హైదరాబాద్ లో నాకాబందీ
5000 మంది పోలీసులతో 150 కీలక ప్రాంతాల్లో తనిఖీలు
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా శుక్రవారం అర్దరాత్రి 'ఆపరేషన్ కవచ్' పేరుతో నగరవ్యాప్తంగా నాకాబందీ నిర్వహించామని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ , ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి.
ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద పరిస్థితిని సజ్జనార్ సమీక్షించారు. డిసెంబర్ 6 వతేదీన బాబ్రీ మసీదు కూల్చివేత రోజు కావడంతో పోలీసులు నిర్వహించిన నాకాబందీ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్తగా నాకాబందీ నిర్వహించారు. చట్టాన్ని అతి క్రమించే రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఓల్డ్ సిటీలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు. రౌడీషీటర్లు నేర ప్రవృత్తి విరమించుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.