హైదరాబాద్ నిజాం నవాబు తొమ్మిదో వారసుడిగా(Ninth Nizam) నవాబ్ మీర్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జా బహదూర్(Azmet Jah) ప్రకటించుకున్నారు.తన తండ్రి ప్రిన్స్ ముకర్రం జాకు(Mukarram Jah) తాను వారసుడిని అంటూ ప్రిన్స్ అజ్మత్ జా శనివారం దినపత్రికల్లో పబ్లిక్ నోటీసు ద్వారా ప్రకటించుకున్నారు.హైదరాబాద్ నగరంలోని చౌమహల్లా ప్యాలెస్ సింహాసనంపై తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను పబ్లిక్ నోటీసులో ప్రచురించారు.రెండవ చిత్రంలో అజ్మత్ జా గద్దెపై కూర్చొని ఫొటో దిగారు.ప్రిన్స్ ముకర్రం జా ను తెలంగాణ ప్రభుత్వ గౌరవంతో ఖననం చేశారు. పోలీసుల గార్డ్ ఆఫ్ హానరుతో మక్కా మసీదు కాంప్లెక్సులోని రాయల్ శ్మశానవాటికలో ముకర్రం జా అంత్యక్రియలు చేశారు.
ఇప్పుడు పబ్లిక్ నోటీసు ఎందుకంటే...
నిజాం వంశానికి చెందిన వారసులపై వివాదం రేగిన నేపథ్యంలో హైదరాబాద్ నిజాం నవాబు తొమ్మిదో వారసుడిగా అజ్మత్ జా బహదూర్ అంటూ తాజాగా పబ్లిక్ నోటీసు(Public Notice) జారీ చేశారు. మొహర్రం సందర్భంగా బీబీకాఆలంకు దట్టీ సమర్పించేందుకు లండన్ నుంచి వచ్చిన 9వనిజాం నవాబు అయిన అజ్మత్ జా వచ్చారు. ఈ సందర్భంగా దట్టీ సమర్పించడంలో వివాదం రాజుకోకుండా ఉండేందుకు అజ్మత్ జా చౌహహల్లా ప్యాలెస్ లో 2023 జనవరి 20వతేదీన కుటుంబ ఆచారం ప్రకారం 9వ నిజాంగా బాధ్యతలు స్వీకరించారని పబ్లిక్ నోటీసులో న్యాయవాదులు తెలిపారు. అజ్మత్ జా తరపున కాచిగూడకు చెందిన న్యాయవాదులు సి తులసీ కృష్ణ, వాడేంద్ర జోషీలు ఈ పబ్లిక్ ప్రకటనను పత్రికలకు జారీ చేశారు. ఇతరులు ఎవరైనా తాము నిజాం వారసులమని తప్పుగా చెబుతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు.
బీబీ కా ఆలం కు దట్టీ సమర్పించిన నిజాం వారసులు
ఆజాఖానా జోహ్రవద్ద బీబీ కా ఆలంకు నిజాం కుటుంబీకులు ఆదివారం రాత్రి దట్టీ సమర్పించారు. 9వ నిజాం నవాబ్ మీర్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జా బహదూర్ ఆజా ఖానా జొహ్రా వద్ద బీబీ కా ఆలంకు దట్టీ సమర్పించి నజరానా సమర్పించారు. ఈ కార్యక్రమంలో నవాబ్ ముకరం జా బహదూర్ తనయుడు నవాబ్ ఆజం జాహ్ బహదూర్,చార్మినార్ ఎమ్మెల్యే అలీ ఖాన్ పాల్గొన్నారు.ఏటా పురానీ హవేలీలో పీలీ గేట్ గా పిలుచుకునే దర్వాజా వద్ద దట్టీ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.ముకర్రం జా చివరి రోజుల్లో దట్టీ సమర్పించలేదు. అయితే ముకర్రంజా కుమారుడైన 9వ నిజాం అజ్మత్ జా అధికారికంగా నిజాం కుటుంబం పక్షాన మొదటిసారి దట్టీ సమర్పించారు.
బీబీకా ఆలం అంబారీ...
