కేసీఆర్-కేటీఆర్, జగన్ వైఖరి ఒకేలాగుందా ?
జగన్, కేటీఆర్ ప్రభుత్వాలకు ఒకేలాంటి వార్నింగులు ఇస్తున్నారు
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఒకేలాగుంది. బీఆర్ఎస్ అధినేత (KCR)కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగన్(YS Jagan mohan Reddy) మాట్లాడుతున్న మాటలు విన్నవారికి ఇదే అనుమానం రాకమానదు. ఇపుడు విషయం ఏమిటంటే హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్)పాలసీలో భూములను ఎవరూ కన్వర్షన్ చేసుకోవద్దని కేటీఆర్(KTR) వార్నింగ్ ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. హిల్ట్(HILT Policy) పాలసీలో ల్యాండ్ కన్వర్షన్ చేసుకునే పారిశ్రామికవేత్తలు తర్వాత ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఇపుడు కన్వర్షన్ చేసుకునే భూములన్నింటినీ రెండేళ్ళ తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడగానే లాగేసుకుంటామనే అర్ధం వచ్చేట్లుగా హెచ్చరించారు.
2028లో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ చాలా ధీమాగా ఉన్నట్లు కనబడుతోంది. అందుకనే పారిశ్రామికవేత్తలను ఇంతగట్టిగా హెచ్చరించింది. కేటీఆర్ వార్నింగులను పారిశ్రామికవేత్తలు లెక్కచేస్తారా లేదా అన్నది వేరేసంగతి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చంగా ఇలాంటి హెచ్చరికలనే చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వంలో మంజూరైన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతు పీపీపీ పద్దతిలో కాలేజీలను ఎవరూ తీసుకోవద్దని చెప్పారు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే తమ ప్రభుత్వం రాగానే మళ్ళీ అన్నింటినీ వెనక్కు తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ప్రక్రయ ఎంతవరకు వచ్చిందో చూడాలి. అప్పుడు జగన్ వార్నింగ్ ఇచ్చినట్లే ఇపుడు కేటీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇక కేసీఆర్ వ్యవహారం వేరేగా ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి అసెంబ్లీకి హాజరయ్యింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కేసీఆర్ మూడుసార్లు అసెంబ్లీకి హాజరయ్యుంటారు. ఒకసారి ఎంఎల్ఏగా ప్రమాణం చేయటానికి, రెండుసార్లు బడ్జెట్ సమావేశాల మొదటిరోజు. అంతే మళ్ళీ అసెంబ్లీ మొహమే చూడలేదు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు.
అక్కడ అంటే ఏపీలో జగన్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడినదగ్గర నుండి ఎంఎల్ఏగా ప్రమాణం చేయటానికి మాత్రమే జగన్ అసెంబ్లీకి వెళ్ళారు. తర్వాత నుండి అసెంబ్లీకి హాజరైతే ఒట్టు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు మంత్రులు అసెంబ్లీకి రావాలని ఎన్నిసార్లు అడిగినా జగన్ మాత్రం పట్టించుకోవటంలేదు. అసెంబ్లీకి హాజరుకాకపోతే సాంకేతిక కారణాలతో వేటుపడుతుందని స్పీకర్ హెచ్చరించినా జగన్ ఏమాత్రం లెక్కచేయటంలేదు. మొత్తంమీద వీళ్ళ ముగ్గురి వైఖరి చాలా విచిత్రంగా ఉందన్నది వాస్తవం.