మావోయిస్ట్ పార్టీ ఆగ్రహానికి కారణమిదేనా ?
లొంగిపోతున్న వారంతా ఉద్యమద్రోహులని, ప్రజలు వీళ్ళను తొందరలోనే శిక్షిస్తారని పదేపదే వార్నింగులు ఇస్తోంది
లొంగిపోతున్న మావోయిస్టు కీలకనేతలు, దళసభ్యులపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. లొంగిపోతున్న వారంతా ఉద్యమద్రోహులని, ప్రజలు వీళ్ళను తొందరలోనే శిక్షిస్తారని పదేపదే వార్నింగులు ఇస్తోంది. మావోయిస్టులు దళంలో పనిచేసినా, లొంగిపోయినా మామూలు ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదని అందరికీ తెలిసిందే. ప్రజలని, ప్రజాకోర్టు పేరుతో మావోయిస్టుపార్టీనే కొంతమందిని శిక్షిస్తుంటుంది. పార్టీకి ద్రోహంచేస్తున్నారనే ముద్రవేసి ‘కోవర్టులు’ అనేపేరుతో పార్టీలోని కీలక నేతలు కొందరిని ప్రజాకోర్టు పేరుతో శిక్షిస్తుండటం అందరికీ తెలిసిందే.
ఇపుడు అలాంటిముద్రనే పార్టీనాయకత్వం లొంగిపోతున్న మావోయిస్టు కీలకనేతలు, దళసభ్యులపైన కూడా వేస్తోంది. దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేసి వ్యక్తిగత, కుటుంబజీవితాలను పణంగాపెట్టిన మావోయిస్టునేతల్లో కొందరు ఎన్ కౌంటర్లలో చనిపోగా మరికొందరు ఇపుడు లొంగిపోతున్నారు. సాయుధపోరాటం ద్వారానే సమాజంలో మార్పు తేవచ్చని నమ్మి పోరుబాట పట్టిన వారికి అదిసరైన మార్గంకాదని ఇపుడు అనిపించింది. లేదా ఎన్ కౌంటర్లో చనిపోవటం కన్నా లొంగిపోయి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల్లోచైతన్యం తీసుకురావాలని అనిపించుంటుంది.
అందుకనే మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లాంటి అగ్రనేతలు ఈమధ్యనే పోలీసులకు లొంగిపోయారు. వీరితో పాటు కొన్నివందలమంది దళసభ్యులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం 21మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళంతా తమ ఆయుధాలతోసహా లొంగిపోవటం గమనార్హం. ప్రభుత్వానికి అందచేసిన 18 ఆయుధాల్లో మూడు ఏకే47 రైఫిల్స్ ఉన్నాయి.
ఈపాయింటులోనే పార్టీనాయకత్వం లొంగిపోతున్న మావోయిస్టులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. లొంగిపోతున్న మావోయిస్టులను పార్టీ నాయకత్వం అడ్డుకోవటంలేదు. అయితే ఆయుధాలను పార్టీకి సరెండర్ చేసిన తర్వాతే లొంగిపోవాలని ఆదేశిస్తోంది. లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని పదేపదే హెచ్చరిస్తోంది. అయితే లొంగిపోదలచుకున్న మావోయిస్టులు పార్టీ ఆదేశాలను ఏమాత్రం ఖాతరుచేయటంలేదు. ఆయుధాలతోసహా లొంగిపోతున్నారు. ఈ విషయంలోనే పార్టీనాయకత్వం లొంగిపోతున్నవారిపై తీవ్రఆగ్రహంగా ఉంది. సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి సమీకరించుకున్న ఆయుధాలు లొంగుబాట్ల పేరుతో ప్రభుత్వం చేతికి చిక్కటాన్ని నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాదళాలు మావోయిస్టుల ఏరివేతను ఉదృతంచేస్తోంది. భద్రతాదళాలను ఎదుర్కోవాలంటే పార్టీకి ఆయుధాలు చాలా అవసరం.
అయితే లొంగుబాట్లతో వందలాది ఆయుధాలను మావోయిస్టులు ప్రభుత్వానికి అప్పగిస్తుండటంపై పార్టీనాయకత్వం మండిపోతోంది. మావోయిస్టులను భద్రతాదలాలు ఎన్ కౌంటర్లుచేయటం కోసం అన్నీవైపుల నుండి చుట్టుముడుతోంది. ఈపరిస్ధితుల్లో ఆయుధాలను సమకూర్చుకోవటం పార్టీనాయకత్వానికి పెద్ద సమస్యగామారింది. మావోయిస్టుల డెన్లమీద భద్రతాదళాలు దాడులు చేస్తున్నాయి. అలాగే ఎన్ కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల ఆయుధాలను భద్రతదళాలు స్వాధీనంచేసుకుంటున్నాయి. రెండురకాలుగా నష్టపోతున్న పార్టీకి ‘గోరుచుట్టుమీద రోకటిపోట’న్నట్లుగా వందలాది ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోతుండటాన్ని పార్టీనాయకత్వం తట్టుకోలేకపోతోంది. గడచిన 15రోజులుగా లొంగిపోయిన మావోయిస్టులు సుమారు 300 ఆయుధాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వీటిల్లో 50కి పైగా ఏకే 47లు, 100 ఇన్సాస్ రైఫిల్స్ ఉండటం గమనార్హం. అధునాతన ఆయుధాలతో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవటం అంటే పార్టీకి చాలాపెద్దదెబ్బనే చెప్పాలి. మళ్ళీ ఇలాంటి ఆయుధాలను సమకూర్చుకోవటానికి పార్టీనాయకత్వం చాలాకష్టపడాల్సుంటుంది. ఈ విషయంలోనే లొంగిపోతున్న మావోయిస్టులపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఆయుధాలతో లొంగిపోవటమే కరెక్టు
ఆయుధాలతోసహా లొంగిపోవటమే మావోయిస్టులకు కరెక్టని లొంగిపోయిన మావోయిస్టునేత జంపన్న తెలిపారు. మావోయిస్టుపార్టీ కేంద్రకమిటిసభ్యుడిగా పనిచేసిన జంపన్న 2017లో ప్రభుత్వానికి ఆయుధంతో సహా లొంగిపోయారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఆయుధాలతోసహా లొంగిపోవాలని ప్రభుత్వం షరతులు పెడుతున్న కారణంగా మావోయిస్టునేతలు ఆయుధాలతో సహా లొంగిపోతున్నార’’ని అభిప్రాయపడ్డారు. ‘‘సాయుధపోరాటవిరమణ అన్నపుడు తమదగ్గరున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించటమే సరైన చర్య’’గా చెప్పారు. అలాకాకుండా ‘‘తాము మాత్రమే లొంగిపోతామని, ఆయుధాలను పార్టీకి సరెండర్ చేస్తామని అంటే ప్రభుత్వం అంగీకరించద’’న్నారు. ‘‘ఆయుధాలను వేరొకరికి అప్పగించి తాము మాత్రమే లొంగిపోతే దాన్ని సాయుధపోరాటవిరమణ అనేందుకు లేద’’ని అన్నారు. ‘‘ఆయుధాలతోసహా మావోయిస్టులులొంగిపోవటమే పార్టీనాయకత్వానికి రుచిస్తున్నట్లు లేదని అందుకనే తీవ్రపరిణామాలుంటాయని వార్నింగులు ఇస్తున్న’’ట్లు జంపన్న అనుమానించారు.