కేటీఆర్‌ని కాపాడుంది రేవంత్ రెడ్డే: బండి సంజయ్
సీబీఐ విచారణకు సిద్ధపడితే హెచ్ సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో, వారికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలన్నీ బయటకు వస్తాయని బండి సంజయ్ అన్నారు.;
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వారిద్దరూ జాన్ జబ్బల్లాంటి దోస్తులన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో కూడా ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి అని, చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారని విమర్శించారు. హైదరాబాద్ లో త్వరలో జరగబోయే మీటింగ్ ను ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారని, ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారని అన్నారు. ‘‘హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమయ్యారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ది మారలేదు. ఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నరు. హెచ్ సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా? రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ సర్కార్ కాదు. భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్దమైతే హెచ్ సీయూ భూ కుట్రదారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తాం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయి. 6 గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో, బయట నిలదీయకుండా రేవంత్ ఉత్తుత్తి డ్రామాలాడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) భూములను తెగనమ్మడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే... పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్య మైత్రి ఎన్నడో బట్టబయలైంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. త్వరలో హైదరాబాద్ లో జరగబోయే బహిరంగ సభ నిర్వహణ, ఆ సభకు ఎవరెవరిని పిలవాలో ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసేలా నిర్ణయం తీసుకుంది కూడా వారిద్దరే. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ ను గెలిపించేందుకు సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి, కేటీఆర్ లే. అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంచింది కేటీఆరే’’ అని అన్నారు. ‘‘అవినీతిపరులు, భూదోపిడీదారులపై ఉక్కుపాదం మోపే మోదీ పాలన కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్ధపడితే హెచ్ సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో, వారికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ దమ్ముందా? అట్లాగే హెచ్ సీయూ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా? తేల్చుకోవాలని’’ అని పేర్కొన్నారు.