ట్యాపింగ్ ని పోలీసుల మీదకే తోసేసిన కేసీఆర్
టెలిఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుంటే శిక్ష అనుభవిస్తారని తేలిగ్గా చెప్పేశారు.
టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కేసీయార్ కొట్టిపారేశారు. కేసీయార్ హయాంలో ముఖ్యంగా 2018 నుండి రాజకీయ ప్రత్యర్ధుల టెలిఫోన్లను ట్యాప్ చేసి బాగా ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు తెలంగాణాను కుదిపేస్తున్నాయి. ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారుల్లో కొందరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు. విచారణలో పోలీసు అధికారులు చెబుతున్నట్లుగా వినబడుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. పలువురు పోలీసు అధికారులు రిమాండులో ఉన్నారు. ఎస్ఐ స్ధాయి నుండి అడిషినల్ ఎస్పీ స్ధాయి అధికారివరకు సుమారు 12మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టుచేసి రిమాండులో ఉంచి విచారిస్తున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతిరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు విచారణలో చెప్పిన అనేక విషయాలు అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష జోక్యాన్ని చెబుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు అరెస్టు భయంతో అమెరికాకు పారిపోయారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆయన తిరిగి హైదరాబాద్ కు వస్తే చాలా విషయాల్లో క్లారిటి వస్తుందని పోలీసు అధికారులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఇదే విషయమై ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేసీయార్ మాట్లాడుతు తనకు టెలిఫోన్ ట్యాపింగ్ కు ఏమాత్రం సంబంధంలేదన్నారు. ట్యాపింగ్ అన్నది పోలీసు అధికారులు చూసుకునే వ్యవహారమన్నారు. రోజూ పోలీసులు అనేక విషయాలపై ఎంతోమంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంటారని చెప్పారు. పోలీసులు రోజువారి చేసే పనులన్నీ ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారా అని ఎదురు ప్రశ్నించారు. సీఎం దృష్టికి రాకుండానే హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతితో పోలీసులు చాలామంది ఫోన్లను ట్యాప్ చేస్తారని చెప్పారు. సమాచార సేకరణలో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఒక భాగమన్నారు. కాబట్టి పోలీసులు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుంటే శిక్ష అనుభవిస్తారని చాలా తేలిగ్గా చెప్పేశారు. కేసీయార్ చెప్పింది ఎలాగుందంటే పోలీసు శాఖకు ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్లుగా ఉంది.
రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్ల ట్యాపింగ్ చేయించారా ? అన్న ప్రశ్నకు బదులిస్తు అసలు ట్యాపింగ్ జరిగిన విషయమే తనకు తెలీదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్యాపింగ్ ఆరోపణలపై పోలీసు అధికారులు చెప్పిన వివరాలను ఛానల్ యాంకర్ కేసీయార్ ను ఒక్క ప్రశ్నకూడా వేయలేదు. బీజేపీ నేత రఘునందనరావు తదితరుల ఫోన్లను తాము ఎలా ట్యాప్ చేసింది, వాళ్ళని ఎలా ఇబ్బందులుపెట్టామన్న విషయాన్ని రాధాకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పారు. ఈయనతో పాటు అరెస్టయిన డీఎస్పీ, అడిషినల్ ఎస్పీలు బీఆర్ఎస్ ప్రత్యర్ధులను తాము ట్యాపింగ్ ద్వారా ఎంత ఇబ్బంది పెట్టామన్న విషయాన్ని అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ట్యాపింగ్ ఆరోపణలపై అరెస్టయిన వారిలో అత్యధికులు కేసీయార్ సామాజికవర్గం వాళ్ళే. అప్పట్లో టాస్క్ ఫోర్స్ లోకి తీసుకోవటం కూడా సామాజికవర్గాలను చూసిన తర్వాతే తీసుకున్నట్లు అరెస్టయిన వాళ్ళు చెప్పారు. అయితే కేసీయార్ మాత్రం తనకేమీ సంబంధంలేదని మొత్తం పోలీసు అధికారుల మీదే తోసేయటం ఆశ్చర్యంగా ఉంది.