తెలంగాణ బీజేపీలో ఫుట్‌బాల్ పంచాయితీ
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్‌బాల్ వివాదంపై రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు.;
బీజేపీ ఆఫీసుకు పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్‌బాల్ తీసుకురావడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఆ తర్వాత తాను ఫుట్‌బాల్ తీసుకురావడానికి చెప్పిన కారణం తీవ్ర వివాదంగా మారింది. బీజేపీలో నాయకుల పరిస్థితులపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. నాయకులకు సరైన గుర్తింపే ఉండదా? నేతలంటే పార్టీ పరమైన పదవిలో ఉంటేనే ప్రాధాన్యతా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇంతలో ఈ అంశంపై బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలో 11 సంవత్సరాల పాటు ఫుట్‌బాల్ ఆడుకున్నారని, అదే విధంగా ఎంతో బాధను ఎదుర్కుంటేనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ ఆఫీసుకు ఫుట్‌బాల్ తీసుకొచ్చారని అన్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో ఫుల్‌బాల్ పంచాయితీ తీవ్ర దుమారం రేపుతోంది.
ఇది ఆరంభమే: రాజా సింగ్
‘‘నాతో 11ఏళ్ల పాటు బీజేపీ నేతలు ఫుట్‌బాల్ ఆడుకున్నారు. అదే విధంగా కొండా విశ్వేశ్వర్ విషయంలో కూడా వ్యవహరించారు. ఎంత బాధ అయి ఉంటే ఆయన పార్టీ నేతకు ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇస్తారు. రానున్న కాలంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు ఇే విధంగా పార్టీ నేతలకు ఫుట్‌బాల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ఖాయం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిన నాయకుడు. అలాంటి వ్యక్తిని పార్లమెంటులో మీ వ్యక్తులను పెట్టి ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు’’ అని ప్రశ్నించారు.
‘నా ఏరియాలో కిషన్‌కు ఏం పని?’
‘‘నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డికి చెందిన మనుషులను పెట్టి ఇబ్బంది పెట్టారు. కిషన్ రెడ్డికి నా ఏరియాలో మనుషులను పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం ఒకసారి సమీక్షించాలి. మాకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో పోటీ కాదు. సొంత పార్టీ నాయకులతో కొట్లాడాల్సిన పరిస్థితులు తెలంగాణ బీజేపీలో ఏర్పడ్డాయి. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?.. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు.. బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా.. బీజేపీ కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు రాజాసింగ్.
క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
పార్టీ ఆఫీసుకు ఫుట్‌బాల్ తీసుకురావడం, దానిని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఇచ్చారు. దీనిపై ఆయన బుధవారం మరోసారి స్పందించారు. తాను ఫుట్‌బాల్ ఎందుకు తెచ్చారు అనేది వివరించారు. ‘‘పార్టీ కార్యాలయానికి ఫుట్‌బాల్ తీసుకురావడం నిజమే. కాంగ్రెస్ పార్టీతో ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో చెప్పడానికే అలా చేశాను. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిలోనే లేదు. మాకు కాంగ్రెస్‌తోనే పోటీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు నాకు సంతృప్తి ఉండదు’’ అన్నారు. అయితే ఫుట్‌బాల్ వివాదంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్లేట్ ఫిరాయించడం ప్రస్తుతం కీలకంగా మారింది. మంగళవారం చేసిన వ్యాఖ్యలకు బుధవారం చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం కొత్త చర్చలకు తెరలేపాయి.
మంగళవారం ఏమన్నారంటే..
పార్టీ కార్యాలయానికి మంగళవారం వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తనతో పాటు ఫట్‌బాల్‌ను కూడా తీసుకొచ్చారు. దానిని చంద్రశేఖర్ తివారీకి బహుమతిగా ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్‌పాటిల్‌ను కలవమని చెబుతూ నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను’ అని వివరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీలో నేతల పరిస్థితి ఇదా? అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. కాగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆ జిల్లా అధ్యక్షుల తీరుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సమావేశాల్లో సమన్వయ లోపం ఉందని తివారీ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై ఫోకస్ పెట్టాలని, పార్ట బలోపేతానికి అంతా కలిసి పనిచేయాలని గుర్తు చేశారు.