హైదరాబాద్ లో బ్రిటిష్ వాళ్ళు ఎలా కాలు మోపారు?
బ్రిటిష్ రెసిడెన్సీ భవనం ప్రత్యేకత ఇదీ..
కోఠి ఉమెన్స్ కాలేజీలోకి ప్రవేశించామంటే ఓ అద్భుతమైన కట్టడం దర్శనమిస్తోంది. అదే 'బ్రిటీష్ రెసిడెన్సీ'. అయితే ఈ భవనం చూడటానికి వాషింగ్టన్‌లోని 'వైట్ హౌస్' లా ఉంటుంది. టాలీవుడ్‌కు సంబంధించిన ఎన్నో సినిమాలను ఈ భవనం వెలుపల, లోపల చిత్రీకరించారు.
కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు మహిళా యూనివర్శిటీ ఉంది. ఈ భవనాన్ని 1803లో జేమ్స్ అకిలెస్ డైరెక్షన్‌లో నిర్మించారు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శ్యామూల్ రస్సెల్ డిజైన్ చేశారు. ఇండియన్ క్రాఫ్ట్ వర్కర్స్ ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అప్పట్లోనే 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిర్మాణ ఖర్చునంతా నిజాం రాజే భరించాడు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి రాజా కంద స్వామి ముదిలియార్ సివిల్ పనులు పర్యవేక్షించారు.
"రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి," అని 'చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ' హిస్టరీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అరుణ పారితి ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
Dr Aruna Pariti, History Dept Head, Chakali Ilamma Women’s University
"రాజప్రాసాదంలో అడుగు పెట్టగానే కనిపించే దర్బార్ హాల్లో అత్యంత ప్రతిభావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బార్ హాల్‌లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్‌లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు మనసును దోచుకుంటాయి," అని డాక్టర్ అరుణ తెలిపారు.
"నిర్మాణంలో స్థానికంగా లభించిన ఇటుక, సున్నం, చెక్క కట్టడాల కొరకు టేకును వాడారు. అబ్దర్ ఖానా (నీళ్లను అందించే వాళ్ల గది), హుక్కా బుర్దార్ ఖానా (హుక్కా పొగ గొట్టాలను అందించే వాళ్ల గది), ఫీల్ ఖానా (గజశాల)లను ప్లాన్‌లో చేర్చి చక్కగా నిర్మించారు," అని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ డి.సత్యనారాయణ తెలిపారు.
Dr. Dyavanapalli Satyanarayana, Historian
"అప్పట్లో 'ఎంప్రెస్ గేట్' అని పిలిచే విశాలమైన ద్వారం గుండా లోనికి వెళ్లేవారు. అక్కడి విశాలమైన వాకిలికి రెండు వైపులా గజశాల, అశ్వశాలలున్నాయి. రెసిడెన్సీ యొక్క దక్షిణముఖ మధ్య భాగం విల్లు ఆకారంగా ఉంది. రెండు అంతస్తులగుండా సాగే అయానిక్ పిల్లర్లను కలిగి ఉంది. వాస్తవానికి విశాలమైన మెట్లమీదుగా చేరే ప్రవేశ ద్వారం రెండు వైపులా సింహాల్ని చక్కారు. బ్రహ్మాండమైన మిరుమిట్లు గొలుపుతున్న తెల్లటి కొరింథియన్ స్థంభాలపైన గల తోరణం యోధ చిహ్నాలు, ఆ తరువాత రాజ చిహ్నాన్ని కనిపిస్తాయి. హైదరాబాద్‌లో బ్రిటీష్ వారి అధికార చిహ్నంగా ఈ రెసిడెన్సీ నిలిచింది," అని డాక్టర్ అరుణ తెలిపారు.
"ఈ భవనంలో రెండు వైపులా రెక్కల్లాంటి కట్టడాలతో కూడిన ప్రధాన సముదాయం ఉంది. పియానో నొబైల్ (ప్రధాన అంతస్తు)లో దర్బార్ హాల్, భోజనాల గది, రెండు అండాకార అతిథుల గదులు ఉన్నాయి. రెండవ అంతస్తులో దర్బార్ హాల్ గ్యాలరీ, రెసిడెంట్ వ్యక్తిగత గది, అలాగే ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి. స్తంభాలపై నాజూకైన చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. నేలపై తెలుపు, నలుపు రంగుల పాలరాయిని పరిచారు. రేయింబవళ్లు మిరుమిట్లు గొలిపే 100 అతి పెద్ద చీనీ దీపాలు, అనేక వేల చిన్న దీపాలను కిర్క్ పాట్రిక్ ఆదేశానుసారం ఏర్పాటు చేశారు. ఒక్కో వేడుక కోసం రెసిడెన్సీ అంతటినీ వెలిగించడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 1000 పౌండ్లు ఉంటుందంటారు," ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ డి.సత్యనారాయణ.
దర్బార్ హాల్ రెండంతస్తుల ఎత్తులో 60 అడుగుల పొడవు, 34 అడుగుల వెడల్పు ఉంది. నియోక్లాసికల్ గిల్ట్ గల ఈ అద్దాలు దర్బార్ హాల్ అందాలను మరింత పెంచాయి. మెరిసే స్పటికపు లస్టర్లు మరింత శోభను కలిగిస్తున్నాయి. అరబ్ చిత్ర ఆకృతులను చిత్రీకరించిన కాగితపు కప్పుతో దర్బార్ హాల్‌ను అలంకరించిన తీరు వర్ణనాతీతం. కలప, క్రిమ్సన్ వెల్వెట్లతో ఆ గదిని సుందరంగా తీర్చిదిద్దారు," అని డాక్టర్ అరుణ తెలిపారు.
హైదరాబాద్‌లో "బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. క్లాసికల్ పోర్టికోతో ఉన్న ఈ భవనం జార్జియన్ పల్లాడియన్ విల్లా శైలిలో, యునైటెడ్ స్టేట్స్ లోని వైట్ హౌజ్ ను పోలి ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉస్మానియా మహిళా కళాశాలగా మార్చారు. 2002, 2004 సంవత్సరాల్లో వరల్డ్ మ్యానుమెంట్స్ వాచ్ జాబితాలో చేర్చారు," అని హెరిటేజ్ కన్సర్వేషన్ యాక్టివిస్ట్ మహ్మద్ గైసుద్దీన్ అక్బర్ తెలిపారు.