మునుగోడులో ఎమ్మెల్యే సొంత చట్టాలా..?

వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించల్సిందేనంటున్న ఎమ్మెల్యే.

Update: 2025-10-14 08:10 GMT

మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సమాంతర పాలన నడిపిస్తున్నారా? అక్కడ తెలంగాణ చట్టాలు, నిబంధనలు వర్తించవా? ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు లిక్కర్ షాపుల వ్యవహారంలో రాజ్‌గోపాల్ రెడ్డి తన సొంత నిబంధనలు అమలవుతాయని చెప్పడమే కారణం. రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఎలా నడిచినా.. తన నియోజకవర్గంలో మాత్రం అన్ని చోట్ల తరహాలో నడవడానికి వీల్లేదని అంటున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణలో భాగమే కదా? అక్కడ కూడా ఇవే చట్టాలు, నిబంధనలు, జీవోలు అమలవుతాయిన కదా? మరి ఏంటి ఈ ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారు? అన్న చర్చలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో రేవంత్‌ను, పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ధరోణలే రాజ్‌గోపాల్‌లో ఎక్కువగా కనిపిస్తోందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కథ మొదలైంది ఇక్కడే..

తెలంగాణలో లిక్కర్ షాపుల లైసెన్స్‌ల కోసం అబ్కారీ శాఖ టెండర్లను పిలుస్తోంది. ఇటీవల ఈ టెందర్ల దరఖాస్తు ధరలను పెంచుతూ ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. లక్కీ డ్రా ప్రకారం.. టెండర్ విజేతను ఎంపిక చేస్తారు. ఈ టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న క్రమంలో.. మునుగోడులో లిక్కర్ షాపులు ఎక్కడ ఉండాలి, ఎంత సేపు తెరిచి ఉండాలి ఇలా అనేక అంశాలపై మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి సొంత నిబంధనలు పెట్టారు. అవి పాటించాల్సిందేనని చెప్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్ వేసే వారికి గమనిక అంటూ పాంప్లేట్స్‌ను పంచారు. దీంతో మునుగోడులో రాజ్‌గోపాల్ రెడ్డి సమాంతర పాలన నడిపిస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.

ఎక్సైజ్ పాలసీ మార్చాలి: రాజ్‌గోపాల్

మునుగోడులో వైన్స్‌ను నడవనివ్వనని రాజ్‌గోపాల్ స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజలతో ఉంటానని అన్నారు. తనకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, అందుకోసం ఏమైనా చేస్తానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నదవనీయన్నారు. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించల్సిందేనని తేల్చి చెప్పారు. ఎక్సైజ్ శాఖ పాలసీ మార్చడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ మార్చిన తర్వాత.. అందరూ అవే నిబందనలు పాటిస్తారు. కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి.. అక్కడ తన రూల్స్ పాటించాలని రాజ్‌గోపాల్ అనడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా ఆయన మునుగోడులో ప్రత్యేక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా? అన్న అనుమానాలకు కలిగిస్తోంది.

ఇన్నాళ్లూ ఏం చేశారు..?

నిజంగానే వైన్ షాపులను ఊరిబయటకు పంపాలని, ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యం అనుకుని ఉంటే రాజ్‌గోపాల్ ఇన్నాళ్లూ ఏం చేశారు? ఎంతో కాలంగా ఊళ్లలోనే వైన్ షాపులను నడిపిస్తున్నారు. ఇటీవల టెండర్లకు సంబంధించి ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. అబ్కారీ శాఖ కూడా టెండర్లను ఆహ్వానిస్తూ అధికారి ప్రకటన విడుదల చేసింది. అప్పుడు ఎందుకు రాజ్‌గోపాల్ స్పందించలేదు. నిజంగానే ప్రజల ఆరోగ్యం గురించి అంత తాపత్రయం ఉంటే.. ముందుగా సీఎం రేవంత్‌తో మాట్లాడి.. అబ్కారీ శాఖలో మార్పులు చేసుకోవాలి. కానీ.. ఇలా టెండర్లు వేసే సమయంలో ఈ సూచనలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తూ పాంప్లెట్లు పంచడం, ప్రకటన చేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాజ్‌గోపాల్ పెట్టిన నిబంధనలు ఇవే..

ఊరి బయట ఉండాల్సిన వైన్ షాపులను సెంటర్లో పెడుతున్నారని రాజ్‌గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర జిల్లా, మండలాలకు చెందిన వారు మునుగోడు షాప్స్‌కు టెండర్లు వేయొద్దన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఎక్సైజ్ శాఖ పాలసీని మార్చాలని, దీనిపై ప్రభుత్వంపై చర్చిస్తానని వెల్లడించారు.

సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకే మధ్యాన్ని విక్రయించాలి

వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి

సిట్టింగ్ నడపకూడదు

బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు

సిండికేట్ ఉండొద్దు

‘‘ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే నా ఉద్దేశం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక’’ అని రాజ్‌గోపాల్ వెల్లడించారు. ఆయన చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అక్టోబర్ 18 వరకు టైమ్ ఉంది..

వైన్ షాపుల టెండర్ల దరఖాస్తులకు అక్టోబర్ 18 వరకు సమయం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది అబ్కారీ శాఖ. జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. అయితే ఈ సారి దరఖాస్తు ఛార్జీలు భారీగా పెరిగాయి. గతంలో ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షలు ఉండగా దానిని తాజాగా రూ.3 లక్షలకు పెంచింది ప్రభుత్వం. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అక్బోటర్ 23న ఫాసులను లక్కీ డ్రా పద్దతిలో కేటాయిస్తారు. ఇందులో లైసెన్స్ పొందిన వాళ్లు అదే రోజు మొదటివిడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతల్లో చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు పొండే లైసెన్స్‌లు 1 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027 వరకు పనిచేస్తాయి.

Tags:    

Similar News