‘పార్టీకన్నా తనకు ప్రజలే ముఖ్యం’
భూమితో రైతులకు భావోద్వేగ సంబంధం ఉంటుందన్నారు
మరోసారి మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. శుక్రవారం ఎంఎల్ఏని రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూనిర్వాసితులు కలిశారు. ఈసందర్భంగా భూములు కోల్పోయే రైతులతో ఎంఎల్ఏ మాట్లాడుతు రోడ్డు వెళ్ళే దక్షిణభాగంలోని నియోజకవర్గాల ఎంఎల్ఏలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. భూమితో రైతులకు భావోద్వేగ సంబంధం ఉంటుందన్నారు. ఆబంధాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కోమటిరెడ్డి(Komatireddy) చెప్పారు. పార్టీ, ప్రభుత్వంకన్నా తనకు ప్రజలే ముఖ్యమన్నారు. తానుపనిచేసేది ప్రజాసంక్షేమం కోసమే అని స్పష్టంచేశారు.
త్రిబుల్ ఆర్ రోడ్డు ప్రాజెక్టువల్ల చాలామంది రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తనకు తెలుసన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇతర నియోజకవర్గాల ఎంఎల్ఏలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. చాలామంది ఎంఎల్ఏలు ఈప్రాజెక్టు విషయంలో ఆందోళనగా ఉన్నట్లు తనకు తెలుసన్నారు. తాను అధికారపార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రజాపక్షానే నిలబడతానని స్పష్టంచేశారు.
మునుగోడు నియోజకవర్గంలో సగభాగం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పరిధిలోకి వెళుతుందని ఎంఎల్ఏ గుర్తుచేశారు. రహదారి అలైన్ మెంట్ మార్పు విషయంలో రైతులకు సరైన వివరణిచ్చి, ఆమోదం తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నట్లు మండిపడ్డారు. అయితే ప్రజలకోసం నిజాయితీగా పనిచేస్తున్న తమకృషిని రైతులు గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ పరిధిలోకి వచ్చే ఎంఎల్ఏలు అందరం తొందరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలపై చర్చించబోతున్నట్లు తనను కలసిన రైతులకు కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.