ్ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ కు పూర్తి సమాచారం ఉంది అని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
చికిత్స కోసం విజయవాడ వెళ్లిన హిడ్మా
చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడ వెళ్లారని వికల్ప్ అందులో స్పష్టం చేశారు. అక్టోబర్ 27న హిడ్మా చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లినట్టు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. ‘‘నిరాయుధుడైన హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. దీంతో పోలీసులు నిరాయుధుడైన హిడ్మాను హత్య చేశారు’’ అని ఆరోపించారు. భద్రతాబలగాలను చూడగానే హిడ్మా కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో హిడ్మా చనిపోయాడని కట్టుకథ ప్రచారం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లి అడవుల్లో హిడ్మా ఎన్ కౌంటర్ అయినట్టు పోలీసులు కట్టు కథ అల్లినట్టు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.