ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు అందించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించారని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి సాక్షాధారాలు లేవని, అవన్నీ అవాస్తవాలు, కల్పితాలేనని కేటీఆర్ వివరించారు. కానీ రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో వివరించారు. తాను మంత్రిగా అనేక రంగాల్లో సేవలు చేశానని, అలాంటి నేతపై ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు ఆరోపనలు చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న బండి సంజయ్ మరో శాసనసభ్యుడిపై అసత్యాలు, అడ్డగోలు ఆరోపణలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో తెలిపారు. ఈ విషయంలో బండి సంజయ్ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారు.
‘‘నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా నా కుటుంబ సభ్యులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకూడదు. నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా ఈ డిమాండ్లను పాటించాలి. లేని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆయన ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ముందు విచారణకు ఇటీవల బండి సంజయ్ హాజరయ్యారు. గంటల తరబడి జరిగిన విచారణ అనంతరం బండి మాట్లాడుతూ.. కేటీఆర్, కేసీఆర్‌పై ఘాటు ఆరోపణలు చేశారు. వేల ఫోన్లను వాళ్లు ట్యాప్ చేశారన్నారు. కవిత, ఆమె భర్త అనిల్, మాజీ మంత్రి హరీష్ రావుల ఫోన్లను కూడా వారు ట్యాప్ చేశారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌ను, ప్రస్తుతం సీఎం రేవంత్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి, వాటి ఆధారంగా బిజినెస్‌మెన్‌లను బ్లాక్ మెయిల్ చేశారని కూడా ఆరోపించారు బండి సంజయ్. భార్యభర్తలు మాట్లాడుకునే మాటలను కూడా రికార్డ్ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిపై స్పందించిన కేటీఆర్.. చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకుండా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌ని హెచ్చరించారు. లేని పక్షంలో లీగల్‌గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుందని తెలిపారు.
దానిపై స్పందించిన బండి సంజయ్.. మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాను నోటీసులు ఇవ్వడం ప్రారంభిస్తే కేటీఆర్.. జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. కాగా ఇప్పటి వరకు తనకు క్షమాపణ చెప్పడం కానీ, ఆరోపణలకు సాక్షాలు చూపడం కానీ బండి సంజయ్ చేయలేదు. దీంతో ఆయనకు మంగళవారం కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.