Telangana Rising Global Summit: అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు

ఫ్యూచర్‌సిటీలోని 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ భద్రత నడుమ జరగనున్న సదస్సు.

Update: 2025-12-06 08:50 GMT

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇప్పటికే ఈ సమ్మిట్‌కు రావాలని ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, కేంద్ర ప్రతిపక్ష నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించారు. ఈ సదస్సుు డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తోంది ప్రభుత్వం. ప్రాంతంలో భారీ స్థాయిలో విద్యుత్‌, స్టేజ్‌లు, సమావేశ హాళ్లు, భద్రత, ల్యాండ్‌స్కేపింగ్ పనులు మూడు షిఫ్ట్‌లుగా కొనసాగుతున్నాయి.

ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశానిర్దేశం చేసే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర ముఖ్య రంగాలకు సంబంధించిన దీర్ఘకాల ప్రణాళికలు ఉండనున్నాయి.

సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, టెక్నాలజీ సంస్థలు పాల్గొననున్నారు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, అవకాశాలు, ప్రాజెక్టులు ఈ వేదికలో ప్రదర్శించబడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌పై మరింత ప్రాధాన్యత పొందే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం ఉదయంలోపు అన్న ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత ‘డ్రై రన్’ నిర్వహించడానికి నిర్వాహక కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ట్రైయల్ రన్‌గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అన్ని కార్యక్రమాల్లో తప్పొప్పులను విశ్లేషించుకుంటారు. వాటిని వెంటనే సరిదిద్దుకుంటారని అధికారులు చెప్పారు.

 

10జీబీ ఇంటర్‌నెట్ సేవలు

ఈ సమ్మిట్‌లో ఇంటర్‌నెట్‌కు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ పైబర్ గ్రిడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ ప్రాంగణంలో అండర్‌గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను రెడీ చేసింది. దీని ద్వారా 5జీ డేడను 10GBPS స్పీడ్‌తో అందించనుంది. ఒకకాలంలో 10వేల మంది ఇంటర్‌నెట్ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో ఎటువంటి సాంకేతి, భద్రత సమస్యలు తలెత్తకుండా, మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి టి-ఫైబర్ వేదికకు దగ్గరే నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్(NOC)ని ఏర్పాటు చేసింది. దీనిని రాత్రింబవళ్లు పర్యవేక్షన కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతినిధులు వెంటనే ఇంటర్నెట్‌ కనెక్ట్‌ చేసుకునేందుకు, కమ్యూనికేషన్‌ సాఫీగా సాగేందుకు, రియల్‌టైమ్‌ ఆపరేషన్లు కొనసాగడానికి వీలుగా ఒకే దశ క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత లాగిన్‌ సౌకర్యం కల్పించింది.

అంతా ఎల్‌ఈడీ స్క్రీన్‌లే

సదస్సు ప్రాంగణమంతా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్-శ్రీశౌలం ప్రధాన రహదారి నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు రోడ్డు మొత్తం ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో జరిగే అన్ని కార్యక్రమాలను, సదస్సుకు సంబంధించిన సమాచారన్ని వాటిప ప్రదర్శించనున్నారు. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 8 వేదికల్లో.. 3,000 టన్నుల సామర్థ్యంతో కూడిన ఏసీ యంత్రాలను అమర్చారు.

అంతరాయం లేని విద్యుత్

గ్లోబల్ సమ్మిట్ సమయంలో ఏమాత్రం విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మిట్ జరిగే ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్‌లను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి సదస్సు ముగిసే వరకు కూడా క్షణం కూడా విద్యుత్ సరఫరా ఆగకుండా చర్చలు తీసుకోనున్నారు. ఇందుకోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) 150 మంది సిబ్బందిని నియమించింది. మీర్‌ఖాన్‌పేటలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి సదస్సు జరిగే ప్రాంతానికి రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్‌ సర్క్యూట్‌తో భూగర్భంలో విద్యుత్‌ లైనును ఏర్పాటుచేశారు. ఒక 100 కేవీ, రెండు 160 కేవీ, రెండు 315 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రాంగణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

 

భారీ భద్రత

గ్లోబల్ సమిట్‌కు దేశ విదేశాల నుంచి కీలక అతిథులు, ప్రముఖులు హాజరుకానుండటంతో తెలంగాణ పోలీసు శాఖ అతి క‍ట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో సమిట్ వేదికగా ఉన్న వంద ఎకరాల ప్రాంగణం మొత్తం భద్రతా పరంగా నిఘాలోకి తీసుకువెళ్లబడింది.

ప్రాంగణం అంతటా దాదాపు 1,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ఏవైనా అనుమానాస్పద అంశాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లు అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నుండి మొత్తం 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. సమిట్ ప్రాంత చుట్టుపక్కల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మరో 1,000 మంది ట్రాఫిక్ పోలీసులకు బాధ్యతలు ఇచ్చారు.

సమిట్ సమయంలో రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్‌ను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్య అతిథుల రాకపోకలు ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు విస్తృత ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

భద్రతా చర్యలను ఇంకా సమీక్షిస్తూ అవసరమైతే అదనపు బలగాలను కూడా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News