ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
కేంద్రప్రభుత్వం తెలంగాణలోని 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేసింది.;
By : The Federal
Update: 2025-07-30 04:19 GMT
తెలంగాణ రాష్ట్రంలోని పీఎం శ్రీ పథకం కింద ఈ విద్యా సంవత్సరంలో 33 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.
ఆదర్శ పాఠశాలల ఎంపిక
కేంద్రప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం కింద తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేసి అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ములుగు జిల్లాలో 11, వరంగల్ లో 16, హనుమకొండలో 19, మహబూబాబాద్ లో 23, భూపాలపల్లిలో 8 పాఠశాలలను ఎంపిక చేసి మొదటి విడత నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం, ఆటలు, యోగా, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ లకు నిధులు కేటాయించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో తరగతి గదులు, కంప్యూటర్ల మరమ్మతులు, మరుగుదొడ్ల శుభ్రతకు లిక్విడ్ లు, ఇంటర్ నెట్ చార్జీలు, స్టేషనరీ, జాతీయ పండుగల నిర్వహణకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు మంజూరు చేశారు.
రూ.కోటిన్నరతో అభివృద్ధి పనులు
పీఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో అయిదేళ్లలో కోటిన్నర రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థుల్లోని క్రీడాప్రతిభను వెలికి తీయనున్నారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, సౌర విద్యుత్ , స్మార్ట్ తరగతి గదులన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి
‘‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’’అని మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఇచ్చిన పిలుపు మేర కష్టపడి చదువుకోండి అని ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ విద్యార్థులకు సూచించారు. ములుగు జిల్లాలోని బండారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ దివాకర్ విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ వారిలో స్ఫూర్తి నింపారు. ‘‘విద్య దేశ గమ్యాన్ని నిర్దేశిస్తుందని, ఐఎఎస్, ఐపీఎస్ లక్ష్యంగా పెద్దగా కలలు కనండి,భవిష్యత్ మీదే’’ అంటూ కలెక్టర్ పిలుపునిచ్చారు.
పాఠశాలకు సంగీత వాయిద్యపరికరాలు
ములుగు జిల్లాలో మారుమూల ఉన్న బండారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేసిన కలెక్టర్ దివాకర్ పాఠశాలకు సంగీత వాయిద్యపరికరాలను విద్యార్థులకు అందజేశారు. ధృడ సంకల్పంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కోరారు. క్రమశిక్షణ, అంకితభావం, దృఢ సంకల్పతో చదివితే విద్యార్థులు ఎలాంటి ఆటంకాలను అయినా అధిగమించి విజయం సాధించవచ్చని కలెక్టర్ చెప్పారు.
దేశ భవిష్యత్ యువకులదే...
దేశ భవిష్యత్ యువకులమీదనే ఆధారపడి ఉండదని, పీఎం శ్రీ పథకం కింద వచ్చిన వనరులను ఉపయోగించుకొని సృజనాత్మకతతో విద్యాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దివాకర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే పీఎం శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ దివాకర్ పేర్కొన్నారు.