Kaleshwaram | కాళేశ్వరంతో పెరిగిన కేసీఆర్ ఇమేజి కాళేశ్వరంతోనే పడిపోయిందా ?

2023 ఎన్నికలకు రెండునెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగిపోవటంతో కాళేశ్వరం, మేడిగడ్డ లోపాలు బయటపడ్డాయి.;

Update: 2025-08-06 08:16 GMT
BRS chief KCR

పెద్దలు చెప్పే సామెత ‘‘ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడతార’’నే సామెత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సరిగ్గా సరిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని జాతీయస్ధాయిలో ఎదిగిపోవాలని ప్లాన్ చేశారో అదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్(KCR) ఇమేజి పాతాళంలోకి పడిపోయింది. గడచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) మొత్తం కేసీఆర్-కాళేశ్వరం చుట్టూనే తిరుగుతున్నాయి. 2023 ఎన్నికలకు రెండునెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగిపోవటంతో కాళేశ్వరం, మేడిగడ్డ లోపాలు బయటపడ్డాయి. అప్పటినుండి కాంగ్రెస్(Congress), బీజేపీ(Telangana BJP) నేతలనుండి వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ క్యాంపు ఎదురుదాడులు చేస్తోంది. అయితే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ఇచ్చిన రిపోర్టులో కేసీఆర్, హరీష్(Harish) పాత్ర స్పష్టంగా బయటపడింది. ఇంతకాలం వినిపిస్తున్న ఆరోపణలకు కమిషన్ రిపోర్టు రూపంలో ఆధారాలు దొరికినట్లయ్యాయి. దాంతో కేసీఆర్ ఇమేజి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది.

సమస్యంతా కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పార్టీని ఆర్ధికంగా ఆదుకుంటే కేసీఆర్ ఇమేజిని గట్టిదెబ్బకొట్టేసింది. 2016లో మొదలైన ప్రాజెక్టు 2019లో పూర్తయ్యింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు రెండునెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణలోపాలు బయటపడటం సంచలనమైంది. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు నీటినిల్వకు పనికిరాకుండా పోయాయి. దాంతో సుమారు రు. 90 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండాపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా జరగిందన్నది వాస్తవం. భారీ ప్రాజెక్టు ముసుగులో వేలకోట్లరూపాయల ప్రజాధనం దోపిడి అయ్యిందని ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్న కారణమిదే.

కాళేశ్వరంప్రాజెక్టుతో పెరిగిన కేసీఆర్ ఇమేజి అదే కాళేశ్వరం దెబ్బకు ఇమేజి మొత్తం డ్యామేజి అయిపోయిందని అర్ధమవుతోంది. ఎలాగంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరిస్తున్న అపరభగరీధుడిగా ప్రచారం చేయించుకున్నారు. చాలామంది నిజమే కాబోలని అనుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోగానే చైనాలో కట్టిన త్రీగోర్జెస్ ప్రాజెక్టు లాంటిదే కాళేశ్వరం అని మళ్ళీ ప్రచారం చేయించుకున్నారు. ప్రాజెక్టులకు స్ధలాల ఎంపిక, నిర్మాణం, వ్యయం అంచనాలు, సవరించిన అంచనాలు, నిర్మాణ సంస్ధల ఎంపిక, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఇలా..సమస్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. నిర్మాణాలు జరుగుతున్నపుడు ప్రతిపక్షాలను, ఇంజనీరింగ్, ఇరిగేషన్ నిపుణుల్లో ఎవరినీ ప్రాజెక్టుల దగ్గరకు కూడా పోనీయలేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఏమి జరుగుతోందో బయటవాళ్ళకు ఏమీ తెలియనీయలేదు.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కురిసిన భారీవర్షాలకు లక్ష్మీపంప్ హౌస్ (కన్నెపల్లి), గాయత్రి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ లు దారుణంగా దెబ్బతినేశాయి. మొదటిసారి ప్రాజెక్టులోని నిర్మాణలోపాలు ఈరూపంలో ప్రపంచానికి తెలిసింది. అలాగే 2023 ఎన్నికలకు రెండునెలల ముందు మేడిగడ్డ ప్రాజెక్టులోని పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నుండి నీరు లీకేజీ మొదలైంది. ప్రాజెక్టుల్లోని నిర్మాణలోపాలు ఒక్కసారిగా బయటపడటంతో రాజకీయంగా సంచలనమైంది. ఎన్నికల సమయం కావటంతో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. దాంతో సమాధానాలు చెప్పుకోలేని పరిస్ధితుల్లో బీఆర్ఎస్ నేతలు చేతులెత్తేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం, రేవంత్ సీఎం అవటం అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ఏమి జరిగిందన్న విషయంపై రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లోతుగా సమీక్షించారు. అప్పుడు ప్రాజెక్టు నిర్మాణాల్లోని లోపాలు, అంచనాలు, సవరించిన అంచనాలు, నిర్మాణసంస్ధల నిర్లక్ష్యం తదితరాలన్నీ వెలుగుచూశాయి. దాంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు ఉన్నతాధికారులతో రేవంత్ విచారణ జరిపించారు. ఆ విచారణలో నిర్మాణలోపాలు, అవినీతి, అవకతవకలన్నీ బయటపడ్డాయి. దాని ఫలితంగానే ప్రాజెక్టు నిర్మించిన వెంటనే లోపాలు బయటపడినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, నిర్మాణసంస్ధలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నడిపించుకున్నాయన్న విషయం వెలుగుచూసింది. అన్నింటినీ గమనించిన ప్రభుత్వం మరింతలోతుగా వ్యవహారాన్ని తవ్వి తీసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది.

ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిన వేలాది కోట్లరూపాయలు బూడిదలోపోసిన పన్నీరుచందంగా మారిపోయిందనే ఆరోపణలు పెరిగిపోయాయి. అసలు ఇన్ని వేలకోట్లరూపాయలు ఖర్చుచేసి ఇంత నాసిరకమైన నిర్మాణాలు ఎందుకు చేయాల్సొచ్చింది ? అనే అనుమానాలు పెరిగిపోయాయి. జరిగింది గమనించిన తర్వాత అందరిలోను కొన్ని అనుమానాలు బయలుదేరాయి. అవేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇమేజి పెరిగిన వెంటనే కేసీఆర్ జాతీయస్ధాయి నాయకుడిగా మారిపోయినట్లు ఊహించుకున్నారు. అర్జంటుగా ప్రధానమంత్రి అయిపోదామని కలలుకన్నారు. అందుకనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయనేత అయిపోయి ఢిల్లీలో మకాం వేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో బీఆర్ఎస్ పేరుతో ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు, క్యాంపు ఆఫీసు నిర్మాణానికి పూనుకున్నారు. జాతీయస్ధాయిలోని కొన్ని పార్టీలతో పొత్తులకు సిద్ధపడ్డారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి ఆపీసులు ఓపెన్ చేశారు.

తనతో పొత్తులుపెట్టుకుని పోటీచేసే పార్టీల అభ్యర్ధుల ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తాననే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆప్రచారాన్ని కేసీఆర్ ఖండించలేదుకాబట్టి నిజమనే అనుకోవాలి. జాతీయపార్టీ పెట్టడానికి, వివిధ రాష్ట్రాల్లో ఆఫీసులు ఏర్పాటుకు, పొత్తుపార్టీల అభ్యర్ధుల ఎన్నికల ఖర్చులు భరించేంత ఆర్ధికస్తోమత కేసీఆర్ కు ఒక్కసారిగా ఎక్కడినుండి వచ్చింది ? అన్నది చాలామందికి అర్ధంకాలేదు. అయితే ఇందులోని రహస్యం ఏమిటో ఇపుడు ఆధారాలతో సహా బయటపడింది. అప్పటి కేసీఆర్ ప్రయత్నాలకు, ఆఫర్లకు కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానంగా నిలిచింది. ప్రాజెక్టు నిర్మాణం ముసుగులో వేలకోట్ల రూపాయల దోపిడి జరిగిందన్న రేవంత్, మంత్రుల ఆరోపణలు నిజమే అని జనాలకు అర్ధమైపోయింది. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో జరిగిన అవినీతి, అవకతవకలు రేవంత్ ప్రభుత్వంలో బయటపడ్డాయి. దాంతో ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడి బయటపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కేసీఆర్ వన్ మ్యాన్ షోగానే నడిచింది.

ప్రాజెక్టుల నిర్మాణాల స్ధలంఎంపిక, మార్పు, అంచనాలు, సవరించిన అంచనాలు, కాంట్రాక్టు సంస్ధల ఎంపిక, సబ్ కాంట్రాక్టులు ఇలా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే, కేసీఆర్ మనుషుల మధ్యనే జరిగింది. కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో జరిగిన లోపాలేవీ బయటకు రాలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితోనే ప్రాజెక్టుల్లో జరిగిన దోపిడి, ప్రాజెక్టుల నిర్మాణాల లోపాలన్నీ ఒక్కోటిగా బయటపడ్డాయి. వీటిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారుల నివేదికతో ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై ఒక పిక్చర్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ద్వారా చాలా విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టుల ముసుగులో దోపిడి ద్వారా సంపాదించిన డబ్బు వేలకోట్లరూపాయల కేసీఆర్ దగ్గర పోగుపడ్డాయనే అనుమానాలకు కమిషన్ రిపోర్టు సమాధానమిచ్చింది.

రిపోర్టులోని అంశాలు సాంతం బయటకు వచ్చేయటంతో మొత్తం దోపిడి అంతా బట్టబయలైంది. దాంతో కేసీఆర్ ఇమేజి మొత్తం పాతాళానికి పడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఇమేజీని జాతీయస్ధాయికి పెంచుకున్న కేసీఆర్ అదే కాళేశ్వరం దెబ్బకు ఇమేజిని కోల్పోవాల్సిరావటం విచిత్రమనే చెప్పాలి. కమిషన్ రిపోర్టులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఎవరెవరి పాత్ర ఎంతో స్పష్టంగా బయటపెట్టింది. జరిగిన డ్యామేజీని అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు తదితరులు ప్రభుత్వం మీదకు ఎదురుదాడులు మొదలుపెట్టారు. కమిషన్ రిపోర్టును బీఆర్ఎస్ కీలకనేతలు తప్పుపడతారని, ఎదురుదాడులు చేస్తారని ముందుగా అందరూ ఊహించిందే. అయితే కారుపార్టీ నేతలు ఎన్ని ఎదురుదాడులు చేసినా పెద్దగా ఫలితం ఉంటుందని అనుకునేందుకు లేదు. కమిషన్ పై చర్చించేందుకు తొందరలోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతోంది. అప్పుడు ఎవరి వాదన ఏమిటో తేలిపోతుంది. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News