బీబీ కా ఆలం తీసుకెళ్లే అంబారీ ఎక్కడా ఆగకుండా ఆజాఖానా జొహ్రా వద్దకు వెళ్లి నిలిచిపోయింది. దీంతో నవాబ్ అజ్మత్ జాహ్ బహదూర్, నవాబ్ ఆజం జా బహదూర్, నవాబ్ ఫైజ్ ఖాన్ ఆజా ఖానా జొహ్రా చేరుకుని బీబీ కా అలం కు దట్టితో పాటు నజరానా సమర్పించారు.చాలా దూరం వరకూ వారు బీబీ కా ఆలం జులూస్ వెంట ఉన్నారు. తొమ్మిదవ నిజాం ఆలం జులూస్ లో పాల్గొనడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
చారిత్రక కట్టడం ...పీలీగేట్ పీలీగేట్ గా పిలుచుకునే చారిత్రక కట్టడాన్ని రెండవ నిజాం నవాబు నిజాం అలీఖాన్ కాలంలో నిర్మించారని గవా ఉర్దూ పత్రిక ఎడిటర్ ఫాజిల్ హుసేన్ పర్వేజ్ మీడియాకు వివరించారు.రెండు వందల ఏళ్ల ఈ కట్టడానికి పునర్నిర్మాణ పనులు చేపడుతామని పర్వేజ్ చెప్పారు. 1930లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అజాఖానా జొహ్రా ఆషూర్ ఖానాను నిర్మించారని ఆయన పేర్కొన్నారు. నిజాం తల్లి జొహ్రా బేగం సంస్మరణార్ధం ఈ ఆషూర్ ఖానాను నిర్మించారని ఆయన వివరించారు. ఈ కట్టడం సుప్రసిద్ధ మతపరమైన ప్రదేశాల్లో ఒకటని పర్వేజ్ పేర్కొన్నారు.
తండ్రి టర్కీలో...కుమారుడు లండన్ లో నివాసం
ప్రిన్స్ ముకర్రం జా మరణించే ముందు వరకు టర్కీలోనే స్థిరనివాసం ఉన్నారు. కాగా ఆయన కుమారుడైన హైదరాబాద్ నిజాం నవాబు తొమ్మిదో వారసుడిగా నవాబ్ మీర్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జాహ్ బహదూర్ లండన్ లో నివాసముంటున్నారు. ఈ ఏడాది మొదటిసారి మొహర్రం ఊరేగింపులో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ప్రతీ ఏటా అజ్మత్ జా నాలుగు సార్లు హైదరాబాద్ లో పర్యటిస్తుంటారని పాతబస్తీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పర్వేజ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వారసుల్లో రాజుకున్న వివాదం
తండ్రి ముకర్రం జా మరణించిన రెండేళ్ల తర్వాత అజ్మత్ జా తనను తాను తొమ్మిదో నిజాంగా ప్రకటించుకోవడం వివాదాన్ని రేపింది.గతంలో టర్కీలో నివాసమున్న ప్రిన్స్ ముకర్రం జా 2023వ సంవత్సరం జనవరి 15వతేదీన మరణించారు. ఇలా అజ్మత్ జా పబ్లిక్ ప్రకటన జారీతో నిజాం వారసుల్లో చట్టపరమైన వివాదాలు రేగాయని సీనియర్ జర్నలిస్ట్ అయూబ్ అలీ ఖాన్ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. సికందర్ జా తల్లి ఆయేషా అజ్మత్ జా వాదనను సవాలు చేస్తూ లీగల్ నోటీసు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. నిజాం కు ఉన్న విలువైన ఆస్తుల కోసమే వారసత్వ వివాదం ఏర్పడిందని ఓ ఆంగ్ల పత్రిక సీనియర్ జర్నలిస్టు ఆసిఫ్ యార్ ఖాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నిజాంకు ప్యాలెస్‌లెన్నో...
ముకర్రం జా వారసత్వంగా చౌమహల్లా ప్యాలెస్, తాజ్ గ్రూపునకు లీజుకు ఇచ్చిన ఫలక్ నుమా ప్యాలెస్,చిరాన్ ప్యాలెస్, కింగ్ కోఠి ప్యాలెస్ ఇతర ఆస్తులున్నాయి.నిజాం ముకర్రంజాకు హైదరాబాద్ నగరంలోనే కాకుండా సౌదీ అరేబియా, టర్కీ,లండన్ దేశాల్లో విలువైన ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల కోసం న్యాయపోరాటం సాగుతున్న నేపథ్యంలో అసలు వారసుడిని తానేనని అజ్మత్ జా ప్రకటించుకున్నారు. మరో వైపు తాము కూడా నిజాం వారసులమంటూ కొందరు సికింద్రాబాద్ న్యాయ సంస్థ సహకారంతో కేసు వేశారని సమాచారం. నిజాం వంశానికి చెందిన రౌనాక్ యార్ ఖాన్ కూడా తాను వారసుడినని గతంలో గ్రీన్ పార్కు హోటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.