నటి రష్మికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే
పుష్ప సినిమా ఫేమ్ నటి రష్మికపై కర్ణాటకలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టిన గడ్డకే అన్యాయం చేస్తావా అంటూ కర్నాటక పాలకపార్టీ కాంగ్రెస్ మండిపడుతోంది.;
By : The Federal
Update: 2025-03-03 12:48 GMT
పుష్ప సినిమా ఫేమ్ నటి రష్మిక మందన్నా (Rashmika)పై కర్ణాటకలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టిన గడ్డకే అన్యాయం చేస్తావా అంటూ కర్నాటక పాలకపార్టీ కాంగ్రెస్ మండిపడుతోంది. తాజాగా మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఆమె తీరును గట్టిగానే విమర్శించారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఆమెకు గుణపాఠం ఎట్లా చెప్పాలో తమకు బాగానే తెలుసునని హెచ్చరించారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని మందలించారు.
‘‘కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. తన ఇల్లు హైదరాబాద్‌లో ఉందని అంటూ కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరి కొంతమంది కూడా సుమారు పదిసార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాలేదు. రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి ప్రశ్నిస్తున్నారు. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.
బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి. రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కానిపక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలి’’ అని వ్యాఖ్యలు చేశారు.
మొత్తం మీద శాండిల్ వుడ్ లో బయల్దేరిన ఈ సరికొత్త వివాదం ఏవైపు మలుపు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే పుష్ప సినీ హీరో అల్లు అర్జున్ ఓ వివాదంలో చిక్కుకుని ఓ రోజంతా జైల్లో గడిపివచ్చారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ కర్నాటక రాజకీయ నాయకుల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.