తెలంగాణలో వెల్లువెత్తిన వరదలు,పలువురిని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

తెలంగాణలో బుధవారం అతి భారీవర్షాలతో వరదలు వెల్తువెత్తాయి.;

Update: 2025-08-27 09:05 GMT
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో సహాయ , పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డిపేట మండలం అన్నాసాగర్ గ్రామంలోని కళ్యాణ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వద్ద ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయ చర్యలు చేపట్టింది. ఎస్డీఆర్ఎఫ్ జవాన్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదనీటిలో చిక్కుకున్న అయిదుగురిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. మరో నలుగురిని క్షేమంగా తీసుకువచ్చారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం గుంగల్ గ్రామం వద్ద ఒకరిని బాన్స్ వాడ ఫైర్ సిబ్బంది కాపాడారు.




 పలు జిల్లాలకు వరద హెచ్చరికలు

బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ వరద హెచ్చరికలను జారీ చేసింది.మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మబబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

రెండు జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసిన సీఎం
వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి, మెదక్​ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్​రెడ్డి అలర్ట్ చేశారు. వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కోరారు. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయం తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.



 దెబ్బతిన్న రైల్వేట్రాక్

కామారెడ్డిలో భారీవర్షాలకు రైల్వే ట్రాక్ దెబ్బతింది. తలమట్ల దగ్గర రైలు పట్టాల పైనుంచి వరద ప్రవాహం పోతోంది. దీంతో 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రైల్వే అధికారులు నాలుగు రైళ్లను దారి మళ్లించారు. రైల్వే సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయని దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించామని ఆమె పేర్కొన్నారు. పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డిజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆమె వెల్లడించారు. పది జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని ఆమె చెప్పారు.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.



 పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని, దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు వివరించారు.


Tags:    

Similar News