పార్లమెంటు ఎన్నికలు కేసీయార్ కు పెద్ద పరీక్షా ?

పొలిటికల్ సర్కిళ్ళు, మేథావుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండోప్లేసులో ఏ పార్టీ ఉంటుంది ?

Update: 2024-04-04 13:54 GMT
BRS and BJP (Source : Twitter)

పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది పొలిటికల్ సర్కిళ్ళు, మేథావుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండోప్లేసులో ఏ పార్టీ ఉంటుంది ? అని. ఇక్కడ రెండోప్లేసు అని అంటున్నది ఎందుకంటే మొదటిప్లేసు ఆల్రెడి కాంగ్రెస్ పార్టీకి రిజర్వయిపోయింది కాబట్టి. ఎలా రిజర్వయ్యిందంటే జాతీయ మీడియా, సర్వే సంస్ధలు కాంగ్రెస్ కు 10 సీట్లకు తక్కువకాకుండా వస్తాయని జోస్యాలు చెబుతున్నాయి. మేథావులు, విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని గట్టిగానే నమ్ముతున్నారు. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగునెలలు మాత్రమే అయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో నాలుగింటిని ఈ నాలుగు నెలల్లో అమల్లోకి తెచ్చేసింది. మిగిలిన వాటికోసం అవస్తలు పడుతోంది.

ఈ విషయాన్ని పక్కననెట్టేస్తే జనాలకు డైరెక్టు కాంటాక్టు ఉండేలా ప్రజావాణి అనే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. వారానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పబ్లిక్ ను కలిసి సమస్యలు విని పరిష్కారానికి పూనుకుంటున్నారు. ఈ విషయంలో రేవంత్ ను కేసీయార్ స్టైల్ ను జనాలు పోల్చి చూస్తున్నారు. అలాగే రేవంత్ పబ్లిక్ లో దూసుకుపోతున్నారు. రెగ్యులర్ గా సచివాలయంకు వస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, పార్టీ నేతలు, పబ్లిక్ ను కూడా ప్రతిరోజు కలుస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ వ్యక్తిగతంగా రేవంత్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజిని పెంచాయి. ఇదే సమయంలో ప్రభుత్వంపైన ఎక్కడా నెగిటివ్ రాలేదు. నెగిటివ్ లేకపోవటం కూడా ప్లస్సే కదా. కాబట్టి జనాల్లో కాంగ్రెస్ విషయంలో సానుకూలత కనబడుతోంది. ఈ సానుకూలతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా ప్లస్ అవుతుందని వివిధ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కేసీయార్ గ్రాఫ్ పడిపోతోందా ?

ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ కు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీపరంగా చేదు అనుభవాలను మిగులుస్తోంది. కేసీయార్, పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. పార్టీని వదిలేస్తున్న నేతలు, పార్లమెంటు టికెట్లు ఇచ్చినా పోటీ చేయనని చెబుతున్న నేతలు, టికెట్ వద్దని పార్టీని వదిలేస్తున్న నేతల వైఖరే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ ది బలపు అనుకున్న వాళ్ళకి అది బలుపు కాదు కేవలం వాపు మాత్రమే అని అర్ధమవుతోంది. అందుకనే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మహాయితే ఓ రెండుమూడు సీట్లలో గెలిస్తే చాలా ఎక్కువనే చర్చ పెరిగిపోతోంది.

ఇదే సమయంలో బీజేపీ విషయం చూస్తే స్లో అండ్ స్టడీ పద్దతిలో వెళుతోంది. బీఆర్ఎస్ ను వదిలేస్తున్న నేతల్లో అత్యధికులు కాంగ్రెస్ లో చేరుతున్నా కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటమే తెలంగాణాలో బీజేపీకి కలిసొస్తోంది. రాబోయే ఎన్నికల్లో పదిసీట్లలో గెలుపును బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నా అది సాధ్యంకాదని వాళ్ళకి కూడా తెలుసు. బీజేపీ టార్గెట్ ఏమిటంటే రెండోప్లేసులో ఉండటమే. బీజేపీ రెండోస్ధానంలో ఉండాలంటే బీఆర్ఎస్ ను మూడోప్లేసులోకి నెట్టేస్తే కాని సాధ్యంకాదు. ఇదే సమయంలో రెండోప్లేసు కోసం కేసీయార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రెండోస్ధానం కోసమే ఇపుడు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరుగుతోందని అర్ధమవుతోంది.

బీజేపీకి 35 శాతం ఓట్లొస్తాయా ?

మొన్న జరిగిన అసెంబ్లీఎన్నికల్లో సుమారు 14 శాతం ఓట్ల షేరుతో బీజేపీ ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచింది. ఈ దామాషా ప్రకారం చూస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 24 శాతం ఓట్లు రాబట్టుకోవాలి. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడి బీజేపీ నేతలతో మాట్లాడుతు పార్లమెంటు ఎన్నికల్లో పదిసీట్లు, 35 శాతం ఓట్లు సాధించాలని నిర్దేశించారు. మోడి నిర్దేశిస్తే ఓట్లు, సీట్లు వచ్చేస్తాయా ? రావు ఎందుకంటే లోకల్ లీడర్లలో జనాకర్షక నేతలు లేరు. తెలంగాణా నేతలను చూసికాకుండా మోడిని చూసి మాత్రమే జనాలు ఓట్లేయాలి. అందుకనే మోడి చెప్పినట్లుగా 35 శాతం ఓట్లు రాకపోవచ్చు.

అయితే బీజేపీకి ఓట్ల శాతం పెరిగేకొద్దీ బీఆర్ఎస్ ఓట్లకు గండిపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 37.5 శాతం ఓట్లతో 39 అసెంబ్లీలను గెలుచుకున్నది. కాబట్టి బీజేపీకి పెరిగే ప్రతి శాతం ఓటు బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టేయటం ఖాయం. అందుకనే రెండోప్లేసు కోసమే బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందనేది. బీఆర్ఎస్ గనుక రెండోప్లేసులో నిలిస్తే పార్టీ కొంతకాలం మనగలుగుతుంది. అలాకాకుండా మూడోప్లేసులోకి పడిపోతే సమీపభవిష్యత్తులోనే ఉనికికోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి.

Tags:    

Similar News