కేరళలో ఆధిక్యం దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ..
స్థానిక సంస్థల ఎన్నికలు: కొల్లం, త్రిస్సూర్, కొచ్చి కార్పొరేషన్లలో వెనకబడిన ఎల్‌డీఎఫ్ ; తిరువనంతపురంలో బీజేపీ హవా..
కేరళ స్థానిక సంస్థల (Kerala Local Body) ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యూడీఎఫ్(UDF) కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. కేరళలోని మొత్తం 1,199 స్థానిక సంస్థలకు ఇటీవల రెండు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మూడు కార్పొరేషన్ల(కొల్లం, త్రిస్సూర్, కొచ్చి) లో UDF ఆధిక్యంలో ఉంది. గతంలో కొల్లం కార్పొరేషన్ 25 ఏళ్ల పాటు, అలాగే త్రిస్సూర్ కార్పొరేషన్ పదేళ్ల పాటు ఎల్‌డీఎఫ్ ఆధీనంలో ఉన్నాయి. ఇక కోజికోడ్ కార్పొరేషన్‌లో ఎల్‌డీఎఫ్(LDF), యూడీఎఫ్ మధ్య పోరు కొనసాగుతోంది.
తిరువనంతపురం కార్పొరేషన్ 45 ఏళ్ల పాటు వామపక్షాల ఆధీనంలో ఉంది. అయితే ఈ సారి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) భారీ ఆధిక్యంలో ఉంది.
SEC ట్రెండ్స్ ప్రకారం ఉదయం 11.05 గంటలకు అధికార LDF 371, ప్రతిపక్ష UDF 389 గ్రామ పంచాయతీలలో ఆధిక్యంలో ఉంది. 55 మునిసిపాలిటీలు, 8 జిల్లా పంచాయతీలు, 76 బ్లాక్ పంచాయతీలు, 4 కార్పొరేషన్లలో కూడా యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఎల్‌డీఎఫ్ 29 మునిసిపాలిటీలు, 6 జిల్లా పంచాయతీలు, 64 బ్లాక్ పంచాయతీలు, ఒక కార్పొరేషన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ 28 గ్రామ పంచాయతీలు, ఒక బ్లాక్ పంచాయతీ, ఒక కార్పొరేషన్‌లో ఆధిక్యంలో ఉంది.
యూడీఎఫ్ వామపక్షాలకు వ్యతిరేకంగా శబరిమల ఆలయంలో బంగారం కేసును జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను ఎల్‌డీఎఫ్ జనంలోకి అంత సమర్థవంతంగా తీసుకెళ్లలేదని రాజకీయ విశ్లేషకుల మాట.